L2E Empuraan Movie Review : మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘L2E : ఎంపురాన్’ సినిమా నేడు మార్చ్ 27న థియేటర్స్ లో రిలీజయింది. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాణంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, ఆండ్రియా తివాదర్, ఇంద్రజిత్ సుకుమారన్, సాయికుమార్, సచిన్ ఖేదేకర్.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. లూసిఫర్ పార్ట్ 1కి కాస్త కొనసాగింపుగానే ఉంటుంది. స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్) కనపడకుండా వెళ్లిపోవడంతో స్టీఫెన్ నిలబెట్టిన కేరళ సీఎం జతిన్ రాందాస్(టోవినో థామస్) తన తండ్రి ఆశయాలు కాదని అవినీతి పరుడుగా మారి కొత్త పార్టీ పెట్టి ఓ నేషనల్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దమవుతాడు. జతిన్ అక్క ప్రియ(మంజు వారియర్) అతన్ని వ్యతిరేకించి తన తండ్రి ఆశయాల కోసం నిలబడుతుంది. దీంతో కొంతమంది ప్రియని చంపాలని చూస్తారు.
మరోవైపు అబ్రామ్ ఖురేషి(మోహన్ లాల్)ని చంపాలని యూకే ఇంటిలిజెంట్ వెతుకుతుంది. అతను ఓ చోటకి వస్తున్నాడని తెలిసి అతన్ని చంపే మిషన్ ఏజెంట్ మెన్‌హున్(ఆండ్రియా తివారి)కి అప్పచెప్తారు. మెన్‌హున్ కూడా తన తోటి ఏజెంట్ ఫ్రెండ్ ని చంపినందుకు అబ్రామ్ ఖురేషిని చంపాలనుకుంటుంది. మరి అబ్రామ్ ఖురేషిని చంపారా? ప్రియని ఎవరు కాపాడారు? స్టీఫెన్ నెడుంపల్లి తిరిగి వచ్చాడా? జతిన్ రాందాస్ తండ్రి పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడు? అబ్రామ్ ఖురేషి దగ్గరుండే జైద్ మసూద్(పృథ్వీరాజ్ సుకుమారన్) కథేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : RC 16 Title : ఆర్‌సీ16 టైటిల్ ఇదే.. రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్ అదిరిందిగా..
సినిమా విశ్లేషణ.. ఒక డాన్ లాంటి పెద్ద వ్యక్తి.. ఫ్లాష్ బ్యాక్ పక్కనపెట్టి సింపుల్ జీవితం గడపడం అనేది భాషతో సహా అన్ని పరిశ్రమలలో చాలా సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. అదే తరహాలో కాస్త పొలిటికల్ డ్రామా జోడించి 2019 లో లూసిఫర్ సినిమా రాగా అది పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ అనడంతో L2 : ఎంపురాన్ పై అంచనాలు నెలకొన్నాయి. అది అన్ని భాషల్లో ఆదరణ రావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తీసి రిలీజ్ చేసాడు.
అయితే ఇటీవల కొంతమంది చేస్తున్న తప్పునే పృథ్వీరాజ్ కూడా చేసాడు. పాన్ ఇండియా మోజులో అసలు కథని వదిలేసి దాని చుట్టూ ఇంకో కథని అల్లుకొని, దాన్ని ఇంటర్నేషనల్, నేషనల్ లెవల్స్ కి కనెక్ట్ చేయాలని చూసాడు. ఈ సినిమా అందరూ అసలు స్టీఫెన్ అబ్రామ్ ఖురేషి ఎలా అయ్యాడు అని చూడటానికి వస్తే అది వదిలేసి మళ్ళీ అబ్రామ్ ఖురేషీకి ఓ నాలుగు ఎలివేషన్స్, కేరళ రాష్ట్ర రాజకీయాలు, మత ఘర్షణలు, జైద్ మసూద్ కథ చూపించారు. మోహన్ లాల్ కి కొన్ని ఎలివేషన్స్ తప్ప సినిమాలో అసలు కథేమీ లేకుండా చేసారు. సినిమా చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కి అసలు కథ అంతా మోహన్ లాల్ ది కాదా అని నిరాశ వ్యక్తం చేస్తారు ప్రేక్షకులు. లూసిఫర్ సక్సెస్ కి కారణాల్లో ఒకటి ఎమోషనల్ పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో ఆ పొలిటికల్ డ్రామానే మిస్ అయింది.
అప్పుడప్పుడు పొలిటికల్ పార్టీలకు వ్యతిరేకంగా, సపోర్ట్ గా సినిమాలు వస్తాయని తెలిసిందే. ఈ L2E : ఎంపురాన్ సినిమా కేరళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఓ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ కొన్ని పార్టీలకు సపోర్ట్ గా చూపించినట్టు అనిపిస్తుంది. అసలు లూసిఫర్ కథకు ఏ మాత్రం సంబంధం లేని గుజరాత్ అల్లర్లను కథలో జొప్పించారు. అదికూడా వీళ్ళ కథకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకొని చూపించినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్, డైలాగ్స్ కి సెన్సార్ బోర్డు కట్ చెప్పలేదా అని సందేహం వ్యక్తమవుతుంది. ఇక అందరూ ఊహించిన స్టీఫెన్ అబ్రామ్ ఖురేషి గా ఎలా మారాడు అనేది పార్ట్ 3 లో చూపిస్తాం అంటూ ఇంకో సీక్వెల్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. అప్పటికి కూడా ఆ కథ చూపించకపోతే మరో సీక్వెల్ అనవసరం.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మలయాళం స్టార్ మోహన్ లాల్ గ్రేట్ యాక్టర్ కానీ ఈ సినిమాలో ఎలివేషన్ షాట్స్ తప్ప పెద్దగా కష్టపడింది లేదు. పృథ్విరాజ్ సుకుమారన్ కూడా కాసేపే కనిపించి ఓకే అనిపిస్తాడు. మంజు వారియర్ రాజకీయ నాయకురాలిగా బాగా నటించింది. టోవినో థామస్ సీఎం పాత్రలో అక్కడక్కడా కనిపిస్తాడు. బాబా బజరంగ్ పాత్రలో అభిమన్యు సింగ్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టేసాడు. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ కాసేపే కనిపించినా బాగానే నటించాడు. పార్ట్ 1 లో ఉన్న చాలా పాత్రలు ఇందులో కూడా అలాగే కంటిన్యూ అవుతాయి. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాలో కథ బలంగా లేకపోయినా సాంకేతికంగా మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ లో సినిమాటిక్ షాట్స్ వావ్ అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఉన్న ఒక్క సాంగ్, బ్యాక్ గ్రౌండ్ సాంగ్ యావరేజ్. కథాపరంగా అనేక దేశాలు చూపించి మంచి మంచి లొకేషన్స్ ని చూపెట్టారు. లొకేషన్స్ విషయంలో మెచ్చుకోవలసిందే. లూసిఫర్ కథ కొనసాగింపుకు మరో కథ జోడించి అసలు కథని వదిలేసినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బలంగా రాసుకున్నారు. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి దర్శకుడిగా తన బెస్ట్ ఇచ్చాడు. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. మలయాళం సినిమాల్లో బాగా ఖర్చుపెట్టిన సినిమాగా నిలిచింది.
మొత్తానికి లూసిఫర్ సీక్వెల్ గా వచ్చిన ‘L2E : ఎంపురాన్’ సినిమా అసలు కథకు కొసరు కథ జోడించి కొత్త స్క్రీన్ ప్లేతో చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.