‘మా’ అసోసియేషన్‌లో చేరేవారికి డిస్కౌంట్: 100రోజులు మాత్రమే!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2019నుంచి 2021కి గానూ కీలక నిర్ణయాలు తీసుకుంది. మా అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ఈ భేటిలో పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్వత్వం తీసుకున్న సభ్యులు సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 9502030405కి డయల్ చేయాలని వారు సూచించారు.
పింఛనుదారులకు గతంలో అందించే పింఛనుకు అదనంగా రూ.1000 పెంచి రూ. 6 వేలను వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. పింఛనుదారుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూ.1000 పెంచినట్లు ‘మా’ అసోసియేషన్ వెల్లడించింది. వారికి పెంచిన రూ.వెయ్యి వైద్యానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
అలాగే ‘మా’ అసోసియేషన్‌లో రూ. 25 వేలు చెల్లించి కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి గోల్డ్‌కార్డు అందజేస్తామని అన్నారు. దీని కాలపరిమితి రెండేళ్లు ఉంటుందని.. ఈ రెండేళ్లలో మిగతా రూ.75 వేలు చెల్లిస్తే వారికి లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ కార్డు అందజేస్తామని అన్నారు. శాశ్వత సభ్యునిగా గుర్తింపు పొందనంత వరకు ‘మా’ సౌకర్యాలు వర్తించవని చెప్పారు.
అలాగే ఒకేసారి రూ.90 వేలు కడితే రూ.10 వేల డిస్కౌంట్ ఇచ్చి లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ కార్డు ఇస్తామని చెప్పారు. ఈ అవకాశం రూ.100రోజులు మాత్రమే ఉంటుందని ‘మా’ అసోసియేషన్ చెప్పింది. మా సభ్యులందరికీ గతంలో రూ.2 లక్షల వరకు ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను వర్తింపజేశారని, ఇప్పుడు అదనంగా మరో రూ.లక్ష పెంచి రూ.3 లక్షల బీమా అందజేయనున్నట్లు వివరించారు.