Naga Chaitanya Sai Pallavi Thandel Movie Review and Rating
Thandel Movie Review : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తండేల్ సినిమా నేడు ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. రాజు(నాగ చైతన్య) బుజ్జి తల్లి(సాయి పల్లవి) చిన్నప్పటినుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. మచ్చలేశం అనే ఊరు వాళ్ళు గుజరాత్ వెళ్లి ఒక తొమిది నెలలు సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు. రాజు వాళ్ళ నాన్న కూడా అదే పని చేసేవాడు. రాజు కూడా అలాగే వెళ్లేవాడు. రాజు వేటకు వెళ్ళిన నెలలు బుజ్జి తల్లి రాజుని గుర్తు చేసుకుంటూ గడిపేస్తుంది. తెలిసిన వాళ్లలో ఒకరు వేటకు వెళ్లి చనిపోవడంతో బుజ్జి తల్లికి రాజుకి కూడా ఏమైనా అవుతుందేమో అని కంగారు పడి వేటకు వెళ్లొద్దు అంటుంది. కానీ రాజు బుజ్జి తల్లి మాట వినకుండా తాను తండేల్(నాయకుడు అని అర్ధం) కావడంతో తనని నమ్ముకున్న మత్స్యకారుల కోసం వేటకు వెళ్తాడు.
దీంతో బుజ్జి తల్లి రాజుని దూరం పెడుతుంది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి ఒడ్డు మీద ఉన్నప్పుడే కాల్ చేసి ఒకసారైనా మాట్లాడి వెళ్దాం అనుకుంటాడు. కానీ బుజ్జి తల్లి దూరం పెడుతుంది తన మాట వినకుండా వేటకు వెళ్ళిపోయాడని రాజుని మర్చిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. పెళ్లి సంబంధం కూడా ఓకే చేస్తుంది. అంతలో రాజు, అతనితో వెళ్లిన వాళ్ళు అంతా సముద్రంలో తుఫాను రావడంతో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవి ఆఫీసర్స్ కి చిక్కి పాకిస్తాన్ జైలుకి వెళ్తారు. మరి రాజు, మిగిలిన మత్య్సకారులు పాకిస్థాన్ జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎలా బయటకు వచ్చారు? వాళ్ళు బయటకు రావడానికి బుజ్జితల్లి ఏం చేసింది? వాళ్ళు పాకిస్థాన్ కి చిక్కుకున్నాక ఊళ్ళో పరిస్థితులు ఏంటి? అదే సమయంలో పాకిస్థాన్ లో ఎందుకు అల్లర్లు చెలరేగాయి?.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also See : తండేల్ నుంచి దేశభక్తి సాంగ్ ‘ఆజాదీ..’ రిలీజ్.. విన్నారా?
సినిమా విశ్లేషణ.. శ్రీకాకుళం దగ్గర్లో ఉండే కొంతమంది మత్స్యకారులు గుజరాత్ కి వేటకు వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పాకిస్థాన్ అధికారులకు పట్టుబడిన 22 మంది ఎలా తిరిగి ఇండియాకు వచ్చారు అని రియల్ గా జరిగిన కథను ప్రేమకథ జోడించి తెరకెక్కించారు తండేల్ సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా రాజు – సత్యల ప్రేమ, వాళ్ళ ప్రేమలో దూరం, వేటకు వెళ్లడం చూపించి ఇంటర్వెల్ కి పాకిస్థాన్ ఆఫీసర్స్ కి చిక్కడం చూపించి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ లో మత్స్యకారులు పాకిస్థాన్ జైల్లో ఎలా ఉన్నారు? వాళ్ళు బయటకు రావడానికి బుజ్జితల్లి, ఊరి వాళ్ళు ఏం చేసారు అని చూపించారు.
ఇది రియల్ కథ తీసుకున్నా అది సినిమాలో ఒక పాయింట్ మాత్రమే. సినిమా మెయిన్ కథ లవ్ స్టోరీనే. రాజు – బుజ్జితల్లి లవ్ స్టోరీని చాలా అందంగా రాసుకున్నారు. ప్రేమ కథలు అంటే ఒకరికొకరు దగ్గరగా ఉండి ప్రేమించుకునే కథలు ఇప్పటివరకు చూసాం. కానీ ఒకరికొకరు నెలల తరబడి దూరంగా ఉన్నా ఆ దూరంలో ఉండే ప్రేమని కొత్తగా చూపించారు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇంట్లో వాళ్ళ కోసం మగవాళ్ళు ఎంత కష్టపడతారు, మగవాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్లు ఏడుస్తూ పంపకూడదు, ఆడవాళ్ళని ఏడిపించకూడదు.. అని ఇలాంటి డైలాగ్స్ తో ఉన్న సీన్స్ బాగా పండి మంచి ఎమోషన్ ని ఇచ్చాయి. ప్రతి సీన్ లోను చాలా డిటైలింగ్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.
చాలా సీన్స్ లో కచ్చితంగా కన్నీళ్లు పెడతారు ప్రేక్షకులు. దూరంగా ఉండే ప్రేమ ఎంత బాగుంటుందో దర్శకుడు బాగా చూపించాడు. లవర్స్ కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండ్ హాఫ్ పాకిస్థాన్ జైలు సన్నివేశాలు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దేశభక్తి పాయింట్ లో రాసుకున్నారు. అలాగే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. చివరి అరగంట ఓ పక్క ప్రేమ ఎమోషన్ మరో పక్క నాయకుడు ఎలా ఉండాలి అనే ఎమోషన్ కలిపి బాగా చూపించారు. రియల్ కథలో మత్స్యకారులు బయటకు రావడానికి అప్పటి కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్, ఆ తర్వాత ఆమె కూతురు తీసుకున్న చొరవని కూడా చూపించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నాగ చైతన్యకు తండేల్ కెరీర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రేమ కథల్లో అక్కినేని హీరోలని కొట్టే వాళ్ళు ఉండరని తెలిసిందే. ప్రేమికుడిగా అలరిస్తూనే నాయకుడిగా మెప్పిస్తాడు. ఇక సాయి పల్లవి నటన గురించి అందరికి తెలిసిందే. చాలా సహజంగా ఒక మంచి ప్రేమికురాలిగా, తన ఊరి వాళ్ళ కోసం పోరాడిన మహిళగా అద్భుతంగా నటించింది. చైతు – సాయి పల్లవి పెయిర్ అయితే అద్భుతంగా సెట్ అయింది.
దివ్య పిళ్ళై సాయి పల్లవి వదిన పాత్రలో మెప్పించింది. పాకిస్థాన్ జైలర్ గా ప్రకాష్ బెలవాడి బాగా నటించాడు. సాయి పల్లవి తండ్రిగా బబ్లూ పృథ్వీరాజ్ సరికొత్త పాత్రలో అలరించాడు. తమిళ నటులు ఆడుకాలం నరేన్, కరుణాకరన్ ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. మత్స్యకారులుగా రంగస్థలం మహేష్, పార్వతీశం, మరికొంతమంది బాగానే నటించారు..
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగా ప్లస్ అయ్యాయి. ప్రేమ కథలకు ఎంత అందంగా ఉండాలో కెమెరా విజువల్స్ అంత అందంగా ఉన్నాయి. రియల్ సముద్రంలో తీసిన షాట్స్ అన్ని కూడా బాగున్నాయి. తుఫాన్ సీక్వెన్స్ ని కూడా బాగా చిత్రీకరించారు. సినిమాకు మరో ప్లస్ అయింది మ్యూజిక్. ఆల్రెడీ రిలీజ్ కి ముందే పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టి దేవిశ్రీ ప్రసాద్ అంటే లవ్ స్టోరీలకు పెట్టింది పేరు అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఊరి సెట్, మత్స్యకారుల పనిముట్లు, జైలు సెటప్.. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంది. సినిమాకు డైలాగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. కథ – స్క్రీన్ ప్లేని పర్ఫెక్ట్ గా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు చందూ మొండేటి. నిర్మాణపరంగా ఈ సినిమాకు చైతు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 90 కోట్లు పెట్టారని సమాచారం. ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మరి ఇది కలెక్షన్స్ లో చైతన్యకు మొదటి 100 కోట్ల సినిమా అవుతుందేమో చూడాలి.
మొత్తంగా ‘తండేల్’ సినిమా ఓ చక్కటి ప్రేమకథతో పాటు మత్స్యకారుల సాహసమైన జీవితం. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.