Nampally Court Grants Regular Bail to Allu Arjun Over Pushpa 2 Sandhya Theatre Stampede
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇటీవలే వాదనలు ముగియగా శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. రూ. 50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో వేశారు. అయితే.. ఆ సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ వచ్చేసింది..
వెంటనే అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. రిమాండ్ గడువు ముగియడంతో డిసెంబర్ 27న అల్లు అర్జున్ వర్చువల్‌గా నాంపల్లి కోర్టుకు హాజరు అయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయంలో కోరడంతో డిసెంబర్ 30కి విచారణ వాయిదా పడింది.
డిసెంబర్ 30న పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా.. ఇరు వైపులా వాదనలు ఉన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాజాగా అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను ఇచ్చింది.
కాగా.. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప 2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందించింది. అల్లు అర్జున్ కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు అందించారు.