శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నేవేశాలున్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. మాజీ పైలట్ గుంజన్ సక్సేనా కూడా ఐఏఎఫ్‌కు అనుకూలంగానే మాట్లాడారు. తాను వాయుసేనలో ఉద్యోగం చేసేటప్పుడు పురుషులతో సమానమైన అవకాశాలు లభించేవని, పై అధికారులు కూడా తనకు ఎంతో అండగా ఉన్నారని ఆమె తెలిపారు. దీంతో సినిమా తెరకెక్కిన విధానంపైనే విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఓ పెద్ద షాక్ ఇచ్చింది.
వాయుసేనను కించపరుస్తూ తీసిన ఈ సినిమాను ప్రదర్శించవద్దని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ దీనిపై ఓ ట్వీట్ చేశారు. ‘మన సేనలపై మనమే అసత్య ప్రచారం ఎందుకు చేయాలి..? వాటి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా తక్కువ చేసి ఎందుకు చూపించాలి..? వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయండి. అంతేకాకుండా వాయుసేనకు చిత్ర నిర్మాతలు క్షమాపణ చెప్పాలం’టూ ఆమె ట్వీట్ చేశారు. అయితే దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.