కొమరం భీంగా ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్..

  • Publish Date - January 15, 2020 / 05:13 AM IST

బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో రెండు పెద్ద కుటుంబాలు అయిన నందమూరి, మెగా కుటుంబాల నుంచి అగ్రనటులు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. 

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్‌డేట్ వచ్చినా కూడా వారి సంతోషానికి అవదులు ఉండవు. అటువంటిది ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్న మాట వాస్తవం. ఈ సినిమా ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఏదైనా పండుగలు వస్తే వాటి పోస్టర్‌లు మాత్రమే పెడుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే లేటెస్ట్‌గా అభిమానులు సంక్రాంతి సంధర్భంగా.. ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన పెయింటింగ్, డ్రాయింగ్‌లను విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తుండగా.. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే వారి లుక్‍‌కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నారు. వీరితో పాటు అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’నే మొయిన్ టైటిల్‌గా ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది చిత్రయూనిట్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో ఈ మూవీ జూలై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది.