Oka Manchi Prema Katha
Oka Manchi Prema Katha : రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఒక మంచి ప్రేమ కథ’. హిమాంశు పోపూరి నిర్మాణంలో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.(Oka Manchi Prema Katha)
మీరు కూడా ఒక మంచి ప్రేమకథ ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ.. కుటుంబరావు గారి తోడు సినిమా నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన సినిమా తీయడం సంతోషంగా ఉంది. నేను, రోహిణి గారు చాలా ఏళ్ల క్రితం కలిసి నటించాం. ఇప్పుడు మళ్ళీ కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూస్తే ఆడియెన్స్ కోప్పడతారు మా సినిమాను ముందుకు తీసుకువెళ్తున్న ఈటీవీ విన్ టీంకు థాంక్స్ అని అన్నారు.
సీనియర్ నటి రోహిణి హట్టంగడి మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల క్రితం కుటుంబరావు గారు, ఓల్గా గారు ఓ సినిమా కోసం నన్ను అడిగారు. అప్పుడు అది అవ్వలేదు. ఇప్పుడు ఈ కథను చెప్పిన వెంటనే ఒప్పుకున్నాను. రోహిణి, నేను కలిసి మలయాళంలో ఎప్పుడో ఓ సినిమాను చేశాం. ఈ కథ నాకెంతో నచ్చింది అని తెలిపారు. నిర్మాత హిమాంశు పోపూరి మాట్లాడుతూ.. ఒక మంచి ప్రేమకథ స్టోరీ విన్న వెంటనే కనెక్ట్ అయ్యాను. ఇందులో ఓ పాత్రని కూడా చేశాను ఈ సినిమా అందరికి నచ్చుతుంది అని అన్నారు.
రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. ఈ కథను చిన్నగా రాసుకున్నాను. సినిమాగా తీస్తే బాగుంటుందని చాలా మంది చెప్పడంతో సినిమా కథగా మార్చాను. రోహిణి ముల్లేటి గారు ముందు నుంచీ ఈ కథతో ప్రయాణం చేశారు. సముద్రఖని గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు డేట్లు ఇచ్చారు. 1985 నుంచి 2017 వరకు నేను రాసిన ప్రతీ నవల చతురలో వచ్చింది. నేను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లోనూ చాలా కాలం పని చేశాను. మళ్లీ ఇప్పుడు నా సినిమా ఈటీవీ విన్‌లో రావడం ఆనందంగా ఉంది. పెద్దవాళ్లందరూ కలిసి నటించిన సినిమా అయినా ఇది యువతరానికి సంబంధించిన కథ అని తెలిపారు.
Also Read : Vishnu Priya : తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి వ్యాఖ్యలు వైరల్..
దర్శకుడు అక్కినేని కుటుంబరావు మాట్లాడుతూ.. సినిమాకి స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో ఆర్టిస్టులు అంత ముఖ్యం. గుమ్మడి గారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తోడు సినిమాలో రోహిణి హట్టంగడి గారిని తీసుకు లేకపోయాను. మళ్ళీ 37 ఏళ్ల తరువాత ఈ కథ చెప్పడానికి వెళ్లాను. కోట్లు సంపాదించేందుకు పరుగులు పెడుతున్నారు కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు అనే కథాంశంతో ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను అని తెలిపారు.