Shihan Hussaini : పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూత.. ఇంతలోనే ఇలాంటి వార్త వినడం బాధాకరం అంటూ ఎమోషనల్ పోస్ట్..

తన గురువు మరణించడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Pawan Kalyan Martial Arts Teacher Shihan Hussaini Passed Away

Shihan Hussaini : పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని షిహాన్ హుస్సైనీ అనే సీయర్ మార్షల్ ఆర్ట్స్ గురువు వద్ద పవన్ శిక్షణ తీసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా షిహాన్ హుస్సైనీ పవన్ కి మొదట నో చెప్పినా రోజంతా నిలబడి నన్ను ఒప్పించి ఎంతో కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని తెలిపారు. గత కొన్ని రోజులుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న షిహాన్ హుస్సైనీ చికిత్స తీసుకుంటూనే మరణించారు.

తన గురువు మరణించడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Also See : Kannappa Movie Trolls : కన్నప్ప సినిమాని ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు..!

పవన్ తన పోస్ట్ లో.. ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సైనీ గారిని పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.చెన్నైలో హుస్సైనీ గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ‘ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు’ అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు, నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సైనీ గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. హుస్సైనీ గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్ళేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సైనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు, ఆయన శిష్యులు షిహాన్ హుస్సైనీకి నివాళులు అర్పించారు.