Pawan Kalyan : ఆయన క్రేజ్ ఆకాశం అంత ఎత్తు.. ఆయన ఓపిక భూదేవి అంత సహనం.. ఆయన కోపం అగ్ని అంత ప్రమాదం.. ఆయన మనసు సముద్రం అంత లోతు..
ఆయన ఆలోచనలు గాలి కంటే వేగం.. ఇది పవన్ కళ్యాణ్ ని దేవుడిలా కొలిచే సగటు అభిమాని మదిలో ఆయనకు ఉన్న స్థానం..(Pawan Kalyan)
ఎక్కడి కళ్యాణ్ బాబు.. ఎక్కడి పవన్ కళ్యాణ్.. ఎక్కడి పవర్ స్టార్.. ఎక్కడి జనసేనాని.. చిరంజీవి తమ్ముడు హీరోగా సినిమా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అని ఎదురుచూసారు. ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ పోస్టర్ రిలీజయినప్పుడు బక్కగా ఉన్నాడు, ఇలా ఉన్నాడేంటి అన్నారు. ఫస్ట్ సినిమా జస్ట్ హిట్ అయింది. చిరంజీవి తమ్ముడు అని అందరూ వచ్చారు కాబట్టి.
చిరంజీవి తమ్ముడు
కానీ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ నుంచి బయటకు రావడానికి ఎంతో టైం పట్టలేదు. వరుసగా హిట్స్ మీద హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్. కానీ జానీతో ఆకాశం మీద నుంచి కిందకు పడ్డాడు. ఒక్కసారిగా సినీ పరిశ్రమలో మనుషుల నిజ స్వరూపాలు చూసాడు పవన్. అయినా అదరలేదు బెదరలేదు. ఫ్యాన్స్ ని మెప్పించడానికి ‘జల్సా’ చేస్తే సరిపోదు అందరితో ‘బంగారం’ అనిపించుకోడానికి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సరైన హిట్ పడటానికి పదకొండేళ్లు పట్టింది. ‘గబ్బర్ సింగ్’ గా ఇండస్ట్రీని ఊపేసాడు. ఫ్యాన్స్ లో క్రేజ్ అమాంతం పెరిగింది. అప్పటిదాకా ఉన్న ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ అయ్యారు, భక్తులుగా మారారు. అప్పుడు మొదలైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేటికీ పెరుగుతూనే ఉంది.
అసలు పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్, స్టైల్, నడిచే విధానం.. ప్రతిదీ అప్పట్లో ఒక స్టైల్. ఇప్పటికి పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్. ఏదో రాజకీయంగా వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతున్నాడు కానీ ఇటీవల OG షూట్ టైంలో బ్లాక్ హుడీ వేసి కళ్ళజోడు పెట్టి ఒక్కసారి బయట కనపడ్డాడు అంతే.. ఇది కదా పవన్ కళ్యాణ్ స్టైల్ అని మరోసారి అంతా వైరల్ అయింది. మొదట్నుంచి తన సినిమాలతో యూత్ ని తన వైపుకు తిప్పుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కి ఎందుకంత క్రేజ్..?
ఎన్ని హిట్స్ కొట్టాడో అంతకంటే ఎక్కువ ఫ్లాప్స్ కొట్టాడు. గబ్బర్ సింగ్ ముందు హిట్ కొట్టి పదేళ్లయినా క్రేజ్ తగ్గలేదు సరికదా కొత్త ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అందరికి అభిమానం, ఎందుకు ఆయనంటే అందరికి క్రేజ్, ఎందుకు పవన్ అంటే అందరికి ఇష్టం, ఎందుకు టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. హిట్స్ కొట్టాడు అనా? ఆయన కంటే ఎక్కువ హిట్స్ కొట్టిన హీరోలు ఉన్నారు. డ్యాన్సులు అంటే అబ్బే.. కాస్త కష్టంగానే చేస్తాడు. రాజకీయాల్లోకి వచ్చే ముందు వరకు ఫ్యాన్స్ ని ఎక్కువగా కలేసేవాడు కాదు, మీడియాకు దూరంగా ఉంటాడు. అందంగా ఉంటాడు కానీ ఆయన కంటే అందంగా ఉన్న హీరోలు ఉన్నారు. అవార్డులు కూడా వేరే హీరోల కంటే తక్కువే. ఇపుడు హీరోలకు ఉన్నట్టు వేల కోట్ల కలెక్షన్స్ కూడా లేవు. స్టైల్ తో యూత్ ని అట్రాక్ట్ చేసాడు మరి పిల్లలు, పెద్దలు, అమ్మాయిల్లో ఫ్యాన్స్ ఎందుకు? ఫైట్స్ మాత్రం అందరికి డిఫరెంట్ గా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండటంతో మెప్పించాడు.
మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అంటారు చాలా మంది అంటే.. వీటన్నిటిని మించి చేసే పనిలో నిజాయితీ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, పక్కన మనిషిపై చూపించే మానవత్వం, కష్టం అని వచ్చినవాడికి చేసే సాయం.. ఇవి కదా పవన్ ని అందరి హీరోలకు డిఫరెంట్ గా చూపించి అందనంత ఎత్తులో పెట్టింది. కానీ సినిమాల్లో ఎంత స్టైలిష్ గా ఉంటాడో రాజకీయాల్లో అంతే సింపుల్ గా ఉంటాడు.
Also See : Sena tho Senani : సేనతో సేనాని.. వైజాగ్ జనసేన భారీ బహిరంగ సభ.. ఫొటోలు..
ఇప్పుడంటే ఆయనేదో రాజకీయాల్లోకి వెళ్లాడని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఆయన సినిమాలు ఆడట్లేదు, ఆయనకు ఫ్యాన్స్ లేరు అని ఫ్యాన్స్ వార్స్ చేస్తున్నారు. కానీ మీకు ఇంద్ర సినిమా వంద రోజుల వేడుక గుర్తుందో లేదో. 2002లో ఇంద్ర సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ రావాల్సింది కానీ కుదరలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఒక 5 నిమిషాల వరకు జనాలు, ఫ్యాన్స్ నుంచి అరుపులు, కేకలతో అభినందన హోరు తగ్గలేదు, ఆ రేంజ్ లో అప్పట్లోనే పవన్ కి క్రేజ్ ఉంది. ఆ రెస్పాన్స్ చూసి మెగాస్టార్ కూడా ఆశ్చర్యపోయి ఆనందపడి తమ్ముడు పవన్ కి చెప్తాను అన్నారు. సినిమాల్లోకి అన్నయ్య చేతిని పట్టుకొని వచ్చి అన్నయ్య క్రేజ్ నే మించిన నటుడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ ఇది ఒప్పుకోడు. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు కాబట్టి.
సినిమాల్లో చూడాల్సిన స్టార్ డమ్ తక్కువ కాలంలోనే చూసేసాడు. సాధించాల్సిన ప్రజాభిమానం అంతా సాధించేసాడు. కానీ ప్రజలకు, సమాజానికి ఏదో చేయాలనే కసి ఉండేది. దాంతోనే CMPF మొదలుపెట్టాడు. అప్పుడే అన్నయ్య ప్రజారాజ్యం పెట్టడంతో సపోర్ట్ చేసాడు. కానీ అనుకోకుండా ప్రజారాజ్యం కనుమరుగైంది. కొన్ని ఏళ్ళు సమయం తీసుకున్నాడు.. ఆలోచించుకున్నాడు.. ఆచరణలో పెట్టాలి అనుకున్నాడు. కుటుంబాన్ని వదిలి, లగ్జరీని వదిలి, సుఖాలను వదిలి జనాల్లోకి వచ్చాడు.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ జనాల కోసం సైనికుడిగా నిలబడతాను అని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్నయ్యే ఏం చేయలేకపోయాడు తమ్ముడు ఏం చేస్తాడు అన్నారు. రాష్ట్రాన్ని మారుద్దాం, ప్రజల్ని బాగు చేద్దామని వచ్చాడు. అందుకే ఎవరు వస్తే బాగుంటుంది అని వాళ్లకు సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత పరిస్థితులు మారాయి. రాజకీయాలు అర్థమయ్యాయి. జనాలకు ఏమైనా చేయాలంటే డబ్బు, స్టార్ డమ్ సరిపోదు.. పవర్ ఉండాల్సిందే అని అర్ధం చేసుకున్నాడు.
విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగోలేవు.. అని తనకు కనపడిన ప్రతి సమస్యలను బయటకు తీసాడు. పల్లెల్లో తిరిగాడు. ఏ రాజకీయ నాయకుడు తిరగని మన్యం అడవుల్లో ఉన్న గిరిజనుల దగ్గరకు వెళ్ళాడు. అభిమానులతో కలిసాడు. ఉద్దానం సమస్యను బయట పెట్టాడు, జనాల్లో తిరిగాడు, జనాల్లోనే తిన్నాడు, జనాల్లోనే నిదురించాడు. ప్రతి చోట ఉన్న సమస్యను తెలుసుకున్నాడు జన సైనికుడు.
Also Read : Pawan Kalyan : అల్లు అర్జున్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
ఇతన్ని చూసి భయపడ్డారు, రాజకీయ నాయకుడు అంటే జనాలతో ఇలా ఉంటారా? జనాలు తెచ్చే సమస్యలను ఇలా వింటారా? అందరితో ఇలా మాట్లాడతారా అని ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ గా ఉండే పవన్ రాజకీయాల్లో తన స్పీచ్ లతో అదరగొట్టేసాడు. తన రాష్ట్రంలోకి తనను అడుగుపెట్టనివ్వకుండా బోర్డర్ లో ఆపేసారు. భయపడలేదు. జనసైనికులు, అభిమానుల తోడుతో నిజాయితీగా నిలబడి ఎదుర్కున్నాడు. అప్పుడు అర్థమైంది పవన్ కి అసలు సిసలు రాజకీయం అంటే. రాజకీయం చేసి చూపిస్తాను అని చెప్పి మరీ చేసాడు పవన్. రాష్ట్రంలో పెద్ద పార్టీ, దేశంలో పెద్ద పార్టీ రెండిటిని కలిపాడు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా పవన్ సరికొత రికార్డ్ సృష్టించాడు.
డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం అనే పదవికి కొత్త పవర్ తెచ్చాడు పవన్. పవన్ గెలిచినప్పుడు ఆయన కుటుంబం, ఫ్యాన్స్, జనసైనికులు కళ్ళల్లో నీళ్లు పెటుకున్నవాళ్ళే. ఎందుకంటే పడిన వాడు ఎప్పటికైనా లెగుస్తాడు. కానీ జనాల కోసం పడి మళ్ళీ జనాల కోసమే లేచి నిల్చున్న నాయకుడు పవన్. అందుకే ఆయన్ని అందరూ తమ అనుకున్నారు. ప్రమాణ స్వీకారం రోజు ఏకంగా దేశ ప్రధానిని తన అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ ఫ్రేమ్, ఆ విజువల్స్ ప్రతి మెగా అభిమానికి జీవితాంతం గుర్తుంటాయి. అన్నయ్య అంటే పవన్ కి అంత ప్రేమ.
సరే గెలిచాడు ఏం చేస్తాడులే అనుకున్నారు. కానీ ప్రతి రోజు జనాల్లోనే తిరుగుతూ సమస్యలు ఒక్కొక్కటి తీరుస్తున్నాడు. డెవలప్మెంట్ సీఎం చూసుకుంటే గ్రామాలు నేను చూసుకుంటాను అని పంచాయితీ రాజ్ శాఖ తీసుకొని ఏపీ గ్రామాభివృద్ధికి నడుం బిగించాడు పవన్. నడకే లేని ఊళ్లకు రోడ్లు వేయించాడు. మంచి నీళ్లు కరువైన ఊళ్లకు నీళ్లు తెప్పించాడు. గ్రామాల మీదే ఫోకస్ పెట్టి కుదిరిన ప్రతిసారి ఏదో ఒక గ్రామానికి వెళ్తూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీరుస్తున్నాడు.
నిన్నటికి నిన్న జనసేన ఈవెంట్ జరిగితే కింద స్థాయి కార్యకర్తలని పిలిచి మాట్లాడించాడు. ఆయన వాళ్ళతో మాట్లాడాడు. తన కార్యకర్తలను లీడర్లను చేస్తానని మాట ఇచ్చి కొత్త పథకం ప్రారంభించాడు. ఎవరు చేయగలరు ఈ ధైర్యం. పవర్ లో ఉండి కూడా తన జీతం మొత్తం ఇచ్చేసి, తన సొంత డబ్బుతో కూడా ఇంకా సాయం చేస్తున్నారు ఎవరికి ఉంటుంది ఈ గుణం. రాష్ట్రంలో గ్రామాలతో పాటు తన నియోజక వర్గాన్ని దగ్గరుండి అభివృద్ధి చేసుకుంటున్నాడు.(Pawan Kalyan)
Also See : Pawan Kalyan old photos : పవన్ కళ్యాణ్ ఓల్డ్ ఫొటోల గ్యాలరీ
ఆయన ఆలోచనలు కొత్తవి కావొచ్చు, రాజకీయ వ్యూహాలు తెలియకపోవచ్చు. కానీ జనాలకు ఏదో చేయాలి అనే ఆయన గట్టి సంకల్పం ఆయన్ని కచ్చితంగా నడిపిస్తుంది. ఆయన ఏపీ రాజకీయాల్లో సృష్టించిన సునామి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. పొలిటికల్ గా ఒక్కసారి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు చోట్ల ఓడిపోయాడు అన్నవాడే ఇవాళ పీఎంకి డైరెక్ట్ కాల్ చేయగలడు, వేరే రాష్ట్రాల్లో కూడా పక్క పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఈయన సాయం కావాల్సినంత రేంజ్ కి ఎదిగాడు. ఏకంగా దేశ ప్రధానితో ఏ ఆంధీ హై.. తుఫాను లాంటి వాడు అని చెప్పించగలిగాడు. ఇది కదా ఒక మనిషి గెలుపు.
ఆయన్ని మూడు పెళ్లిళ్ల నుంచి మొదలు పెట్టి తిట్టాల్సినవి అన్ని తిట్టేసారు. రాజకీయాల్లో విమర్శలు మాత్రమే కాదు ఏకంగా పర్సనల్ అటాక్స్ కూడా ఉంటాయని అన్ని వదిలేసుకొని వచ్చాడు. ఏపీని అభివృద్ధి చేయడం, జనాల సమస్యలు తీర్చడం .. ఇవే తన మైండ్ లో పెట్టుకొని ఆ దిశగా పనిచేస్తున్నాడు. పవన్ కి రాజకీయాల్లో వచ్చిన క్రేజ్ కి భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం చూస్తన్నారు. జనసైనికులు ఆయన రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎలాంటి అవినీతి చేయని, ఆరోపణలు ఎదుర్కొని, మొహమాటం కోసం కూడా తప్పుడు పనులకు ఓకే చెప్పని ఇలాంటి నాయకుడు ఎన్ని రోజులు నెగ్గుకొస్తారో చూడాలి.