కమ్మ రాజ్యంలో కడప రెడ్లుకు చిక్కులు : కేఏ పాల్ పిటిషన్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి..ట్రైలర్, టీజర్‌లు వివాదాస్పదమౌతున్నాయి. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టు మెట్లు ఎక్కారు ప్రజాశాంతి నేత కేఏ పాల్. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం దీనిపై విచారణ జరుపనుంది. సినిమా విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు పాల్. ప్రతివాదులుగా కేంద్ర మంత్రిత్వ శాఖతో పాటు, సెన్సార్ బోర్డు, వర్మ, నిర్మాతలను చేర్చారు. ఈనెల 29 తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ దర్శకుడు ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఏ సినిమా తీసినా సంచలనమే. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రూపొందిస్తున్నారు. తన శిష్యుడు సిద్దార్థ తాతోలు దర్శకత్వంలో రూపొందింది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య నెలకొన్న అంశాలను చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా సినిమాకు సంబంధించి రెండో టీజర్ విడుదల చేశారు వర్మ. ఈ సినిమాలో పాల్ పాత్ర కూడా ఉంది. అవమానించేలా ఉందని పాల్ కోర్టుకు ఎక్కడంతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా కోర్టు నిర్ణయం ప్రకటిస్తుందా ? లేక సినిమా విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఇంకా వర్మ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
Read More : నా ఇంట్లో ఐటీ వాళ్లు దాడి చేసుంటే.. : యంగ్ హీరో ఫన్నీ ట్వీట్