Dude Review
Dude Review : ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘డ్యూడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాణంలో కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డ్యూడ్ నేడు అక్టోబర్ 17న తెలుగు, తమిళంలో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. గగన్(ప్రదీప్ రంగనాథన్) తన లవర్ ఆముద(నేహశెట్టి) వేరే పెళ్లి చేసుకోపోతుంటే వెళ్లి అడ్డుపడి తన్నులు తింటాడు. ఆముద వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఘటన తర్వాత గగన్ కి చిన్నప్పటినుంచి తనతో క్లోజ్ గా ఉన్న తన మామయ్య ఆదిశేషులు(శరత్ కుమార్) కూతురు కుందన(మమిత బైజు) ప్రపోజ్ చేస్తుంది. కానీ గగన్ తన ప్రేమని రిజెక్ట్ చేసి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటాడు. దీంతో కుందన బాధపడి పై చదువులకు వేరే ఊరు వెళ్ళిపోతుంది. (Dude Review)
కుందన వెళ్లిపోయిన తర్వాత గగన్ రియలైజ్ అయ్యి తనని ప్రేమిస్తాడు. ఈ విషయం మామయ్యకి చెప్పడంతో పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్లికి డైరెక్ట్ గా వచ్చిన కుందన తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు, పార్థు(హ్రిదు హరూన్)ని ప్రేమించాను అని గగన్ కి చెప్తుంది. తన సంతోషం కోసం గగన్ వాళ్ళిద్దర్నీ కలపాలనుకుంటాడు. కానీ అదే సమయంలో గగన్ మామయ్య ఆల్రెడీ ఓ పరువు హత్య చేసాడని, ఇది తెలిస్తే కుందనని చంపేస్తాడని తెలిసి తప్పక గగన్ కుందనని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత గగన్ కుందన – పార్థు లను వేరే దేశానికి పంపించాలని ప్లాన్ చేస్తాడు. మరి కుందన పార్థులను వేరే దేశానికి పంపించాడా? ఈ విషయం ఆదిశేషులుకు ఎలా తెలుస్తుంది? కుందనని పెళ్లి చేసుకొని గగన్ పడ్డ కష్టాలేంటి ? గగన్ లైఫ్ లోకి వేరే అమ్మాయి వస్తుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
వరుసగా రెండు సినిమాలు హిట్ అయి ప్రేక్షకులని మెప్పించడంతో ప్రదీప్ నెక్స్ట్ సినిమా డ్యూడ్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మనం ప్రేమించిన అమ్మాయి లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేస్తే పెద్ద మనసుతో వాళ్ళతో పంపించేసే కథలు గతంలోనే చాలా వచ్చాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు కన్యాదానం, ఆర్య 2 .. లాంటి సినిమాలు గుర్తుకు రావడం ఖాయం. ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎప్పుడో వచ్చాయి. అయితే ఈ కథంతా కామెడీతో చెప్పడానికే ప్రయత్నించారు. చివర్లో కాస్త ఎమోషన్ వర్కౌట్ చేసారు.
ఫస్ట్ హాఫ్ సరదాగా అక్కడక్కడా చిన్న ఎమోషన్ తో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి గగన్ కుందనని పెళ్లి చేసుకోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్ గా రాసుకున్నా బాగా సాగదీశారు. ఇంకా అవ్వలేదా అనే ఫీలింగ్ వస్తుంది. గగన్ ఉండగానే కుందన – పార్థు మధ్య రాసుకున్న కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపించినా అదే మెయిన్ పాయింట్ గా మార్చారు. కథ ఎన్ని మలుపులు తిరిగినా సింపుల్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, పరువు హత్యలే మెయిన్ పాయింట్ లా మార్చారు. పార్థు – కుందనలను కలపడానికి గగన్ పడే కష్టాలు, ఫ్రస్టెషన్ మనకు నవ్వు తెప్పిస్తాయి. ఆముద పాత్ర, ఆముద కథ లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి హీరో డ్యూడ్ అనే పేరుతో సర్‌ప్రైజ్ ఈవెంట్స్ నడుపుతున్నట్టు, అక్కడక్కడా డ్యూడ్ అని పిలుచుకోవడం తప్ప కథకి సంబంధం లేదు. పుష్ప సినిమా సాంగ్స్ ని బాగానే వాడారు సినిమాలో.
ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగు వాళ్ళను కూడా మెప్పించాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమాల్లో పక్కింటి అబ్బాయిలా కనిపించి అందరికి కనెక్ట్ అయినట్టే ఇందులో కూడా అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మాములు వ్యక్తిగా నటించి తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. మమిత బైజు క్యూట్ గా కనిపిస్తూనే అక్కడక్కడా ఎమోషనల్ గా కూడా మెప్పించింది. శరత్ కుమార్ చాన్నాళ్లకు ఫుల్ యాక్టివ్ గా కనపడ్డ పాత్రలో కనిపించారు. నేహా శెట్టి, సత్య గెస్ట్ అప్పీరెన్స్ లా అక్కడక్కడా అలరించారు. కుందన లవర్ పాత్రలో హ్రిదు హరూన్ పర్వాలేదనిపించాడు. ఐశ్వర్య శర్మ, రోహిణి, ద్రావిడ్ సెల్వం.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా కలర్ ఫుల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. రిపీట్ మోడ్ లో వినొచ్చు. కథ, కథనం పాతదే అయినా కాస్త ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మీదే పాత మెసేజ్ ఇచ్చారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘డ్యూడ్’ సినిమా ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం హీరో ఏం చేసాడు అనే కథాంశంతో సాగింది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.