Telusu Kada Review : ‘తెలుసు కదా’ మూవీ రివ్యూ.. భార్య – మాజీ ప్రేయసి మధ్య ప్రెగ్నెన్సీ ఎమోషన్ తో నలిగిపోయిన హీరో..

ఇలాంటి కథని, డైలాగ్స్ ని, సీన్స్ ని ఫిమేల్ డైరెక్టర్ డీల్ చేసిందా అని ఆశ్చర్యం రాక మానదు. (Telusu Kada Review)

Telusu Kada Review : ‘తెలుసు కదా’ మూవీ రివ్యూ.. భార్య – మాజీ ప్రేయసి మధ్య ప్రెగ్నెన్సీ ఎమోషన్ తో నలిగిపోయిన హీరో..

Telusu Kada Review

Updated On : October 17, 2025 / 1:18 PM IST

Telusu Kada Review : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘తెలుసు కదా’. స్టార్ ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు అక్టోబర్ 17న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. వరుణ్(సిద్ధూ జొన్నలగడ్డ) ఒక అనాధ. అతనికి ఎప్పటికైనా పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఉండాలని ఉంటుంది. వరుణ్ చదివే కాలేజీ హెడ్ కూతురు రాగ(శ్రీనిధి శెట్టి)ని లవ్ చేస్తాడు. ఇద్దరూ కొన్నాళ్ళు లవ్ స్టోరీ నడుపుతారు. కానీ రాగ ఈ పెళ్లి, రిలేషన్స్ వద్దు అని చెప్పి వరుణ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ల తర్వాత వరుణ్ లైఫ్ లో సక్సెస్ అయ్యాక ఇంటీరియర్ డిజైనర్ అంజలి(రాశీఖన్నా)ని ఓ మ్యాట్రిమోనీ ద్వారా కలిసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరు అని తెలియడంతో సరోగసి ద్వారా ప్రయత్నించాలని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది.

అక్కడ రాగ సరోగసి స్పెషలిస్ట్ గా ఉండటంతో వరుణ్ షాక్ అవుతాడు. అంజలికి ఈ విషయం తెలీదు. రాగ అంజలి కోసం, వరుణ్ కోసం తనే సరోగసి మదర్ గా ఉంటాను, వాళ్ళ బేబీని మోస్తాను అని చెప్తుంది. దీంతో వరుణ్ తన ఎక్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలని తనని 9 నెలలు తమ ఇంట్లోనే ఉండాలి అనే కండిషన్ పెడతాడు. అందుకు రాగ ఒప్పుకొని వరుణ్ – అంజలి ఇంటికి వస్తుంది. మరి అంజలికి వరుణ్ -రాగ పాత లవ్ స్టోరీ ఎలా తెలుస్తుంది? రాగ వచ్చాక అంజలి – వరుణ్ మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయి? బేబీ పుడుతుందా? సరోగసి విధానాన్ని అంజలి ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తారు? వరుణ్ రాగ గతాన్ని గుర్తుచేసుకుంటారా? వరుణ్ తన ఎక్స్ మీద రివెంజ్ తీర్చుకుంటాడా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : OG Comic Book : OG కామిక్ బుక్ రివ్యూ.. ఓజి ప్రీక్వెల్ మొత్తం కథ ఇదే.. జపాన్, సుభాష్ చంద్రబోస్ బ్యాక్ డ్రాప్ కథతో.. అదిరిపోయిందిగా..

సినిమా విశ్లేషణ..

ఒక కొత్త తరహా లవ్ స్టోరీ జానర్ లో సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను తీసుకొని చాలా సున్నితమైన కథగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ వరుణ్ బ్రేకప్ తో మొదలుపెట్టి అంజలితో పెళ్లి, పిల్లలు పుట్టరు అని చూపించే వరకు సింపుల్ గా రొటీన్ గా సాగుతుంది. రాగ వీళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక కథ ఆసక్తిగా నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ అంతా ముగ్గురు మధ్య ఎమోషన్స్ తోనే సాగుతుంది. అంజలికి వీళ్ళ గురించి తెలిసాక తాను ఎలా తీసుకుంటుంది అనే దగ్గర్నుంచి కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. నెక్స్ట్ సీన్ ఏంటి అని సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్యూరియాసిటీతో నడిపించారు. ప్రస్తుత సమాజంలో ఉన్న కొన్ని రిలేషన్ షిప్స్ ని ప్రస్తావిస్తూ, సరోగసి విధానాన్ని పాజిటివ్ గా చూపిస్తూ, దాన్ని ఫ్యామిలీ, సమాజం ఒప్పుకొన్నాక కొన్ని సీన్స్ అవన్నీ కొత్తగా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా కూడా ఉంటాయి.

సినిమా అంతా ఇలా అబ్బాయి కోణంలో కథని నడిపించడం, రాసిన డైలాగ్స్ కానీ, చూపించిన సీన్స్ కానీ ఇవన్నీ ఒక ఫిమేల్ డైరెక్టర్ చేసింది అంటే తనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి కథని, డైలాగ్స్ ని, సీన్స్ ని ఫిమేల్ డైరెక్టర్ డీల్ చేసిందా అని ఆశ్చర్యం రాక మానదు. అయితే కొన్ని చోట్ల సీన్స్ బాగా సాగదీసినట్టు ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే బాలీవుడ్ లో చోరీ చోరీ చుప్కె చుప్కె సినిమా గుర్తుకురావడం ఖాయం. అక్కడక్కడా కామెడీ కూడా బాగానే పండింది. అయితే ఈ కథ అందరికి కనెక్ట్ అవుతుందా అనేది సందేహమే.

Telusu Kada Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

టిల్లు సినిమాలతో హుషారుగా ఉండే పాత్రల్లో అదరగొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ ఇందులో చాలా కూల్ గా, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఒక అబ్బాయి ఎమోషన్స్ ని బయటపెట్టలేడు అనే పాత్రని సిద్దు బాగా చూపించాడు. రాశీఖన్నా క్యూట్ గా కనిపిస్తూనే జెలసీగా ఉన్న భార్య పాత్రలో బాగానే నటించింది. శ్రీనిధి శెట్టి కాలేజీ కథలో క్యూట్ గా కనిపించి తర్వాత డాక్టర్ గా ఒక మెచ్యూర్డ్ పాత్రలో బాగా మెప్పించింది. వైవా హర్షకి సినిమాలో చాలా మంచి పాత్ర పడింది. సినిమా అంతా హీరో పక్కనే ఉండి అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Baahubali The Epic : వామ్మో.. బాహుబలి రీ రిలీజ్ ఎన్ని ఫార్మెట్స్ లో చేస్తున్నారో తెలుసా.. సూపర్ ఎక్స్‌పీరియన్స్ కి రెడీ అవ్వండి..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా క్లాసీగా బాగున్నాయి. తమన్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ హీరో ఎలివేషన్ సీన్స్ అన్ని OG సినిమాకు మిగిలిన బ్యాక్ గ్రౌండ్స్ ఇక్కడ వాడాడు అని కచ్చితంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ప్యాట్రన్ మాత్రం చాలా బాగుంది. సరోగసి ప్రాసెస్ చేసే సీన్స్ తో పాటు కొన్ని సీన్స్ ప్రస్తుతం నడుస్తున్న కథ, గతంలోని కథని చూపిస్తూ చాలా బాగా ఎడిట్ చేసారు. ల్యాగ్ సీన్స్ లో మాత్రం కాస్త షార్ప్ ఎడిటింగ్ చేయాల్సింది.

కథ బేసిక్ లైన్ పాతదే అయినా దాన్ని ముగ్గురు మనుషుల మధ్య ఎమోషన్స్ తో నడిపించడం కాస్త కష్టమే. దాన్ని నీరజ కోన బాగా డీల్ చేసింది. స్టైలిస్ట్ డైరెక్టర్ గా మారింది, మొదటిసారి డైరెక్ట్ చేసింది అని ఎక్కడా అనిపించదు. సాంకేతికంగా కూడా అంత బాగా డీల్ చేసింది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. హార్ష్ రియాలిటీ అనిపించేలా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు సినిమాకు.

మొత్తంగా ‘తెలుసు కదా’ సినిమాని ఒక అబ్బాయి తన భార్య, ఎక్స్ మధ్య ప్రగ్నెన్సీతో కూడా ఎమోషన్స్ తో బాగానే తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.