Premistunnaa Review
Premistunnaa Review : సాత్విక్ వర్మ, ప్రీతీ నేహా జంటగా తెరకెక్కిన సినిమా ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో భాను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమిస్తున్నా సినిమా నిన్న నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజయింది.(Premistunnaa Review)
కథ విషయానికొస్తే.. ఒక ఎమోషనల్ సీన్ తో కథ మొదలయి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది. శారద(విజి చంద్రశేఖర్) భర్త చనిపోవడంతో జాబ్ చేస్తూ కొడుకే(సాత్విక్ వర్మ) అన్ని అనుకోని బతుకుతూ ఉంటుంది. సాత్విక్ తన కాలనీలోకి వచ్చిన అమ్మాయి(ప్రీతీ నేహా)తో ప్రేమలో పడతాడు. ‘నీతో రొమాన్స్ చేయాలని ఉంది’ అని కొత్తగా ప్రపోజ్ చేస్తాడు. ప్రీతీ సిల్లీగా తీసుకుంటుంది. దీంతో సాత్విక్ ఆమె వెనకే పడుతూ ట్రై చేస్తూ ఉంటాడు.
ఇది ప్రీతీ వాళ్ళ నాన్నకు తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని సాత్విక్ తో రొమాన్స్‌కి ఓకే చెప్పి కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ప్రీతీ కూడా సాత్విక్ తో ప్రేమలో పడుతుంది. కానీ పలు కారాణాలతో సాత్విక్ ని ప్రీతీ వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రీతీ పెట్టిన కండిషన్ ఏంటి? ఆమె వదిలి వెళ్లిపోయాక సాత్విక్ ఏమయ్యాడు? కొడుకు కోసం శారద ఏం చేసింది.. ప్రీతీ సాత్విక్ లైఫ్ లోకి వస్తుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
హీరో – హీరోయిన్స్ ప్రేమ, హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతే హీరో పిచ్చోడు అవ్వడం.. లాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ ప్రేమిస్తున్నా కూడా అదే కోవకు చెందింది. పైగా ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, RX 100 లాంటి సినిమాల ప్రభావం కూడా ఉన్నట్టు ఉంటుంది. ప్రేమలో రొమాన్స్ కూడా భాగమే అనే పాయింట్ ని కాస్త బోల్డ్ గా చెప్పాడు దర్శకుడు.
ఓ ఎమోషనల్ సీన్ తో కథ మొదలు పెట్టి ఫ్లాష్ బ్యాక్ తో అసలు కథలోకి వెళ్తారు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు రెగ్యులర్ లవ్ స్టోరీలాగానే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ వెంట పడటం, పాటలు, ప్రపోజల్స్.. తోనే సాగుతుంది. హీరోయిన్ రొమాన్స్ కి ఓకే అన్న తర్వాత నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. సెకండ్ హాఫ్ ప్రస్తుతం, గతం చూపిస్తూ, కొన్ని ట్విస్టులు రివీల్ చేయడంతో మరింత ఆసక్తిగా నడుస్తుంది సినిమా.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా అయిపోతే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంది. ఓ పక్క లవ్ స్టోరీని నడిపిస్తునే మరో పక్క తల్లి ప్రేమని కూడా ఆవిష్కరించారు. కొడుకు బాగుపడటానికి తల్లి చేసే ప్రయత్నాలు ఎమోషనల్ గా సాగుతాయి. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ డైలాగ్స్ తో బాగానే నడుస్తుంది. లవ్ ఉన్నచోట లస్ట్ కూడా ఉంటుంది అనే పాయింట్ ని బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. దానికి తగ్గట్టే ఆడియన్స్ ని కూడా కన్విన్స్ చేయగలిగాడు తన కథనం, డైలాగ్స్ తో.
బాహుబలి, మళ్ళీ రావా.. లాంటి చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సాత్విక్ వర్మ ఈ సినిమాతో హీరోగా మారాడు. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ లో రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు సాత్విక్. కొత్తమ్మాయి ప్రీతీ నేహా అందంగా అలరిస్తూనే రొమాన్స్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నటనతో మెప్పించింది. తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ కన్నీళ్లు పెట్టిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Jatadhara Review : ‘జటాధర’ మూవీ రివ్యూ.. లంకె బిందెలకు కాపలా ఉన్న ధన పిశాచి..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. కథని ముందుకు, వెనక్కి నడిపిస్తూ కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే బాగా రాసారు. పాత కథే అయినా కొత్త పాయింట్స్ జతచేసి చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ప్రేమిస్తున్నా’ సినిమా ప్రేమ ఉన్న చోట రొమాన్స్ కూడా ఉంటుంది అనే పాయింట్ ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.