Jatadhara Review : ‘జటాధర’ మూవీ రివ్యూ.. లంకె బిందెలకు కాపలా ఉన్న ధన పిశాచి..
జటాధర సినిమా నేడు నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.( Jatadhara Review)
Jatadhara Review
Jatadhara Review : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘జటాధర’. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జటాధర సినిమా నేడు నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.( Jatadhara Review)
కథ విషయానికొస్తే.. శివ(సుధీర్ బాబు) దయ్యాల్ని నమ్మడు. కానీ దయ్యాలు ఉన్నాయేమో అని ఘోస్ట్ హంటర్ గా సైంటిఫిక్ గా వెతుకుతూ ఉంటాడు. ఓ చిన్ని బాబుని ఎవరో చంపుతున్నట్టు తనకు రెగ్యులర్ గా కల వస్తుంటుంది. శివకు తెలిసిన ఓ వ్యక్తి రుద్రారం అనే గ్రామానికి వెళ్లి అనుమానాస్పదంగా చనిపోతాడు. అక్కడ లంకె బిందెలు ఉన్నాయని, దానికి కాపలాగా ఓ ధనపిశాచి ఉందని, అదే అందర్నీ చంపేస్తుందని ప్రచారం జరుగుతుంది.
అదేంటో చూద్దామని లంకెబిందెలు కోసం తవ్వే చోటుకు శివ వెళ్తాడు. కానీ అతను తిరిగొచ్చాక అక్కడ తనతో పాటు ఉన్నవాళ్లు చనిపోతారు. అదే సమయంలో ఇంట్లో అమ్మానాన్నలు ప్రమాదం నుంచి బయటపడతారు. శివకు కలలో వచ్చేవాళ్ళ ఫోటో అతనికి తన ఇంట్లో కనపడుతుంది. అసలు శివకు కలలో వచ్చేవాళ్ళు ఎవరు? రుద్రారం గ్రామానికి శివకి సంబంధం ఏంటి? ధనపిశాచి అందర్నీ ఎందుకు చంపుతుంది? లంకెబిందెలు నిజంగానే ఉన్నాయా? ధనపిశాచి గురించి కనుక్కుందామని వెళ్లిన శివకు ఎదురయ్యే సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Aaryan Review : ‘ఆర్యన్’ మూవీ రివ్యూ.. చనిపోయిన వ్యక్తి హత్యలు ఎలా చేస్తాడు? థ్రిల్లర్ సినిమా భలే ఉందే..
సినిమా విశ్లేషణ..
లంకెబిందెల నేపథ్యంలో, ఘోస్ట్ హంటింగ్ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఆ రెండిటిని కలుపుతూ ఓ చిన్న ఎమోషన్ తో పాటు డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాని తెరకెక్కించారు. అసలు లంకెబిందెలు పూర్వం ఎందుకు ఉన్నాయి అనే కథని AI వాడి ఓ వీడియోతో చెప్పి కథ మొదలుపెట్టారు.
ఆ తర్వాత హీరో ఘోస్ట్ హంటింగ్ సీన్స్, హీరోయిన్ తో కాసేపు లవ్ ట్రాక్, మధ్యలో అక్కర్లేని ఓ ఐటెం సాంగ్ తో సాగదీశారు. ప్రీ ఇంటర్వెల్ కి హీరో రుద్రారం అనే గ్రామంకి వెళ్లిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు శివ ఎవరు, అతనికి వచ్చే కల ఏంటి అనే కథ, దానికి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకు కాస్త ప్లస్ అయింది. దాంతో పాటు పేరెంట్స్ ఎమోషన్ ని బాగానే వర్కౌట్ చేశారు.
సెకండ్ హాఫ్ లో వచ్చే ధన పిశాచి సాంగ్ అవసరమా అనిపిస్తుంది. ధనపిశాచి వర్సెస్ శివ క్లైమాక్స్ సీన్స్ యాక్షన్ తో బాగానే నడిపించారు. చివర్లో శివుడు రావడం, సుధీర్ బాబు శివతాండవం చేయడం అన్ని డివోషనల్ పాయింట్ తీసుకురావాలని పెట్టినట్టు ఉంటుంది కానీ కథకు కనెక్ట్ అవ్వదు. మొత్తానికి లంకెబిందెలకు కాపలా ఉన్న ఓ పిశాచికి మాములు మనిషికి జరిగే పోరాటంతో ఈ సినిమాని తెరకెక్కించారు. చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సినిమా ఫలితం ఎలా ఉన్నా సుధీర్ బాబు ప్రతి సినిమాకు వందశాతం బెస్ట్ ఇవ్వడానికి కష్టపడతాడు. జటాధర సినిమాలో కూడా సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు. క్లైమాక్స్ లో అయితే తన నటన, శివ తాండవంతో మెప్పిస్తాడు. హీరోయిన్ దివ్య ఖోస్లా పర్వాలేదనిపించింది. శిల్ప శిరోద్కర్ ఫ్లాష్ బ్యాక్ లో తన నటనతో మెప్పిస్తుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా ధన పిశాచిగా బాగానే నటించినా కొన్ని చోట్ల మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. బహుశా దర్శకుడు అలాగే కావాలన్నాడేమో. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవి ప్రకాష్, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్ గా ఇస్తే బాగుండు. పాటలు యావరేజ్. గ్రాఫిక్స్ లో ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. గ్రాఫిక్స్ విషయంలో చిన్నచిన్న తప్పులు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి తెరపై. డబ్బింగ్ కూడా కొన్ని పాత్రలకు లిప్ సింక్ కూడా లేదు. ఎడిటింగ్ ఇంకాస్త పనిచెప్పి ఫస్ట్ హాఫ్ లో ఓ ఐటెం సాంగ్, కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. కథ మంచి పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథాంశంతోనే చూపించారు. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘జటాధర’ సినిమా లంకెబిందెలకు కాపలాగా ఉన్న ఓ పిశాచి దానితో పోరాడే హీరో అన్న నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .
