‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’ మూవీ రివ్యూ.. ఉపాధి కోసం వెళ్లి ఎడారిలో బానిసగా మారితే..?

ఆడు జీవితం - ది గోట్ లైఫ్ సినిమా డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బానిసలా బతికి తప్పించుకొని ఎడారిలో కష్టాలు పడి ఓ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అనే ఓ నిజమైన కథతో తెరకెక్కించిన సర్వైవల్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా.

The Goat Life – Aadu Jeevitham Review : పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’. బ్లెస్సీ దర్శకత్వంలో విజువల్ రొమాన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నేడు మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజయింది. ఈ సినిమా నజీబ్ అనే ఓ వ్యక్తి జీవిత కథ అని, పదహారేళ్ళ క్రితం ఈ సినిమా చేద్దామనుకొని, ఆరేళ్ళ పాటు ఈ సినిమాకి కష్టపడ్డానని పృథ్వీరాజ్ ప్రమోషన్స్ లో పేర్కొన్నాడు.

కథ విషయానికొస్తే..
1992లో కేరళకు చెందిన నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి గల్ఫ్ దేశాలకు వెళ్లి బాగా సంపదించాలి అనుకొని ఆల్రెడీ గల్ఫ్ నుంచి వచ్చిన తన స్నేహితుడి బావ ద్వారా డబ్బులు కట్టి బాంబే వెళ్లి అక్కడి నుంచి సౌదీ అరేబియా వెళతాడు. అతనితో పాటు హకిం(KR గోకుల్) అనే మరో వ్యక్తి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తమకి పని ఇచ్చేవాళ్ళు రాకపోవడంతో ఎయిర్ పోర్ట్ బయట ఎదురుచూస్తుంటే ఓ వ్యక్తి వచ్చి వాళ్ళ పాస్ పోర్ట్స్, వీసాలు లాక్కొని ఓ బండి ఎక్కించుకొని తీసుకెళ్తారు. భాష రాకపోవడంతో వాళ్లకి పని ఇచ్చేది ఇతనే అని నమ్మి వెళ్ళిపోతారు. ఇద్దర్నీ ఎడారి మధ్యలోకి తీసుకెళ్ళి వేర్వేరు మసారాలలో(గొర్రెలు, ఒంటెలు కాసే చావిడి) అప్పచెప్తారు. అక్కడ వీళ్ళని బానిసల్లా ట్రీట్ చెయ్యడం మొదలుపెట్టి గొర్రెలు, ఒంటెలు మేపడం, పాలు పితకడం లాంటి పనులు చేయిస్తారు. నజీబ్ కి తను మోసపోయాను అని తెలుస్తుంది. అక్కడ వాటర్ కూడా ఉండవు, ఎడారి మధ్యలో ఓ బానిసలా బతుకుతాడు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినా ఓనర్లు కొట్టి పడేస్తారు. దీంతో అక్కడి బానిస జీవితానికి అలవాటు పడిపోతాడు. ఓ రోజు గొర్రెలను బయటకి తీసుకెళ్లినప్పుడు తనతో వచ్చిన హాకిం కనిపిస్తాడు. వీరితో పాటు మరో వ్యక్తి ఇబ్రహీం(జిమ్మీ జీన్ లియోస్).. ముగ్గురు కలసి ఆ ఎడారి నుంచి తప్పించుకొని వెళ్లిపోవాలని సిద్ధమవుతారు.

మరి ఈ ముగ్గురు ఎడారి నుంచి తప్పించుకున్నారా? ఎడారిలో దారి తెలియక ఎన్ని కష్టాలు పడ్డారు? ఎడారిలో నీళ్లు లేక ఎలా అల్లాడారు? సిటీలోకి వచ్చారా? ఎడారిలో తప్పించుకునే ప్రయాణంలో ఎలాంటి కష్టాలు పడ్డారు? అక్కడి నుంచి ఇండియాకి ఎలా వచ్చారు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’ సినిమా ‘గోట్ డేస్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. 1992లో గల్ఫ్ దేశాల్లో బతుకుతెరువు కోసం వెళ్లి అక్కడ మోసపోయి ఎడారిలో బానిసగా బతికి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన నజీబ్ అనే వ్యక్తి కథని సినిమాగా మలిచారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బయోపిక్ అనే చెప్పొచ్చు. ఒక సర్వైవల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా నజీబ్ గల్ఫ్ కి వెళ్లడం, అక్కడ మోసపోయి ఎడారిలో బానిస బతుకుకి అలవాటు పడటం.. అతని కష్టాలు చూపిస్తూనే కేరళలో తన భార్యతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు తెచ్చుకోవడం కూడా చూపిస్తారు.

ఇక సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ నజీబ్, హకీమ్ కలవడం వాళ్ళు ఎడారిలో తప్పించుకొని వెళ్లే ప్రయాణమే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఎడారిలో దారి తప్పి వెళ్తుంటే పడే కష్టాలే ఉంటాయి. ఆడు జీవితం – ది గోట్ లైఫ్ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ అవార్డు విన్నింగ్ మూవీ మాత్రం అవుతుందని చెప్పొచ్చు. ప్రతి సీన్ ని చూసి గల్ఫ్ లో మోసపోయి ఇన్ని కష్టాలు పడతారా అని కచ్చితంగా అనిపిస్తుంది. సినిమా కోసం అమలతో కొన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టినా, సినిమా అంతా ఎమోషనల్ గానే సాగుతుంది. కాకపోతే సీన్స్ వైజ్ బాగున్నా చాలా చోట్ల కథ సాగదీతగానే ఉంటుంది.

Also Read : Manchu Manoj : పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్..

నటీనటుల విషయానికొస్తే..
సినిమా అంతా పృథ్విరాజ్ సుకుమారన్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఆరేళ్ళు కేటాయించడం, బరువు తగ్గడం, ఎడారిలో షూట్ చేయడం, చాలానే కష్టాలు పడ్డాడు. సినిమా మొదట్లో లావుగా ఉన్న వ్యక్తి ఎడారి నుంచి తప్పించుకునే సమయానికి చాలా బక్కగా తయారయి పాపం అనిపించేలా కనిపిస్తాడు. దానికోసం పృథ్విరాజ్ సుకుమారన్ తన హెల్త్ కూడా పణంగా పెట్టి రిస్క్ చేసి కష్టపడ్డాడు. ఇక అమలాపాల్ ఉన్న కాసేపు భార్య పాత్రలో మెప్పించింది. హకీమ్ పాత్రలో గోకుల్ కూడా బాగా నటించాడు. ఓ సీన్ మొత్తం అతని మీదే ఉంటుంది, ఆ సీన్ లో కచ్చితంగా ప్రేక్షకులని ఏడిపిస్తాడు. ఇబ్రహీం పాత్రలో హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లియోస్ కూడా మెప్పిస్తాడు.

సాంకేతిక అంశాలు..
ఆడు జీవితం – ది గోట్ లైఫ్ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ ముఖ్యం. AR రహమాన్ ఈ సినిమాకి మంచి ఎమోషనల్ మ్యూజిక్ ఇచ్చాడు. సునీల్ KS అద్భుతమైన సినిమాటోగ్రఫీ వర్క్ చేసారు. ఎడారిలో చాలా రియలిస్టిక్ గా షూట్ చేసారు. లొకేషన్స్ కూడా జోర్డాన్, సహారా ఎడారుల్లో షూట్ చేసారు. తెలుగు మాటలు మాత్రం కొన్నిచోట్ల రియాలిటీకి దగ్గరగా అనిపించవు. డబ్బింగ్ సినిమా కావడంతో తెలుగు డైలాగ్స్ లో ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. దర్శకుడిగా బ్లెస్సీ గతంలోనే పలు అవార్డు విన్నింగ్ సినిమాలు తీసి మెప్పించాడు. ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా 100 శాతం సక్సెస్ అయ్యాడు అనే చెప్పొచ్చు.

మొత్తంగా.. ఆడు జీవితం – ది గోట్ లైఫ్ సినిమా డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బానిసలా బతికి తప్పించుకొని ఎడారిలో కష్టాలు పడి ఓ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అనే ఓ నిజమైన కథతో తెరకెక్కించిన సర్వైవల్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు