రాజావారు రాణిగారు – రివ్యూ

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘రాజావారు రాణిగారు - రివ్యూ’..

  • Published By: sekhar ,Published On : November 29, 2019 / 08:22 AM IST
రాజావారు రాణిగారు – రివ్యూ

Updated On : November 29, 2019 / 8:22 AM IST

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘రాజావారు రాణిగారు – రివ్యూ’..

పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. అదే కోవలో స్వచ్ఛమైన ప్రేమకథగా ‘రాజావారు రాణిగారు’  చిత్రం తెరకెక్కింది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాజావారు రాణిగారు’ ఎలా ఉందో చూద్దాం..  

Image

కథ విషయానికొస్తే : 
శ్రీరామపురం అనే ఊళ్ళో రాజా అనే అబ్బాయి, రాణి అనే అమ్మాయి ఉంటారు. రాజాకి రాణి అంటే చాలా ప్రేమ. కానీ అది చెప్పాలంటే చాలా భయం. ఈలోగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిపోతాయి. రాణిని ఇంజనీరింగ్ కోసమని అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపిస్తాడు వాళ్ళ నాన్న. రాణి కూడా తనను ప్రేమిస్తుంది అని ఫీల్ అయ్యి ఆమె ఎప్పుడు వస్తుందా, ప్రేమ విషయం ఎప్పుడు చెప్పాలా అని ఆమెని తలచుకుంటూ బ్రతికేస్తుంటాడు రాజు. మూడేళ్లయినా రాణి ఊళ్లోకి రాకపోవడంతో రాజా స్నేహితులు రాణిని ఊరికి రప్పించడానికి ఒక మంచి పథకం వేస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి రాణి ఊరికి తిరిగొస్తుంది. మరి అలా ఊరికి వచ్చిన రాణికి రాజా తన ప్రేమని తెలియజేశాడా, అతని ప్రేమని ఆమె ఒప్పుకుందా.. లేదా? అనేది తెరమీద చూడాల్సిందే.. 

Image

నటీనటుల విషయానికి వస్తే :
యాక్టర్స్ అంతా  తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ చేసిన హీరో హీరోయిన్లు.. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ సినిమాకు పెద్ద అసెట్. అందులో రహస్య కంటే కిరణ్ తన ప్రేమను చెప్పలేక ఇబ్బంది పడే పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు.. డైరెక్టర్ రాజా, రాణి పాత్రలని ఏం ఊహించి రాసుకున్నాడో దాన్ని నూటికి నూరు శాతం తెరపైకి తీసుకొచ్చారు అనిపిస్తుంది.. హీరో హీరోయిన్ క్యారెక్టర్లను కూడా డామినేట్ చేసేలా ఉన్నాయి నాయుడు, చౌదరిల పాత్రలు. సింపుల్‌గా ఆ రెండు పాత్రలతో కుడుపుబ్బా.. పడి పడి నవ్వుకునే సీన్స్ క్రియేట్ చేసాడు దర్శకుడు. ఇక నాయుడు పాత్రలో నటించిన యజుర్వేద్ గుర్రం, చౌదరి పాత్రలో జీవించిన రాజ్ కుమార్ కసిరెడ్డి పాత్రలు సినిమాకే హైలెట్ అయ్యాయి. వీళ్లిద్దరికి ఇది మొదటి సినిమా అయినా సీనియర్ల కంటే ఎక్కువే చేశారు. ముఖ్యంగా చౌదరి పాత్ర చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్‌తో ఇండస్ట్రీలో పాతుకుపోవడం ఖాయం అని చెప్పాలి. మిగతా నటీనటులు వాళ్ల పాత్రల పరిధిమేర బాగా నటించారు.. 

Image
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే :
ఈ సినిమా టీమ్‌లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కొత్తవాళ్ళు.. యంగ్ జనరేషన్ టీమ్.. ముఖ్యంగా ఈ సినిమా కథని నమ్మి, దానిని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడానికి కొత్త డైరెక్టర్ రవికిరణ్ కోలా తపించిన తీరు, సినిమాని తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోవాలి. అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటివి ఉన్నా అవి శృతిమించేలా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చింది. డైరెక్టర్ పనితీరు సినిమాలో బాగా కనిపిస్తుంది.. ఇక సినిమాకు ప్రాణం పోసేది మ్యూజిక్.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ అందించిన పాటలు మంచి ఫీల్‌తో పాటు సినిమాలోని కంటెంట్‌ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.. ఇక ఈ సినిమాకి విద్యా సాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల కెమెరా వర్క్  కూడా పెద్ద ప్లస్ పాయింట్. లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా చాలా రిచ్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. పల్లెటూరి సహజ అందాలను వాళ్ళ కెమెరాలో బంధించిన విధానానికి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్‌కి ఫుల్ మార్క్స్ పడతాయి.. చిన్న వయస్సులోనే నిర్మాతగా సినిమాను మనోవికాస్ బాగా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే :
కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్ జంటగా వచ్చిన ఈ ‘రాజావారు రాణిగారు’ సినిమా బలమైన, భావేద్వేగమైన ప్రేమ కథతో కొన్ని ప్రేమ సన్నివేశాలతో, మంచి కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకునప్పటికీ, కాన్సెప్ట్‌ రొటీన్‌గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ కొన్ని చోట్ల బోర్ కొట్టించడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ప్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. 

ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
హీరో, హీరోయిన్
కామెడీ ట్రాక్ 

మైనస్ పాయింట్స్ :
కొన్నిబోరింగ్ సీన్స్ 
సెకండ్ హాఫ్ 
స్లో నేరేషన్