టార్గెట్ ఎలక్షన్ : ‘లక్ష్మీస్ NTR’ రిలీజ్ డేట్

  • Publish Date - March 1, 2019 / 07:10 AM IST

ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్నికలను టార్గెట్ చేశాడా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సినిమా ఎన్నికల సీజన్‌లో విడుదల కాబోతోంది. వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ NTR’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మార్చి 22వ తేదీన ‘లక్ష్మీస్ NTR’ రిలీజ్ చేస్తున్నట్లు మార్చి 01వ తేదీన వెల్లడించారు. దీనితో ఈ చిత్రంపై అందరలోనూ ఉత్కంఠ నెలకొంది. 

మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న సమయంలోనే చిత్రం రిలీజ్ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై సినిమా ప్రభావం చూపిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సినిమా టైటిల్ నుండి మొదలుకొని అన్ని అంశాలు సంచలనాత్మకంగా మారాయి. సినిమాలోని టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. దివంగత NTR జీవితంలో జరిగిన పరిణామాలు, కీలక ఘట్టాలను సినిమాలో చూపెట్టే ప్రయత్నం చేశాడు వర్మ. అంతేగాకుండా ఎవరికి తెలియని నిజాలు సినిమాలో చూడొచ్చంటూ వర్మ పేర్కొనడంతో ఉత్కంఠ నెలకొంది. 

ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేశారని టీజర్, ట్రైలర్‌లు చూస్తే అర్థమౌతోంది. బాబును టార్గెట్ చేశారని తెలుగు తమ్ముళ్లు ఒంటికాలిపై లేస్తున్నారు. లక్ష్మీపార్వతి ప్రవేశించిన అనంతరం NTR జీవితంలో ఎలాంటి కీలక ఘట్టాలు వచ్చాయో తాను సినిమాలో చూపించినట్లు వర్మ ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్త దర్శకత్వం వహించగా పి. విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. యజ్ఞ శెట్టి లక్ష్మీపార్వతిగా, చంద్రబాబుగా శ్రీతేజ్, నందమూరి బాలయ్యగా ఆర్ జె బాలు తదితరులు నటించారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. మరి సినిమా ఎలా ఉండనుందో వెయిట్ అండ్ సీ