×
Ad

ధురంధర్ హిట్‌.. డాన్ 3 నుంచి రణ్‌వీర్ సింగ్ ఔట్! ఏం జరుగుతోంది?

ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించాలని భావించారు.

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అతడు డాన్ 3 మూవీ నుంచి తప్పుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధురంధర్ హిట్‌తో.. తన సినీ కెరీర్‌పై వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని రణ్‌వీర్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెక్ట్స్‌ ప్రాజెక్టుల గురించి పునరాలోచనలో పడ్డట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అతడు ఇలాంటి గ్యాంగ్‌స్టర్/యాక్షన్ పాత్రలను బ్యాక్ టు బ్యాక్ చేయడానికి ఇష్టపడడం లేదని సమాచారం.

డాన్‌ 3 సినిమాను దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ రూపొందించనున్నారు. డాన్‌ 3లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తాడని ఇంతకుముందు పలు మాధ్యమాల ద్వారా వెల్లడైంది. ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించాలని భావించారు.

సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో రణ్‌వీర్ సింగ్ తన భార్య, స్టార్ హీరోయిన దీపికతో కనిపించాడు. బ్లాక్‌ డ్రెస్‌లో జంటగా దర్శనమిచ్చిన ఈ దంపతులు.. నూతన సంవత్సర వేడుకల కోసం విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం. డాన్ 3 సినిమా షూటింగ్‌లోనూ రణ్‌వీర్‌ సింగ్ పాల్గొనబోడని ప్రచారం జరుగుతోంది.

Also Read: ఆ 2 పదాలు వాడినందుకే క్షమాపణలు.. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కాదు.. ఎవరికీ భయపడా: శివాజీ సంచలనం

డాన్‌ 3లో రణ్‌వీర్ సింగ్‌ నటిస్తాడని 2023లోనే ప్రకటించారు. అయితే, దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అమితాబ్‌ బచ్చన్, షారుక్ ఖాన్‌ లాంటి గొప్ప స్టార్లు “డాన్‌” పేరిట వచ్చిన సినిమాల్లో నటించారని కొందరు అన్నారు. డాన్‌కు కావాల్సిన గంభీరత, స్టైల్, కూల్ యాటిట్యూడ్ రణ్‌వీర్ సింగ్‌కు ఉండవని, ఆ ఇమేజ్‌కు అతడు సరిపోడన్న విమర్శలు వచ్చాయి.

కాగా, ఫర్హాన్ అఖ్తర్ 2006లో తెరకెక్కించిన డాన్, 2011లో వచ్చిన డాన్ 2లో ఈ పాత్రను సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ పోషించాడు. ఆ స్థానంలో ఇప్పుడు డాన్‌ 3లో రణ్‌వీర్ సింగ్ కనపడతాడని అందరూ భావించారు. 1978లోనూ అమితాబ్ బచ్చన్ హీరోగా డాన్‌ సినిమా వచ్చింది.

అదే పేరున్న సినిమా హక్కులను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేయడంతో ఈ ఫ్రాంచైజ్ ప్రారంభమైంది. ఆ సినిమాకు జావేద్ అఖ్తర్, సలీం ఖాన్ ద్వయం కథను అందించారు.

ధురంధర్ బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాస్తున్న సమయంలో రణ్‌వీర్ సింగ్ డాన్‌ 3 నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తుండడం గమనార్హం. ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్‌లో రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది.