Ravi Teja: రవితేజనూ వదలట్లేదు.. ఎందుకిలా చేస్తున్నారు?

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ వంటి అగ్ర హీరోలు శ్రీదేవితో డ్యూయ్యోట్స్‌ పాడేవారని... ఇప్పుడు రవితేజ కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్ పాడితే..

Ravi Teja: రవితేజనూ వదలట్లేదు.. ఎందుకిలా చేస్తున్నారు?

Raviteja

ట్రోలింగ్‌… సోషల్‌ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీలకు అతిపెద్ద శాపం ట్రోలింగ్‌. నచ్చితే ఒకలా… నచ్చకపోతే ఇంకోలా… నెట్టింట తిట్టడమే ఎక్కువ మంది పని. సోషల్‌ మీడియాలో ట్రోలర్స్‌ బారిన పడని సెలబ్రెటీ అంటూ లేకుండా పోయారు. ఎంత పెద్దవారైనా సరే ట్రోలర్స్‌కు ఏ మాత్రం లెక్కకాదు. ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో బాధితులే.

ఐతే టాలీవుడ్‌లో ఓ హీరో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు తెగ ఫీల్‌ అవుతున్నారట… ఎప్పుడూ ట్రోలర్స్‌ తననే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని వాపోతున్నారట… ఔను ఆ హీరోనే ట్రోలర్స్‌ టార్గెట్‌ చేయడమేంటి? ఆ హీరో అంటే అంత అలుసా?

టాలీవుడ్‌లో ట్రోలర్స్‌తో ఇబ్బంది పడని నటీనటులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీనికి ఎవరూ అతీతులు కాదు. అగ్ర కథానాయకుల నుంచి హస్యనటులు వరకు అంతా ట్రోలింగ్‌ బాధితులే… నెటిజన్ల తిట్ల దండకంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్‌ మీడియా అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మాస్‌ మహరాజ్‌ రవితేజ కూడా చేరిపోయారట.

ఈ మధ్య సోషల్‌మీడియాలో రవితేజను ఎక్కువగా టార్గెట్‌ చేసుకున్న ట్రోలర్స్‌… వెంటాడి.. వెంటాడి వేధిస్తున్నారంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ సినిమా రిలీజ్‌ అనగానే సోషల్ మీడియాలో ట్రోలర్స్‌ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రవితేజతో జతకట్టే హీరోయిన్ల విషయంలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సివస్తోందట…

హీరోయిన్ల వయసు అంటూ..
ప్రస్తుతం రవితేజ వయస్సు 56 ఏళ్లు. కానీ ఆయనతో జతకట్టే హీరోయిన్ల వయసు 20 నుంచి 25 ఏళ్లలోపే ఉంటోంది. దీంతో రవితేజను టార్గెట్‌ చేస్తున్నారు ట్రోలర్స్‌. తన వయసులో సగం కూడ లేని హీరోయిన్లతో డ్యాన్స్‌లు, రోమాన్స్‌లేటంటూ ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు నెటిజన్స్‌. దీనిపై మీడియాలో కూడా అడపాదడపా న్యూస్ వస్తుండటంతో రవితేజ హర్ట్ అవుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ వంటి అగ్ర హీరోలు శ్రీదేవితో డ్యూయ్యోట్స్‌ పాడేవారని… ఇప్పుడు రవితేజ కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్ పాడితే తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన సన్నిహితులు. రవితేజ సినిమాలపై కొంత మంది హీరోలు కావాలనే ట్రోల్స్ చేయిస్తున్నారంటున్నారు. హిట్.. ప్లాప్‌తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తుండటంతో కావాలనే రవితేజ అంటే గిట్టని వాళ్లు ట్రోలింగ్‌ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరోలు కూడా చాలా వరకు కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్లు పాడుతున్నారని, కానీ వాళ్లను మాత్రం ట్రోల్స్ చెయ్యరని వాపోతున్నారు.

Also Read: ఇందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. లేకపోతేనా..