జోహ్రా సెహగల్ Google Doodle ఎందుకో తెలుసా!..

  • Published By: sekhar ,Published On : September 29, 2020 / 02:38 PM IST
జోహ్రా సెహగల్ Google Doodle ఎందుకో తెలుసా!..

Updated On : September 29, 2020 / 2:53 PM IST

Remembering Zohra Sehgal: ప్రముఖ నటి, నర్తకి, నృత్య దర్శకురాలు జోహ్రా సెహగల్ తెలియని వారుండరు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రేక్షకులను మెప్పించారామె. 1946లో ఇదే రోజున జోహ్రా నటించిన ‘నీచా నగర్ (Neecha Nagar )’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ వారి గౌరవార్దం గూగుల్ నేడు ఆమె డూడుల్‌ను ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా జోహ్రా సెహగల్ గురించి కొన్ని విషయాలు..
1912, ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తర ప్రదేశ్, షహరాన్‌పూర్‌లో ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు జోహ్రా. ఆమె అసలు పేరు సాహిబ్‌జాది జోహ్రా ముంతాజుల్లా ఖాన్ బేగం.. ఏడుగురు పిల్లలలో మూడవ సంతానం ఈమె.

Zohra Sehgal

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జోహ్రా.. తల్లి కోరిక మేరకు సోదరితో కలిసి లాహోర్‌లోని క్వీన్ మేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
జోహ్రా హిందువు అయిన కామేశ్వర్ సెహగల్‌ను 1942 ఆగస్టు 14న వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి జవహర్ లాల్ నెహ్రూ హాజరయ్యారు. జోహ్రా, కామేశ్వర్ దంపతులకు ఇద్దరు సంతానం. కిరణ్ సెహగల్ ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి.. పవన్ సెహగల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కోసం పని చేస్తున్నారు.

Zohra Sehgal

కెరీర్ తొలినాళ్లలో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన జోహ్రా.. ‘నీచా నగర్’ తో చిత్రరంగ ప్రవేశం చేసి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘దిల్ సే (Dil Se..), హమ్ దిల్ దే చుకే సనమ్ (Hum Dil De Chuke Sanam), కభీ ఖుషి కభీ ఘమ్ (Kabhi Khushi Kabhi Gham), వీర్ – జారా (Veer-Zaara)’ వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ‘సావరియా (Saawariya)’..


జోహ్రా సెహగల్ అందుకున్న పురస్కారాలు..
1963 – సంగీత నాటక్ అకాడమీ పురస్కారం
1998 – పద్మశ్రీ పురస్కారం
2001 – కాళిదాస్ సమ్మన్ పురస్కారం
2002 – పద్మ భూషణ్ పురస్కారం
2004 – సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్
2010 – పద్మవిభూషన్
తన 102వ ఏట 2014 జూలై 10న గుండెపోటుతో కన్నుమూశారు.