×
Ad

Oka Manchi Prema Katha Review : ‘ఒక మంచి ప్రేమ కథ’ మూవీ రివ్యూ.. పేరెంట్స్ చివరి దశలో..

ఈ జనరేషన్ లో పేరెంట్స్ ని వదిలేసే పిల్లలు, పెద్దలు కచ్చితంగా చూడాల్సిన సినిమా. (Oka Manchi Prema Katha)

Oka Manchi Prema Katha Review

Oka Manchi Prema Katha Review : రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఒక మంచి ప్రేమ కథ’. హిమాంశు పోపూరి నిర్మాణంలో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక మంచి ప్రేమ కథ సినిమా అక్టోబర్ 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (Oka Manchi Prema Katha)

కథ విషయానికొస్తే.. రంగమ్మ(రోహిణి హట్టంగడి) ఒక పల్లెటూళ్ళో సింగిల్ గా ఉంటుంది. ఆమెకు తోడుగా ఆ ఊరికి చెందిన మహి(సౌమ్య), ఆ ఊళ్ళో టీచర్ గా పనిచేసే శంకర్(హిమాంశు పోపూరి)ఉంటారు. రంగమ్మ కూతురు సుజాత(రోహిణి ముల్లేటి), అల్లుడు(సముద్రఖని) బెంగుళూరులో ఉంటూ జాబ్స్ చేస్తూ జీవితంలో ఇంకా ఎదగాలని పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ కూతురు అనన్య(అనన్య నన్నపనేని)ని విదేశాల్లో ఉంచి చదివిస్తారు. సుజాత, ఆమె భర్త జాబ్స్ లో ఇంకా ఏదో సాధించాలని తల్లిని, కూతుర్ని కూడా పట్టించుకోరు. కనీసం వాళ్ళతో మాట్లాడరు కూడా.

రంగమ్మకు ఓపిక అయిపోయి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. శంకర్ ఎన్ని సార్లు సుజాతకు ఫోన్ చేసినా పట్టించుకోదు. సుజాత భర్త ఓ కంపెనీకి సీఈఓ అవ్వడంతో సుజాత కూడా తాను పనిచేసే కంపెనీకి సీఈఓ అవ్వాలని రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసినా చివరి నిమిషంలో సీఈఓ పోస్ట్ వేరేవాళ్లకు వెళ్ళిపోతుంది. దీంతో సుజాత ఏదో కోల్పోయినట్టు, ఒంటరిగా ఉన్నట్టు, డిప్రెషన్ కి ఫీల్ అయి ఓ సైక్రియాటిస్టు వద్దకు వెళ్తే మీకు ప్రేమ, మనుషులతో మాట్లాడటం అవసరం అని చెప్తారు.

సుజాత సీఈఓ ఛాన్స్ పోవడంతో భర్తతో ఈగో సమస్యలు వస్తాయి. ఓ పక్క తన తల్లి దగ్గర్నుంచి ఫోన్స్ వస్తుండటంతో ఆమెని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి వద్దాం అని వెళ్తుంది. కానీ రంగమ్మ ఆ ఇంట్లోనే చనిపోవాలి, తన కూతురు, మనవరాలుతో కనీసం ఓ పది రోజులు అయినా గడపాలి అని అనుకుంటుంది. మరి రంగమ్మ కోరిక తీరుతుందా? సుజాత ఈ మెకానికల్ లైఫ్ నుంచి బయట పడుతుందా? భర్తతో విబేధాలు సమసిపోతాయా? అనన్య గోడు సుజాత, ఆమె భర్త పట్టించుకుంటరా? మధ్యలో మహి – శంకర్ ప్రేమకథ ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Anandalahari Review : ‘ఆనందలహరి’ సిరీస్ రివ్యూ.. వెస్ట్ గోదావరి అమ్మాయి – ఈస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే..

సినిమా విశ్లేషణ..

మన పేరెంట్స్ చివరి దశలో వాళ్ళని వదిలేసి మనం లైఫ్ లో ఎదగాలి అని కనీసం వాళ్ళతో మాట్లాడకుండా జీవితంలో ఏదో సాధించాలని పరిగెడుతూ ఉంటాము. ఈ పాయింట్ తోనే మెసేజ్ ఇస్తూ ‘ఒక మంచి ప్రేమ కథ’ సినిమాని తెరకెక్కించారు. ఒకప్పటి సీనియర్ దర్శకులు అక్కినేని కుటుంబరావు ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే సినిమా చాలా వరకు పాత స్టైల్ లో, స్లో నేరేషన్ లో ఉంటుంది. కొన్ని సీన్స్, డైలాగ్స్ చెప్పడం అంతా డ్రమాటిక్ గా, అప్పచెప్పినట్టు అనిపిస్తాయి. ఈ ఎమోషన్ మీదే సినిమాలో మూడు మెలోడీ సాంగ్స్ ఉండటం గమనార్హం.

ప్రేమ కథ అంటే అమ్మాయి – అబ్బాయి మధ్యే కాదు పిల్లలు – పేరెంట్స్, తల్లి – కూతురు మధ్య అని కూడా చూపించి టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఓపిక ఉంటే ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు. పిల్లలు, పెద్దలు కలిసి చూడొచ్చు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో పేరెంట్స్ ని వదిలేసే పిల్లలు, పెద్దలు కచ్చితంగా చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ అయితే ఇచ్చారు కానీ సినిమాటిక్ గా కంటే కాస్త డాక్యుమెంటరీగానో, షార్ట్ ఫిలిం చూసిన భావనో కలుగుతుంది. సినిమాలో చాలా ఎమోషన్ ఉన్నా, కన్నీళ్లు తెప్పించగల సీన్స్ ఉన్నా ప్రేక్షకుడు దానికి కనెక్ట్ అయ్యేవిధంగా తీయలేదు అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రామయ్య వస్తావయ్యా.. లాంటి పలు తెలుగు సినిమాల్లో బామ్మ పాత్రల్లో మెప్పించిన రోహిణి హట్టంగడి ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో చక్కగా నటించారు. బిజీ లైఫ్ లో పరిగెత్తే భార్య భర్త పాత్రల్లో రోహిణి ముల్లేటి, సముద్రఖని పర్ఫెక్ట్ గా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇటీవల ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో మెప్పిస్తున్న రోహిణి ముల్లేటి ఈ సినిమాలో తల్లిగా, కూతురుగా ఆ పాత్రలో బాగా నటించారు. హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని, ప్రభావతి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. సినిమా అంతా రెండు, మూడు లొకేషన్స్ లో సింపుల్ గా తీసేసారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చే పాయింట్ తీసుకొని రెగ్యులర్ కథాంశంతో ఎమోషనల్ గా చెప్పాలని ప్రయత్నించారు. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాని తక్కువ ఖర్చుతోనే మంచి విజువల్స్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘ఒక మంచి ప్రేమకథ’ సినిమా పేరెంట్స్ ని వదిలేసి జీవితంలో పరిగెత్తే పిల్లల కోసం.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.