K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

K ర్యాంప్ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాడు కిరణ్ అబ్బవరం. (K Ramp Review)

K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

K ramp Review

Updated On : October 18, 2025 / 12:55 PM IST

K Ramp Review : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా తెరకెక్కిన సినిమా ‘K ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా K ర్యాంప్ సినిమా నేడు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(K Ramp Review)

కథ విషయానికొస్తే.. కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) బాగా డబ్బున్న వ్యక్తి(సాయి కుమార్) కొడుకు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో గారాబంగా పెంచడంతో అల్లరి చిల్లరగా తయారవుతాడు. కుమార్ తండ్రి అతన్ని కేరళకి పంపించి చదివించాలని చూస్తాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ ని కూడా పంపిస్తాడు. కేరళలో ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యాక అక్కడ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ కుమార్ మామయ్య(నరేష్) ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఓ రోజు బాగా తాగేసి రోడ్డు మీద ఇబ్బంది పడుతుంటే మెర్సీ జాయ్(యుక్తి తరేజా) కాపాడుతుంది.

కుమార్ మెర్సీతో ప్రేమలో పడిపోతాడు. మెర్సీ కూడా తన క్లాస్ అవ్వడంతో అమ్మాయి వెనకే తిరుగుతూ ఉంటాడు కుమార్. ఓ సంఘటనతో తను కూడా కుమార్ ప్రేమలో పడుతుంది. ఓ రోజు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఒక టైం, అడ్రెస్ చెప్పి కుమార్ ని రమ్మంటుంది మెర్సీ. కానీ కుమార్ తాగి పడిపోవడంతో వెళ్ళడు. కుమార్ రాకపోవడంతో మెర్సీ సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్ పాలవుతుంది. ఈ సంఘటనతో కుమార్ చాలా భయపడతాడు. ఆమెకు PTSD(Post Traimatic Stress Disorder) అనే వ్యాధి ఉందని తెలుస్తుంది. అసలు మెర్సీకి ఉన్న PTSD వ్యాధి ఏంటి? ఎందుకు వచ్చింది? మెర్సీకి ఉన్న వ్యాధితో కుమార్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేసాడు? కుమార్ తండ్రి బాధని అర్ధం చేసుకొని మారతాడా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Anandalahari Review : ‘ఆనందలహరి’ సిరీస్ రివ్యూ.. వెస్ట్ గోదావరి అమ్మాయి – ఈస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే..

సినిమా విశ్లేషణ..

K ర్యాంప్ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాడు కిరణ్ అబ్బవరం. ప్రమోషన్స్ కూడా బాగా చేసాడు. ఈ సినిమా ముందునుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక వైబ్ చూపించారు. ఫస్ట్ 15 నిముషాలు కిరణ్ ఎంట్రీతో థియేటర్స్ లో అరుపులు, సింగిల్ థియేటర్స్ అయితే ఊగిపోవడం ఖాయం. కుమార్ కేరళ వెళ్లిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరోయిన్ ఎంట్రీతో లవ్ స్టోరీ సాగుతుంది. లవ్ స్టోరీ అంతా రొటీన్ గానే సరదాగా అక్కడక్కడా కామెడీతో సాగుతుంది.

ఇంటర్వెల్ కి మెర్సీ సూసైడ్ చేసుకోవడం, ఆమె వ్యాధి గురించి చెప్పడంతో నెక్స్ట్ ఏమైంది అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా మెర్సీ సమస్యతో కుమార్ ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత ఫ్రస్టేషన్ అయ్యాడు అనేది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అయితే ఈ సీన్స్ మరీ ఎక్కువ చూపించడంతో అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. మధ్యలో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఫుల్ నవ్వుకోవాల్సిందే. క్లైమాక్స్ లో మాత్రం అసలు ప్రేమ అనే ఎమోషన్ గురించి, తండ్రి ఎమోషన్ గురించి, మెర్సీని కుమార్ ఎలా మార్చాడు అనేది బాగున్నా కాస్త ఫాస్ట్ గా ముగించేశారు అనిపిస్తుంది.

హీరోయిన్ కి ఉన్న సమస్య గురించి మొదటి నుంచి హింట్స్ ఇస్తూ బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నరేష్ సీన్స్ కూడా బాగుంటాయి. నరేష్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి ఫుల్ గా నవ్వుకోవాల్సిందే. కొన్ని సీన్స్ నవ్వొచ్చినా అవి ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ వాటికి చివర్లో మంచి ఎండ్ ఇచ్చారు. మలయాళం సినిమాలని తెలుగు సినిమాలు కంపేర్ చేస్తూ బాగానే కౌంటర్ ఇచ్చారు. లాస్ట్ దీపావళికి ‘క’ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి K ర్యాంప్ తో హిట్ కొడతాడు అనుకోవచ్చు. బి,సి సెంటర్స్ లో అయితే సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా కొంత సాగదీసినా K ర్యాంప్ ఒక మాస్ లౌడ్ కామెడీ ఎంటర్టైనర్ గా మెప్పిస్తుంది. సినిమా మొదట్లో ఆల్కహాల్, సిగరెట్ తాగొద్దు అనే ప్రకటనలు వేయడం కామన్. కానీ పైరసీ గురించి, సూసైడ్స్ చేసుకోవద్దు అనే పాయింట్స్ కూడా ప్రస్తావించడం మెచ్చుకోదగ్గ విషయం.

K Ramp Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

చాలా చిల్లరగా ప్రవర్తించే యువకుడి పాత్రలో కిరణ్ అబ్బవరం బాగా సెట్ అయ్యాడు. క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ సీన్ లో కిరణ్ ఫస్ట్ టైం బాగా ఎమోషనల్ అయి ఏడ్చాడు అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం చీర కట్టుకునే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ చేయాలంటే కాస్త ధైర్యం ఉండాల్సిందే. కిరణ్ ఈ సినిమాకి చాలా కొత్తగా కనిపించి తనలోనే వేరియేషన్స్ ని చూపించాడు.

యుక్తి తరేజా అందాలు ఆరబోస్తూనే తనకు ఉన్న సమస్యని చూపించడంలో నటిగా సక్సెస్ అయింది. యుక్తి కూడా వేరియేషన్స్ తో మెప్పిస్తుంది. సీనియర్ హీరో నరేష్ తన పర్ఫార్మెన్స్ తో ఫుల్ గా నవ్విస్తారు. మురళిధర్ గౌడ్, వెన్నెల కిషోర్ బాగా నవ్విస్తారు. విమలారామన్, అజయ్, కామ్నా జెటల్మాని, సంజయ్ స్వరూప్ గెస్ట్ పాత్రల్లో బాగానే మెప్పించారు. అలీ, శ్రీనివాస రెడ్డి, బిగ్ బాస్ సీత.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Dude Review : ‘డ్యూడ్’ మూవీ రివ్యూ.. భార్య వేరే వాళ్ళని లవ్ చేస్తే..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే కలర్ ఫుల్ గా రిచ్ గా ఉన్నాయి. సినిమా మొత్తం కేరళలోనే తీయడంతో అక్కడ అందమైన లొకేషన్స్ ని బాగా చూపించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇలాంటి BGM సింగిల్ స్క్రీన్స్ లో చూస్తేనే ఓ వైబ్ ఉంటుంది. పాటలు కూడా రిపీటెడ్ గా వినేలా బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్స్ కాస్త షార్ప్ కట్స్ చేయాల్సింది. ఒక లవ్ స్టోరీ, హీరోయిన్ కి ఓ సమస్య.. బేసిక్ కథ పాతదే అయినా దాన్ని ఫుల్ కామెడీ కథాంశంతో నవ్వించే ప్రయత్నం చేశారు. డైలాగ్స్ కూడా ఇప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘K ర్యాంప్’ సినిమా ఓ ప్రేమకథని, ఓ సమస్యని ఫుల్ కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. దీపావళికి థియేటర్స్ లో ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.