Anandalahari Review : ‘ఆనందలహరి’ సిరీస్ రివ్యూ.. వెస్ట్ గోదావరి అమ్మాయి – ఈస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే..
'ఆనందలహరి' వెబ్ సిరీస్ గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో పెళ్లిపై చూపించిన కథ. (Anandalahari Review)

Anandalahari Review
Anandalahari Review : అభిషేక్, భ్రమరాంబిక జంటగా తెరకెక్కిన సిరీస్ ‘ఆనందలహరి’. సురేష్ ప్రొడక్షన్స్ మినీ బ్యానర్ పై ప్రవీణ్ ధర్మపురి నిర్మాణంలో సాయి వనపల్లి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(Anandalahari)
కథ విషయానికొస్తే.. ఆనంద్(అభిషేక్) ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఓ గ్రామ సర్పంచ్ కొడుకు. బిటెక్ ఫెయిల్ అయినా పాసయ్యాను అని చెప్పి ఇష్టమొచ్చినట్టు తాగి తిరుగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆనంద్ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తాడు. లహరి(భ్రమరాంబ) వెస్ట్ గోదావరి అమ్మాయి. ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ తో పెరుగుతుంది. ఎక్కడికైనా వెళ్లి బతకాలి, జాబ్ చేయాలి అనుకుంటుంది. పెళ్లంటే ఇష్టం ఉండదు. కానీ ఓ సంఘటనతో లహరి తల్లి ఆమెకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. దీంతో ఈ రెండు కుటుంబాలు కలిసి ఆనంద్ – లహరికి పెళ్లి చేస్తాయి. లహరి పెళ్లి చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వవు.
పెళ్లి తర్వాత ఇద్దర్ని హైదరాబాద్ లో కాపురం పెట్టమని పంపిస్తారు. ఫ్రీడమ్ వస్తుందని లహరి ఓకే అంటుంది ఆనంద్ నో అంటాడు. చివరికి అందరూ కలిసి వాళ్ళని హైదరాబాద్ పంపిస్తారు. లహరి జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆనంద్ తాగి ఏమి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. డబ్బుల కోసం ఇంట్లోవి అన్ని అమ్మేయడం మొదలుపెడతాడు. ఆనంద్ తండ్రి అతనికి డబ్బు ఇవ్వకుండా లహరికి ఇస్తాడు. దీంతో డబ్బుల కోసం లహరి చెప్పిన ఇంట్లో పనులని చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. ఈ ఇద్దరూ విడిపోదాం అనుకునే వరకు వెళ్తారు. మరి ఈ ఇద్దరూ కలుస్తారా? ఆనంద్ మంచిగా మారి ఏదైనా పని చేస్తాడా? లహరి జాబ్ తెచ్చుకుంటుందా? లహరికి ఆనంద్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుందా? ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండి ఎలాంటి సంఘటనలు ఫేస్ చేసారు? ఇద్దరూ భార్యాభర్తలుగా దగ్గరయ్యారా తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..
సిరీస్ విశ్లేషణ..
ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే భార్యాభర్తలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఆనందలహరి కూడా అదే కథాంశం కాకపోతే గోదావరి బ్యాక్ డ్రాప్ లో కాస్త ఎంటర్టైనింగ్ గా చెప్పాలని చూసారు. 8 ఎపిసోడ్స్ ఉన్నా అన్ని ఎపిసోడ్స్ లో కథని బాగా సాగదీశారు. అసలు ఇద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయాక ఓ మూడు నాలుగు ఎపిసోడ్స్ ఏ కంటెంట్ లేకుండా సీన్స్ తోనే సాగదీశారు. లాస్ట్ రెండు ఎపిసోడ్స్ లో వచ్చిన ఓ సమస్య తీరుతుందా లేదా అనే ఆసక్తి కలిగించారు కానీ ఆ ఆసక్తి పోయేలా కథ ముందుకు సాగకుండా మాంటేజ్ సీన్స్ తోనే బాగా సాగదీశారు.
మొదట ఒకరికొకరు తిట్టుకోవడం, తర్వాత మెల్లిగా అర్ధం చేసుకొని దగ్గరవడానికి ప్రయత్నించడం రొటీన్ కథాంశం. బిటెక్ చదివిన అబ్బాయికి ల్యాప్ టాప్ ఎలా ఆన్ చేయాలో తెలియకపోవడం, వీసా అంటే ఏంటో తెలియకపోవడం.. లాంటి సిల్లీ సీన్స్ చాలానే ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడకుండానే చాలా అపార్థాలు వస్తాయి, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ప్రేమ, భార్యాభర్తలకు సమస్య వస్తే పెద్దలు ఏం చేయాలి అనే కొన్ని మంచి పాయింట్స్ అయితే చూపించారు. ముందు నుంచి సైలెంట్ గా ఉండి లాస్ట్ లో ఒకేసారి అందరి మీద హీరో అరిచేసి మెసేజ్ ఇచ్చి అందర్నీ మార్చేయడం.. చాలా రొటీన్ కథాంశం.
ఇక కామెడీ చాలా చోట్ల ట్రై చేసారు కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. వెబ్ సిరీస్ లో నాలుగు పాటలు ఉండటం గమనార్హం. ల్యాగ్ సీన్స్ అన్ని కట్ చేసి ఓ రెండు గంటల సినిమా కింద చేస్తే బెటర్ అనిపిస్తుంది. వెస్ట్ గోదావరి – ఈస్ట్ గోదావరికి పడదు అని, రెండు గోదారి జిల్లాలు అయినా అక్కడ ఉండే వ్యత్యాసాలు చూపించడానికి బాగానే ట్రై చేసారు. ఓ క్లాస్ లవ్ స్టోరీ చెప్పాలని, గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ట్రై చేయాలని చూసినా అంతా పాతగానే ఉంటుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
అభిషేక్ పల్లెటూరి అబ్బాయిగా జులాయిగా తిరిగే పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. భార్య దూరంగా ఉంచే భర్తగా, ఆమెని ఇంప్రెస్ చేయాలనే పాత్రలో బాగానే నటించాడు. యూట్యూబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న భ్రమరాంబిక ఈ సిరీస్ లో లైఫ్ లో ఎదగాలి అనే పాత్రలో, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో బాగా నటించింది. కథ ఆల్మోస్ట్ ఈ ఇద్దరి చుట్టే నడుస్తుంది. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Dude Review : ‘డ్యూడ్’ మూవీ రివ్యూ.. భార్య వేరే వాళ్ళని లవ్ చేస్తే..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్లో చూపించడంతో పచ్చని పొలాలు, గోదావరి లొకేషన్స్ తో అందంగా రియాలిటీ లొకేషన్స్ లో తెరకెక్కించారు. కథ, కథనం చాలా పాతది. డైలాగ్స్ కూడా రొటీన్. ఎడిటర్ తన కత్తెరకి ఇంకా పని చెప్పి కట్ చేస్తే బాగుండు కానీ వెబ్ సిరీస్ లు అంటే స్లో నెరేషన్ లోనే ఉండాలి అనే ఒక రూల్ లాగా అందరూ ఫీల్ అవుతుండటంతో అలాగే ఉంచినట్టు ఉన్నారు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఆనందలహరి’ వెబ్ సిరీస్ గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో పెళ్లిపై చూపించిన కథ. ఫార్వార్డ్ చేసుకుంటూ చూస్తే ఆనందమే.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.