Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. పడిపోయాడనుకున్నారు.. కానీ బాలీవుడ్‌నే నిలబెట్టాడు..

అందరూ షారుఖ్ పని అయిపోయిందన్నారు. బాలీవుడ్ లో షారుఖ్ తప్ప అందరూ హిట్స్ కొడుతున్నారు. 2018లో జీరో సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. పడిపోయాడనుకున్నారు.. కానీ బాలీవుడ్‌నే నిలబెట్టాడు..

Shah Rukh Khan Bollywood Badhshah Birthday Special Story

Updated On : November 1, 2023 / 3:45 PM IST

Shah Rukh Khan Birthday : ప్రతి పరిశ్రమలో ప్రతి జనరేషన్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా ఒక్కడు మాత్రం ఇండస్ట్రీని ఏలే హీరో ఉంటాడు. బాలీవుడ్(Bollywood) లో అమితాబ్(Amitabh) ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఎంతోమంది హీరోలు వచ్చారు. కానీ వాళ్ళల్లో బాలీవుడ్ ని ఏలింది మాత్రం షారుఖ్ ఒక్కడే. తన సినిమాల సక్సెస్ రికార్డులతో బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు షారుఖ్.

ఢిల్లీలో పుట్టిన షారుఖ్ మొదటి నుంచి కూడా సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ముంబైకి వచ్చేసాడు. ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. ముంబైలో ఉండటానికి రూమ్ కూడా లేక, డబ్బులు లేక బీచ్ పక్కన చాలా రోజులు పడుకున్నాను అని ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ చెప్పాడు. పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసి సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఓ నాలుగేళ్లు గడిపాడు.

మొదటిసారి 1992లో వచ్చిన దీవానా సినిమాలో ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేసి వెండితెరపై ఎక్కువసేపు కనిపించాడు. ఆ తర్వాత ఇలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశాడు. 1993 లో వచ్చిన బాజీగర్, డర్ సినిమాల్లో విలన్ గా కనిపించి అదరగొట్టాడు. దీంతో అన్నీ విలన్ రోల్స్ వచ్చేసరికి రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హీరోగా, హీరోగా చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది ఆ సినిమా, సాంగ్స్. దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు షారుఖ్.

అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తూ అభిమానులను పెంచుకున్నాడు, బాలీవుడ్ కి బాద్ షా అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత పర్దేశ్, దిల్ తో పాగల్ హై, డూప్లికేట్, దిల్ సే, కుచ్ కుచ్ హోతా హై, కభికుషి కభీ గమ్.. లాంటి అనేక సినిమాలతో లవర్ బాయ్ అనిపించుకుని ఎంతోమంది అమ్మాయిలకు ఫేవరేట్ హీరో అయ్యాడు. వరుసగా ప్రేమ సినిమాలతో సక్సెస్ కొట్టిన షారుఖ్ అప్పట్లో అమ్మాయిలంతా చేసుకుంటే షారుఖ్ లాంటివాడినే చేసుకోవాలి అనేంతలా జనాల్లోకి వెళ్ళిపోయాడు తన సినిమాలతో.

2002 లో షారుఖ్ దేవదాస్ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. 2006 లో వచ్చిన డాన్ సినిమా షారుఖ్ ని మార్చేసి మాస్ హీరోని చేసింది. ఆ తర్వాత చక్ దే ఇండియా సినిమా తనలోని నటుడు అన్నీ పాత్రలకు న్యాయం చేయగలడు అని నిరూపించింది. ఓం శాంతి ఓం, రబ్ నే బనాది జోడి, డాన్ 2, జబ తక్ హై జాన్.. ఇలా 20వ దశాబ్దంలో కూడా వరుస హిట్స్ కొడుతూ బాలీవుడ్ ని పూర్తిగా ఏలేసాడు. అప్పటికే షారుఖ్ అంటే ఇండియా అందరికి తెలుసు. బాలీవుడ్ బయట కూడా అభిమానులు ఉన్నారు. కానీ 2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో సౌత్ మొత్తం షారుఖ్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ సినిమా సౌత్ లో కూడా భారీ విజయం సాధించింది. సౌత్ లో కూడా షారుఖ్ కి ఫ్యాన్స్ క్లబ్స్ పెట్టేలా చేసింది. ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్, మరో పక్క అవార్డులు.. ఇలా డబ్బులు, ఫేమ్ తో చూడాల్సిన సక్సెస్ అంతా చూసేసాడు.

ఇలా వరుస సక్సెస్ లతో బాలీవుడ్ బాద్ షా దూసుకెళ్లిపోతుంటే 2016 లో చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘ఫ్యాన్’ షారుఖ్ స్పీడ్ కి అడ్డుకట్ట వేసింది. అక్కడ్నుంచి రేస్, జబ హ్యారీ మెట్ సీజల్, జీరో.. వరుసగా ఒకదానిమించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అందరూ షారుఖ్ పని అయిపోయిందన్నారు. బాలీవుడ్ లో షారుఖ్ తప్ప అందరూ హిట్స్ కొడుతున్నారు. 2018లో జీరో సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. అప్పుడే కరోనా వచ్చింది. ఆ తర్వాత షారుఖ్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి షారుఖ్ ని కోలుకోకుండా చేశాయి.

Also Read : Aishwarya Rai : ప్రపంచ సుందరికి 50 ఏళ్ళు.. నీలి కళ్ల సుందరి గురించి ఇవి మీకు తెలుసా..?

కరోనా తర్వాత బాలీవుడ్ కూడా పడిపోయింది. సౌత్ సినిమాలు అక్కడ సక్సెస్ సాధించడం మొదలైంది. బాలీవుడ్ ని కాపాడటానికి అమితాబ్ కూడా రిటైర్ అయిపోయాడు. వేరే స్టార్ హీరోలు కూడా ఫ్లాప్స్ లో ఉన్నారు. దీంతో బాలీవుడ్ పరిస్థితి ఏంటి అనుకునే సమయంలో షారుఖ్ పఠాన్ సినిమా రెడీ చేశాడు. రిలీజ్ అయ్యే వరకు ఎవ్వరికి నమ్మకం లేదు. హిట్ కొట్టి ఏడేళ్లయింది. సినిమా వచ్చి అయిదేళ్లయింది. బాలీవుడ్ ఫ్లాప్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో షారుఖ్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా అవసరమా అని అంతా అనుకున్నారు.

Image

ఈ సంవత్సరం జనవరి 25న పఠాన్ సినిమా ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పఠాన్ సినిమా భారీ విజయం సాధించింది. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి షారుఖ్ నిలబడటమే కాదు బాలీవుడ్ ని నిలబెట్టాడు. ఇది బాద్ షా సత్తా అని చూపించాడు. ఆ తర్వాత ఇటీవల జవాన్ సినిమాతో వచ్చి మరో భారీ హిట్ కొట్టి ఇంకో 1000 కోట్లు కలెక్షన్స్ రప్పించాడు. షారుఖ్ వేట మొదలుపెట్టాడు అని అభిమానులు ఫుల్ జోష్ లోకి వచ్చారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు భారీ హిట్స్ కొట్టిన షారుఖ్ మూడో సినిమా కూడా రెడీ చేస్తున్నాడు 1000 కోట్ల హ్యాట్రిక్ కోసం. డుంకి సినిమాతో ఈ డిసెంబర్ 21న రానున్నాడు షారుఖ్. అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

తినడానికి తిండి, ఉండటానికి రూమ్ కూడా లేక రోడ్డుపై పడుకున్న షారుఖ్ సినిమాల మీద ఉన్న పిచ్చితో కసిగా సాధించి, ఎదిగి, బాలీవుడ్ ని ఏలి పడిపోయినా మళ్ళీ పైకి ఎగిరి రూల్ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఈ ఏడాది 58వ పుట్టినరోజు చేసుకుంటున్నా ఇంకా యువ హీరోల్లా కనిపిస్తూ, బాడీని కూడా అలాగే మెయింటైన్ చేస్తూ కోట్ల మంది అభిమానులను మెప్పిస్తున్నాడు కింగ్ ఖాన్. ఇక ఆయన పుట్టిన రోజు నాడు వేలాది మంది అభిమానులు షారుఖ్ ఇంటి వద్దకు వచ్చి బయట నుంచి శుభాకాంక్షలు తెలుపుతారు. షారుఖ్ ఇంట్లో నుంచే వారందరికీ అభివాదం చేసి పంపిస్తాడు. ప్రతి పుట్టిన రోజు నాడు ఇది జరుగుతుంది.

Image