Sashimadhanam : ‘శశి మథనం’ రివ్యూ.. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేరని బాయ్ ఫ్రెండ్ ఇంటికొస్తే..

ప్రేమ కథతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రతి ఎపిసోడ్ లోను మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది.

Sashimadhanam Review : ఇటీవల అనేక వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ క్యూట్ లవ్ స్టోరీ, కామెడీతో చాలా తక్కువగా వస్తున్నాయి. ఈవిన్ ఓటీటీ ఇటీవల మంచి మంచి కంటెంట్ ని తీసుకొస్తుంది. తాజాగా ‘శశి మథనం’ అనే వెబ్ సిరీస్ తో ఈవిన్ ఓటీటీ వచ్చేసింది. ఈ సిరీస్ నేడు జులై 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్ వీడియోలు, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న ప్రేమ జంట సోనియా సింగ్, సిద్దు పవన్ మెయిన్ లీడ్స్ గా వినోద్ గాలి దర్శకత్వంలో మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శశి మథనం తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ సరదాగా తిరుగుతూ బెట్టింగ్ భాస్కర్ దగ్గర పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొని రెండు లక్షల పైగా బాకీ పడతాడు మదన్(సిద్ధూ పవన్). డబ్బుల కోసం భాస్కర్ ఏమైనా చేసేరకం అని తన అన్నయ్య(కేశవ్ దీపక్) బండి తీసుకొచ్చి డబ్బులిచ్చేదాకా ఉంచమని కనపడకుండా పారిపోతాడు. అదే సమయంలో తన ప్రియురాలు శశి(సోనియా సింగ్) ఇంట్లో వాళ్లంతా పది రోజులు పెళ్ళికి వెళ్తున్నారని తెలిసి ఓ పది రోజులు అక్కడ దాక్కుందామని వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఇంట్లో వాళ్ళు తిరిగొస్తారు. ఇక అక్కడ్నుంచి ఇంట్లో వాళ్లకు కనపడకుండా మదన్ అక్కడ ఎలా ఉన్నాడు? ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళని ఎలా మేనేజ్ చేసారు? ఈ సమయంలో శశికి పెళ్లి చూపులు జరిగితే మదన్ ఎలా చెడగొట్టాడు? మదన్ ఇంట్లో ఉన్నట్టు ఎవరెవరికి తెలిసింది? ఫైనల్ గా వీళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మదన్ అన్నయ్య బైక్ తిరిగొచ్చిందా? మదన్ అప్పు కట్టేసాడా? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : Prabhas Kalki : మహేష్ ఇలాకాలో ప్రభాస్ రికార్డ్.. హైదరాబాద్‌లో ఆ మూడు చోట్ల ప్రభాస్ ‘కల్కి’ సరికొత్త రికార్డ్..

సిరీస్ విశ్లేషణ.. ఇటీవల వెబ్ సిరీస్ లు చాలా వరకు బోల్డ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. క్యూట్ లవ్ స్టోరీలు, మంచి ఎమోషన్ ఉన్న సిరీస్ లు చాలా తక్కువ. ఇది అలాంటి క్యూట్ లవ్ స్టోరీ సిరీస్. ప్రేమ కథలు ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. అయితే ప్రేమ కథతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రతి ఎపిసోడ్ లోను మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో ఇలా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేయడం చూసాం. కానీ ఈ సిరీస్ అంతా ఇదే కథతో నడుస్తుంది.

చాలా వరకు సిరీస్ ఒకటే లొకేషన్ లో ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం రాసుకున్నారు. ఓ పక్క మదన్ ఎవరికీ కనపడకుండా ఉండటానికి శశి, మదన్ లు పడే టెన్షన్ తో కామెడీ, మరో పక్క కనిపిస్తే ఏమవుతుందని సస్పెన్స్, మరో పక్క వీరిద్దరి మధ్య క్యూట్ మూమెంట్స్.. ఇలా అన్ని బాగా రాసుకున్నారు. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం అసలు కథలోకి వెళ్ళేదాకా కొంచెం బోర్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇందులో ఉన్న రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి. అందులో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. ఈ సిరీస్ లోని శశి, మదన్ పాత్రలతో ప్రేమలో పడిపోతారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సోనియా సింగ్, సిద్ధూ పవన్ ఇప్పటికే అనేక సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించారు. నిజ జీవితంలో కూడా ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్ లో కూడా చక్కగా క్యూట్ గా నటించి మెప్పించారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ క్యూట్ గా చూడటానికి చాలా బాగుంటాయి. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ ఫుల్ గా నవ్విస్తారు. అలాగే శశి తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే మంచి ఎమోషన్ అందించారు. మదన్ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పిస్తాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొడుతుంది. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు అందరూ మెప్పిస్తారు.

సాంకేతిక విషయాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీకి తగ్గట్టు చాలా ఫ్రెష్ గా కెమెరా విజువల్స్ ఉంటాయి. ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పాటలు బాగున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే అనిపిస్తుంది. కథ పాతదే అయినా కథనం చాలా కొత్తగా ఆసక్తిగా రాసుకున్నారు. దర్శకుడిగా వినోద్ గాలి మెప్పించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు స్క్రీన్ పై కనిపిస్తుంది.

మొత్తంగా ‘శశి మథనం’ సిరీస్ ప్రియురాలు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ప్రియుడు ఎలా దాక్కున్నాడు, తెలిస్తే ఏమవుతుంది అనే సస్పెన్స్ లవ్ స్టోరీతో క్యూట్ గా చూపెట్టారు.

గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు