దివికేగిన దిగ్గజం..

SP Balasubrahmanyam Final rites: ఇక శెలవు అంటూ గాన గంధర్వుడు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో పాటకు వన్నె తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. సినీ పరిశ్రమ ఇంకా బాలు మరణవార్తను జీర్ణించుకోలేకపోతోంది.
బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన సంతోషంగా గడిపిన తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్ (ఫామ్‌హౌస్) లో జరిగాయి. బాలు పార్థివ దేహానికి వైదిక శైవ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ క్రతువు నిర్వహించారు.
అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే అనుమతినిచ్చారు. బాలు కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరి ఎస్పీ శైలజ, బావమరిది శుభలేఖ సుధాకర్, మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. దళపతి విజయ్ అక్కడకు చేరుకుని బాలుకు నివాళులర్పించారు. తనయుడు చరణ్‌ను ఆయన ఓదార్చారు.
అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపారు.. బాధాతప్త హృదయాలతో బాలు పార్థివ దేహాన్ని ఖననం చేశారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు.