Oh Bhama Ayyo Rama : ‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. సుహాస్ కొత్త సినిమా ఎలా ఉంది?

మొదట్నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఇప్పుడు ఓ భామ అయ్యో రామ అనే కమర్షియల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Oh Bhama Ayyo Rama

Oh Bhama Ayyo Rama Movie Review : సుహాస్, మాళవిక మనోజ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఓ భామ అయ్యో రామ’. వీ ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాణంలో రామ్ గోధల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ హరీష్ శంకర్, మారుతీలు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఒకప్పటి హీరోయిన్ అనిత హాసనందిని, అలీ, రవీంద్ర విజయ్, బబ్లూ పృథ్వీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఓ భామ అయ్యో రామ సినిమా నేడు జూలై 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. రామ్(సుహాస్)చిన్నప్పుడే అమ్మ మీనాక్షి(అనిత) చనిపోవడంతో మేనమామ(అలీ) దగ్గర పెరుగుతాడు. ఓ యాక్సిడెంట్ లో సత్యభామ(మాళవిక మనోజ్) పరిచయం అవుతుంది. సత్యభామని జాగ్రత్తగా ఇంటిదగ్గర డ్రాప్ చేశాడని తెలియడంతో రామ్ పై ఇష్టం పెంచుకొని అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఏ అమ్మాయిని పట్టించుకోని ఎంబీఏ చదువుతున్న రామ్ సత్యభామని ఇష్టపడతాడు. రామ్ కి చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా సినిమాలు చూడడు, నీళ్లు అంటే భయం. సత్య రామ్ ని తీసుకెళ్లి డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరుస్తుంది. ఓ రోజు రామ్ వాళ్ళ నాన్నని చూడటం, అదే సమయంలో సత్యకు యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. సత్యకి ఏమవుతుంది? అసలు రామ్ చిన్నప్పుడు ఏం జరిగింది? సినిమాలు అంటే ఇష్టం లేని రామ్ డైరెక్టర్ అవుతాడా? రామ్ – సత్యభామ ప్రేమకథ ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Vintara Saradaga : మహేష్ మేనల్లుడి కొత్త సినిమా.. వింటారా సరదాగా..

సినిమా విశ్లేషణ.. మొదట్నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఇప్పుడు ఓ భామ అయ్యో రామ అనే కమర్షియల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా రామ్ పాత్ర, అతని ఫ్రెండ్స్ కామెడీ. రామ్ చుట్టూ హీరోయిన్ తిరగడంతో సాగుతుంది. హీరోయిన్ యాక్సిడెంట్ తో ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ రామ్ చిన్నతనం, రామ్ సినిమా వర్క్, మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ తో సాగదీశారు.

చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఇంటర్ కట్ సీన్స్ రిపీటెడ్ గా పడటం, చూపించిందే మళ్ళీ చూపించడం చేసారు. ఫ్లాష్ బ్యాక్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు. మేనమామ సెంటిమెంట్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది కానీ ఫ్లాష్ బ్యాక్ లో చూపించే ఓ మేనమామ సీన్ మాత్రం మరీ ఓవర్ గా అనిపిస్తుంది. ఇక కామెడీ సీన్స్ అన్ని ఇరికించినట్టు ఉంటాయి. ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన సీన్స్ లో బలవంతంగా నవ్వుకోవాల్సిందే. చివరకు రామ్ వాళ్ళ నాన్న ఏమయ్యాడో చూపించలేదు. ఇక క్లైమాక్స్ లో ఆడియన్స్ ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నించారు. సెకండ్ హాఫ్ లో కథని వెనక్కి తీసుకెళ్తూ కొన్ని ట్విస్ట్ లు ఇచ్చారు కానీ అవన్నీ రొటీన్ సీన్స్. ప్రతి కథలోనూ కొత్తదనం చూపించే సుహాస్ ఇప్పుడు ఇలాంటి రొటీన్ లవ్ కమర్షియల్ సినిమాతో రావడం గమనార్హం.

గుంటూరు కారం సినిమాలో మహేష్ హైదరాబాద్ – గుంటూరుకు ట్రిప్స్ వేసినట్టు ఇందులో సుహాస్, హీరోయిన్ కలిసి హైదరాబాద్ – వరంగల్ ట్రిప్పులు వేయడం గమనార్హం. మొత్తంగా డైరెక్టర్ కొంత ఫిక్షన్ జోడించి తన సొంత కథనే సినిమాగా మలిచాడేమో అని సందేహం రాకమానదు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సుహాస్ ఎప్పట్లాగే ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. సుహాస్ డ్యాన్సర్ గా ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాట పాడి తన డ్యాన్స్ ట్యాలెంట్ ని చూపించాడు. మలయాళ భామ మాళవిక మనోజ్ తెలుగులో ఎంట్రీ ఇస్తూ క్యూట్ గా కనిపిస్తూనే తన నటనతో మెప్పించింది. హీరో మేనమామగా చాన్నాళ్లకు అలీకి ఒక మంచి పాత్ర పడింది.

హీరో ఫ్రెండ్స్ గా మోయిన్, సాత్విక్ ఆనంద్ ఓకే అనిపించారు. బబ్లూ పృథ్వీ కాసేపు హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించాడు. ఒకప్పటి హీరోయిన్ నువ్వు నేను ఫేమ్ అనిత హాసనందిని తల్లి పాత్రలో పర్వాలేదనిపించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ తన రియల్ లైఫ్ పాత్రలోనే నటించారు. మారుతీ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. రవీంద్ర విజయ్ హీరో తండ్రి పాత్రలో బాగానే మెప్పించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Sobhita Dhulipala : చీరకట్టులో శోభిత ధూళిపాళ.. ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ మాత్రం వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ లో రిపీటెడ్ సీన్స్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. హీరోయిన్ డామినేటెడ్ పాత్రతో రొటీన్ కథ కథనంతో తెరకెక్కిచాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా తల్లి సెంటిమెంట్ తో కూడిన లవ్ స్టోరీ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.