Mahesh Babu
Ramesh Babu Funeral : సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ రమేశ్‌బాబు.. పరిస్థితి విషమించడంతో ఏఐజీకి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 2022, జనవరి 09వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రమేశ్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది.
Read More : Telangana : టి.కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ..ఎందుకో
రమేశ్ బాబు తొలుత హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు. అల్లూరి సీతారామరాజు సినిమాతో రమేశ్‌బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్ మూవీతో హీరోగా పరిచయమైన రమేశ్‌బాబు.. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు.. చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్నా చెల్లెలు, పచ్చతోరణంలో రమేశ్‌బాబు నటించారు.
Read More : Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం
చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్ చిత్రంలో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. అర్జున్, అతిథి సినిమాలు నిర్మించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మహేశ్ బాబు కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్న కారణంగా ఆయన తన సోదరుడిని కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.