RAM Review : ‘రామ్'(ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ రివ్యూ.. రిపబ్లిక్ డే రోజు దేశభక్తి సినిమా..
రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదల అయింది.

Surya Dhanya Balakrishna Patriotic Movie RAM Rapid Action Mission Review and Rating
RAM – Rapid Action Mission Review : సూర్య అయ్యలసోమయాజుల, ధన్య బాలకృష్ణ(Dhanya Balakrishna) జంటగా కొత్త దర్శకుడు మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యానర్స్ పై దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘రామ్’ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తిని చాటేవిధంగా ఈ సినిమా ఉండబోతుందని ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదల అయింది.
కథ విషయానికొస్తే.. ఓ ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో ఉండే కొంతమంది టెర్రరిస్టులని మన ఇండియన్ ఆఫీసర్స్ అంతమొందించడంతో మొదలవుతుంది. ఈ ఘటనలో తన టీంలో జెబి(భానుచందర్)తో పాటు మిగిలిన వాళ్ళని కాపాడి మేజర్ సూర్యప్రకాష్(రోహిత్) చనిపోతారు. అనంతరం ఇరవై ఏళ్ళ తర్వాత కథ ప్రస్తుతానికి తీసుకొస్తారు. ఇండియా బోర్డర్ లో కాకుండా ఇండియా లోపల ఉండే టెర్రరిస్ట్ లను అంతమొందించడానికి HID (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్) అనే సంస్థని స్థాపిస్తారు. సూర్యప్రకాష్ కొడుకు రామ్(సూర్య) దేశం వల్లే తన నాన్న చనిపోయాడంటూ వాళ్ళ నాన్నని, ఆ జాబ్ ని కూడా ద్వేషిస్తాడు.
ఆఫీసర్ జెబి సూర్యని తమ HID లో జాయిన్ అవ్వాలని, రామ్ తండ్రి కోరిక అని పలు మార్లు చెప్పినా పట్టించుకోడు. అనుకోకుండా జెబి కూతురు జాహ్నవి(ధన్య బాలకృష్ణ)ని రామ్ ప్రేమిస్తాడు. తన కూతురుతో పెళ్లి కావాలంటే డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే అనడంతో రామ్ HID లో జాయిన్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటాడు. మరి రామ్ HID లో జాయిన్ అయి వాళ్ళ నాన్న కోరిక తీర్చడా? వాళ్ళ నాన్న మీద కోపం పోతుందా? ఇండియా లోపల ఉండి టెర్రరిస్ట్ ల కోసం పనిచేసే వాళ్ళని రామ్ అంతం చేశాడా? ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఏంటి? జాహ్నవి – రామ్ ల ప్రేమ ఏమైంది అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. తండ్రి దేశం కోసం ప్రాణాలర్పిస్తే కొడుకు కూడా తండ్రి కోసం, దేశం కోసం పోరాడడం అనేది గతంలో పలు సినిమాల్లో చూశాం. అయితే ఈ రామ్ సినిమాలో బోర్డర్ లోనో, పోలీస్ డిపార్ట్మెంట్ లోనో కాకుండా ఇండియా లోపల ఉండి సైలెంట్ గా టెర్రరిస్ట్ ల కోసం పనిచేసే వారిని అంతమొందించే కథని చూపించారు. మొదట్లోనే టెర్రరిస్ట్ లపై ఇండియన్ ఆఫీసర్స్ అటాక్ తో సినిమాని మొదలుపెట్టి ఇది దేశభక్తి సినిమా అని అక్కడే చెప్పేస్తారు.
ఇక ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు, వాటి మధ్య ఫ్రెండ్ తో కామెడీ, డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడానికి హీరో ట్రైనింగ్ అంశాలతో సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఓ టెర్రరిస్ట్ ని పట్టుకునే యాక్షన్ సీన్ చూపించి అక్కడ్నుంచి హీరో ఎలా మారాడు అనే ఆసక్తితో సెకండాఫ్ లోకి తీసుకెళ్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ టెర్రరిస్ట్ చేసిన ప్లాన్ ఏంటో కనుక్కొని హీరో దాన్ని ఆపడానికి వెళ్లడం, మధ్యలో అతను ఎదుర్కున్న అతని ఇబ్బందులు, ఈ క్రమంలో ఆఫీసర్ జెబి మరణించడం, సాయి కుమార్ పాత్రతో ఎమోషనల్ గా సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా నడిచినా, అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం దేశభక్తి అనే అంశాన్నే తీసుకొని సీరియస్ గా నడిపించారు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. చివర్లో హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సహాయం చేయడం, సాయి కుమార్ కూడా హిందూ – ముస్లిం, దేశం గురించి డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ పై పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు దర్శకుడు. సిన్సియర్ ముస్లిం ఆఫీసర్ పాత్రను పోషించిన సాయికుమార్‌తో ఆ పాయింట్‌ను బలంగా చెప్పించాడు. అయితే సినిమాకి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ – రామ్ అని టైటిల్ పెట్టి సినిమాలో ఎక్కడా దాని గురించి మాట్లాడకుండా చివర్లో సూర్యప్రకాష్ పాత్ర దాని గురించి చెప్పి సీక్వెల్ ప్రకటించడం అంతగా వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది.
Also Read : Captain Miller Review : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ.. యుద్ధ సన్నివేశాల భావోద్వేగం..
నటీనటుల విషయానికొస్తే.. సూర్య కొత్త హీరో అయినప్పటికీ కామెడీ, యాక్షన్ సీన్స్ లో బాగా నటించాడు. ధన్య ప్రేమ సన్నివేశాల్లో, ఎమోషన్ సీన్స్ లో మెప్పిస్తుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన రోహిత్ చాలా రోజుల తర్వాత ఇందులో మేజర్ సూర్యప్రకాష్ గా కనపడి దేశం కోసం ప్రాణాలు అర్పించే హీరోగా అలరించాడు. జెబి పాత్రలో భానుచందర్ మెప్పించారు. సాయి కుమార్ ఈ రామ్ సినిమాలో HID హెడ్ గా ఓ కీలక పాత్ర పోషించి తన డైలాగ్స్ తో ఎప్పటిలాగే అదరగొట్టారు. శుభలేఖ సుధాకర్, మీనా వాసు, అమిత్.. పలువురు వారి పాత్రల్లో చక్కగా నటించారు.
సాంకేతిక విషయాలు.. కెమెరా విజువల్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో BGM బాగుంటుంది. యాక్షన్ సీన్స్ బాగా డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో ప్రతి షాట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక కథ పాతదే అయినా HID అనే కొత్త అంశాన్ని జోడించి కథనాన్ని నడిపించారు. దర్శకుడికి మొదటి సినిమా అయినా బాగానే తెరకెక్కించాడని చెప్పొచ్చు. హీరో కొత్త అయినా మిగిలిన వాళ్ళని స్టార్ కాస్ట్ ని తీసుకొచ్చి సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి, తండ్రి కోసం, ప్రేమ కోసం, దేశం కోసం పోరాడే యువకుడి కథాంశంతో తెరకెక్కింది రామ్ – ర్యాపిడ్ యాక్షన్ మిషన్. ఈ రిపబ్లిక్ డే రోజు సరైన దేశభక్తి సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..