Om Shanti Shanti Shantihi
Om Shanti Shanti Shantihi : తరుణ్ భాస్కర్, ఈశారెబ్బ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మాణంలో AR సజీవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళం సినిమా జయ జయ జయ జయహే రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది.( Om Shanti Shanti Shantihi)
శాంతి(ఈశారెబ్బ)ని చిన్నప్పట్నుంచి జాగ్రత్తలతో, పరిమితులతో పెంచుతారు. తను చేయాలనుకున్నది ఏది చేయలేకపోతోంది. కాలేజీలో ఒకర్ని లవ్ చేసిందని తెలియడంతో వెంటనే సంబంధం చూసి ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్)కి ఇచ్చి పెళ్లి చేస్తారు. రాజమండ్రిలో చేపల బిజినెస్ చేసే ఓంకార్ నాయుడుకి నా మాటే వినాలి, నాకు నచ్చినట్టే జరగాలి అనే అహంకారం ఉంటుంది. భార్య చేసే మంచి పనులు కూడా ఓంకార్ కి నచ్చవు. దీంతో ఓ రోజు చెంప మీద కొడతాడు. తర్వాత సారీ చెప్పి కూల్ చేసినా కొట్టడం రెగ్యులర్ గా జరుగుతుంది.
ఈ విషయాన్ని శాంతి ఇంట్లో వాళ్లకు చెప్పినా సర్దుకుపోవాలి అనడంతో ఏం చేయాలో తెలియక ఆన్లైన్ కరాటే నేర్చుకొని భర్తని ఫుల్ గా కొడుతుంది. దీంతో రెండు కుటుంబాలు పంచాయితీ పెడతారు. మరి ఆ తర్వాత ఓంకార్ నాయుడు మారాడా? శాంతి భర్తతో హ్యాపీగా ఉందా? శాంతి చేయాలనుకుంది చేసిందా? శాంతి ఇంట్లో వాళ్ళు తనకు సపోర్ట్ ఇచ్చారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ చెప్పేసిన మెగాస్టార్.. హమ్మయ్య ఎట్టకేలకు వచ్చేస్తుంది..
మలయాళం జయ జయ జయ జయహే సినిమా ఒక సెక్షన్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. తెలుగులో కూడా ఓటీటీలో సక్సెస్ అయింది. అసలు రీమేక్ లే అవసర్లేని ఇలాంటి సమయంలో జయ జయ జయ జయహే సినిమాని రీమేక్ చేయడం గమనార్హం. పైగా ప్రమోషన్స్ కూడా బాగానే చేసి ఇది రీమేక్ అనేవాళ్లకు కౌంటర్ ఇచ్చి అది ఇది వేరుగా ఉంటుంది నవ్వుకుంటారు వచ్చి చూడండి అని నిర్మాతతో సహా మూవీ యూనిట్ అంతా చెప్పుకొచ్చారు.
ఫస్ట్ హాఫ్ అంతా నిరాశగా, నిస్తేజంగా, అయ్యో పాపం అన్నట్టు సాగుతుంది. కామెడీ అన్నారు కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడో ఒకటి రెండు చోట్ల నవ్వుతారు. ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ చాలా సీన్స్ ఒరిజినల్ లోవి మక్కికి మక్కి దించేశారు. సెకండ్ హాఫ్ మొదట్లో కాసేపు నవ్వించినా ఒరిజినల్ సినిమాతో పోలిస్తే కాస్త మార్చి పూర్తి కమర్షియల్ సినిమాలా చేసారు. ఒరిజినల్ సినిమాకు క్లైమాక్స్ మైనస్ అయింది. ఈ సినిమాలో క్లైమాక్స్ బాగానే రాసుకున్నా సరైన ముగింపు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసారు. చివరి అరగంట చాలా సినిమాల్లాగే హీరో లైఫ్ లో ఎదిగేయడం లాంటి సీన్స్ ని హీరోయిన్ కి ఆపాదించి చూపించారు తప్ప ఎమోషన్ ని వర్కౌట్ చేయలేదు.
కోర్ట్ సీన్ లో భార్య ఎమోషన్ చాలా బాగా పండించొచ్చు కానీ సింపుల్ గా ఎలాంటి ఎమోషన్ లేకుండా తేల్చేసారు. ఒక మహిళ కష్టాలు చూపిస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ మొదట్లో చూపించినా చివర్లో కమర్షియల్ చేసి వదిలేసారు. కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలని తక్కువ చేసి చూడటం, పెళ్లి చేసి పంపించేసి బాధ్యత తీరింది అనుకోని పట్టించుకోకపోవడం లాంటి సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించారు. అన్ని రకాల ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అవడం కష్టమే. మూవీ యూనిట్ చెప్పినంత నవ్వించే ఎంటెర్టైమెంట్ అయితే సినిమాలో లేదు.
తరుణ్ భాస్కర్, ఈశారెబ్బ ఇద్దరూ పోటీ పడి నటించారు. వారి పాత్రల్లో చాలా బాగా నటించారు. సినిమా ఎలా ఉన్నా నటన పరంగా మాత్రం ఈషా, తరుణ్ మెప్పిస్తారు. బ్రహ్మాజీ హీరో మేనమామ పాత్రలో అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. బ్రహ్మానందం జడ్జి పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ అవసర్లేకపోయినా ఏదో సర్ ప్రైజ్ కోసం తెచ్చినట్టు ఉంది. అందరు నటీనటులు గోదావరి యాసని మాత్రం బాగా పట్టుకొని డబ్బింగ్ పర్ఫెక్ట్ గా చెప్పారు.
Also Read : Chiranjeevi : చిరంజీవికి కాజల్ తెలీదట.. కాజల్ ఎవరు అని అడిగారట.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఒరిజినల్ కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి ఓ మహిళా ప్రాధాన్యత సినిమాలో కమర్షియల్ హంగులు చేర్చి తెరకెక్కించారు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఎమోషన్, కామెడీ మిస్ అయిన మలయాళం సినిమా రీమేక్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.