×
Ad

Eesha Review : ‘ఈషా’ మూవీ రివ్యూ.. వామ్మో భయపడి చచ్చేలా ఉన్నారు..

ఈ సినిమాకు వీక్ హార్ట్ ఉన్నవాళ్లు రావొద్దు అంటూ భయపెడుతూ ప్రమోషన్స్ చేశారు. (Eesha Review)

Eesha Review

Eesha Review : త్రిగున్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంత్, బబ్లూ పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఈషా’. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుస హిట్స్ కొడుతున్న బన్నీవాస్‌, వంశీ నందిపాటి ‘ఈషా’ సినిమాను డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Eesha Review)

కథ విషయానికొస్తే..

కళ్యాణ్(త్రిగున్), నయన(హెబ్బా పటేల్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) నలుగురు చిన్నప్పటినుంచి స్నేహితులు. అపర్ణ, వినయ్ భార్యాభర్తలు కూడా. ఈ నలుగురు కలిసి డూప్లికేట్ భూత వైద్యుల్ని పట్టుకుని వాళ్ళ బండారాలు బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆది దేవ్ భూత వైద్యుడిగా మారడం వీళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను కూడా ఫేక్ అనుకోని అతని గురించి కూడా బయటపెట్టాలి అని ఫిక్స్ అవుతారు. అపర్ణ ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ సమయంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒరిస్సా బోర్డర్ లో ఉన్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) ఆశ్రమానికి వెళ్తారు.

ఈ దారిలో ఘాట్ రోడ్ లో వెళ్తుండగా అనుకోకుండా వీళ్ళు యాక్సిడెంట్ చేయడంతో పుణ్యవతి అనే ఒక ఒక మహిళ చనిపోతుంది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా పుణ్యవతి ఆత్మ ఒక శరీరంలోకి వచ్చి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నలుగురు ఆదిదేవ్ ఫేక్ అంటూ వాదనకు దిగుతారు. మూడు రోజుల్లో మీకు ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తాను, లేకపోతే అన్ని వదిలేసి మీరు ఏం చెప్తే అది చేస్తాను అని ఆది దేవ్ ఈ నలుగురితో ఛాలెంజ్ చేసి వీళ్ళను ఒక పాడుబడిన ఇంట్లో మూడు రోజులు ఉండమంటాడు. మరి ఆ పాడుబడిన ఇంట్లో ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీళ్ళకు ఆత్మలు కనపడ్డాయా? పుణ్యవతి ఆత్మ ఈ నలుగురిని ఏం చేసింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Shambhala Review : ‘శంబాల’ మూవీ రివ్యూ.. భయపెడుతూనే థ్రిల్లింగ్ గా సరికొత్త కథ..

సినిమా విశ్లేషణ..

నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి వరుసగా హిట్స్ కొడుతుండటంతో వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో ఈ సినిమాకు వీక్ హార్ట్ ఉన్నవాళ్లు రావొద్దు అంటూ భయపెడుతూ ప్రమోషన్స్ చేశారు. దీంతో ఇదేదో అదిరిపోయే హారర్ సినిమా అని ప్రచారం జరిగింది.

ఫస్ట్ హాఫ్ వీళ్ళు ఆది దేవ్ వద్దకు బయలుదేరే వరకు సింపుల్ గానే సాగిపోతుంది. మధ్యలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ ఫ్రెండ్షిప్ పాటతో సాగదీశారు. ఈ నలుగురు యాక్సిడెంట్ చేయడం, పుణ్యవతి ఆత్మ రావడం, వీళ్ళు ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం అంతా కాస్త భయం భయంగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఒక్కసారిగా భయపెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ ఇంట్లో ఏం జరిగింది అని సాగదీస్తూనే ఈ నలుగురు ఆది దేవ్ తో గొడవ పడుతూ బయట తిరుగుతూ కాస్త సాగదీసాడు అనిపిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి బాగానే భయపెట్టారు. చివర్లో ఉన్న ట్విస్ట్ బాగున్నా రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళు ఆ ట్విస్ట్ ని ముందే కనిపెట్టేస్తారు. చావులు, ఆత్మలు గురించి చెప్తూ హారర్ సినిమాగా ఈషాను తెరకెక్కించారు. సినిమా అంతా భయపెట్టకపోయినా కొన్ని సీన్స్ లో బాగానే భయపెట్టారు. కొన్ని సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూ భయపెట్టారు. సినిమా చివర్లో అయిపొయింది అనుకునేలోపు పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫామెన్స్..

చాలా సినిమాలు చేసినా, కష్టపడినా త్రిగుణ్ కి అనుకున్నంత గుర్తింపు రావట్లేదు. ఈ సినిమాలో త్రిగుణ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పర్వాలేదు అనిపించాడు. హెబ్బా పటేల్ ఆత్మలు లేవు అని బలంగా నమ్మే పాత్రలో బాగా నటించింది. చివరిలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది.

యూట్యూబ్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సిరి హనుమంతు ఇప్పుడిప్పుడే వరసగా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో ప్రెగ్నెంట్ పాత్రలో చాలా బాగా నటించింది సిరి. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ రాజ్ ఈ సినిమాలో బాగానే నటించాడు. ఆత్మలను కంట్రోల్ చేసే ఒక స్వామీజీగా బబ్లూ పృథ్వీరాజ్ మెప్పిస్తాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పరవాలేదు అనిపించారు.

Also Read : Dhandoraa Review : ‘దండోరా’ మూవీ రివ్యూ.. శివాజీ మళ్లీ అదరగొట్టాడుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాకు తగ్గట్టు బ్లాక్ అండ్ వైట్ కలర్ లైటింగ్ తో కొత్తగా చూపించారు సినిమాటోగ్రఫీ విజువల్స్. సినిమాకి లైటింగ్ కూడా భయపెట్టే విధంగా చాలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఏమీ లేని సీన్స్ లో కూడా ఏదో ఉందన్నట్టు భయపెట్టడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఉపయోగించారు. ఎడిటింగ్ కూడా భయపెట్టే విధంగా సీన్స్ బాగానే కట్ చేసుకున్నారు. దర్శకుడు ఆత్మలు ఉన్నాయా అనే పాయింట్ తీసుకొని భయపెట్టే ప్రయత్నం చేశాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు తక్కువ బడ్జెట్ లోనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు అని తెలుస్తుంది.

మొత్తంగా ‘ఈషా’ సినిమా మనల్ని భయపెట్టడానికి నలుగురు ఫ్రెండ్స్ తో జరిగిన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.