Shambhala Review : ‘శంబాల’ మూవీ రివ్యూ.. భయపెడుతూనే థ్రిల్లింగ్ గా సరికొత్త కథ..

ఆది ఎంత కష్టపడుతున్న హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.(Shambhala Review)

Shambhala Review : ‘శంబాల’ మూవీ రివ్యూ.. భయపెడుతూనే థ్రిల్లింగ్ గా సరికొత్త కథ..

Shambhala Review

Updated On : December 24, 2025 / 11:51 PM IST

Shambhala Review : ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాణంలో యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శంబాల’. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, ప్రియా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజవుతుండగా ముందురోజే ప్రీమియర్స్ వేశారు.(Shambhala Review)

కథ విషయానికొస్తే..

శివుడు, అంధకాసురుడు యుద్ధం గురించి చిన్న కథ చెప్పి అసలు కథ మొదలు పెడతారు. 1980లో శంబాలా అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఆ ఊళ్ళో ఒకరోజు అర్ధరాత్రి పూట ఆకాశం నుంచి ఉల్కా వచ్చి పడుతుంది. ఆ ఉల్కా పడిన తర్వాత ఊళ్లోకి ఒక భూతం వస్తుంది. ఆ భూతం రాములు(రవివర్మ)లో దూరుతుంది. రాములు ఆవు పాలకు బదులు రక్తం ఇవ్వడంతో ఊరంతా భయపడుతుంది. ఈ ఉల్కా వల్లే ఊళ్ళో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని భయపడితే ఊళ్ళో ఉన్న ఒక స్వామి ఆవుని చంపేయమంటారు. అదే సమయంలో ఆ ఉల్కా ఇక్కడ పడిందని తెలుసుకొని జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి విక్రమ్(ఆది) ఆ ఊరికి వస్తాడు.

ఆవుని చంపడాన్ని అడ్డుకోవడంతో రావడంతోనే ఊళ్ళో వాళ్ళతో గొడవపడి అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఉల్కా పడిన చోట కింద ఒక గుహ ఉండటం, అందులో ఒక అస్థిపంజరం ఉండటం గమనిస్తాడు. విక్రమ్ కి ఆ ఊళ్ళో కానిస్టేబుల్ హనుమంతు(మధునందన్) హెల్ప్ చేస్తాడు. అదే ఊళ్ళో దేవి(అర్చన అయ్యర్)తో పరిచయం అవుతుంది. రాములు లో దూరిన భూతం కొంతమందిని చంపేసి రాములుని కూడా చంపేసి కుంటి కృష్ణ(లక్ష్మణ్ మీసాల)లోకి దూరుతుంది. ఇలా ఒకరి శరీరం నుంచి ఒకరిలోకి ఆ భూతం దూరుతూ చంపుతూ ఉంటుంది. అసలు ఆ భూతం ఏంటి? ఎందుకు అందర్నీ చంపేస్తుంది? ఆ ఉల్కా కథేంటి? ఆ గుహలో ఉన్న అస్థిపంజరం ఎవరిది? దేవుడ్ని నమ్మని విక్రమ్ ఇదంతా ఛేదించాడా? దేవి ఎవరు? ఊళ్ళో ఏం జరుగుతుంది? శివుడు – అంధకాసురుడు కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Dhandoraa Review : ‘దండోరా’ మూవీ రివ్యూ.. శివాజీ మళ్లీ అదరగొట్టాడుగా..

సినిమా విశ్లేషణ..

ఆది ఎంత కష్టపడుతున్న హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. అయితే శంబాలా సినిమా ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండటం, టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొనడం, బిజినెస్ మొత్తం ముందే అయిపోవడం, ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ లో శివుడి కథ, ఉల్కా పడటం, విక్రమ్ ఆ ఊరికి రావడం, గుహ కనిపెట్టడం, ఊళ్ళో వాళ్ళతో గొడవలు, భూతం అందర్నీ చంపేయడంతో సాగుతుంది. స్టార్టింగ్ లో భూతంతో బాగా భయపెట్టారు. తర్వాత కాసేపు సాగదీసినా ప్రీ ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుంది అనే ఆసక్తితో సాగుతుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది.

ఇక సెకండ్ హాఫ్ లో ఆ భూతాన్ని ఎలా కనిపెట్టారు, ఆ భూతం కథేంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆసక్తిగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కథ పరిగెడుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా ఆరంభంలోనే ఊహించేయొచ్చు. ఈ సినిమాని మంచి స్క్రీన్ ప్లేతో చూపించే స్కోప్ ఉన్నా మాములు కథగానే చూపించారు. ఈ కథకు 1980 బ్యాక్ డ్రాప్ అవసరం లేకపోయినా తీసుకున్నారు. ఇక ఉల్కా కథేంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు, విక్రమ్ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంటర్వెల్ ముందు నుంచి భూతం గురించి ఓ రేంజ్ లో భారీగా భయపెట్టి చివర క్లైమాక్స్ లో సింపుల్ గా ముగించేశారు అనిపిస్తుంది.

1980 బ్యాక్ డ్రాప్ తీసుకున్నా కొన్ని సీన్స్ లో ఆ ఎఫెక్ట్ మిస్ అయింది. మన శరీరంలోని నాడులకు సంబంధించి ఓ కొత్త పాయింట్ ని ఇందులో చూపించారు. పార్ట్ 2 కి లీడ్ అవ్వడం గమనార్హం. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత ఆది ఒక మంచి సబ్జెక్టుతో వచ్చి ఆది మెప్పించాడు. జనాల్లోకి ఈ సినిమా వెళ్తే హిట్ అయినట్టే.

Aadi Sai Kumar Archana Iyer, Horror Thriller Shambhala Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఆది సైంటిస్ట్ పాత్రలో బాగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు. అర్చన అయ్యర్ కి మంచి పాత్ర పడింది. కానిస్టేబుల్ గా మధు నందన్ అదరగొట్టాడు. మీసాల లక్ష్మణ్ తన నటనతో ఇంటర్వెల్ ముందు నిదానంగా సాగుతున్న సినిమాని నిలబెట్టాడు. స్వసిక, రవి వర్మ, ఇంద్రనీల్, సైజు, శైలజ ప్రియా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. ఆటిజం సమస్య ఉన్న పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా మెప్పించింది.

Also Read : Sumathi Sathakam : బిగ్ బాస్ అమర్ దీప్ ‘సుమతీ శతకం’ టీజర్ వచ్చేసింది.. 99 పెళ్లిచూపులు చూసినా పెళ్లి కాలే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేసాడు శ్రీచరణ్ పాకాల. తన మ్యూజిక్ తోనే భయపెట్టాడు. ఎమోషనల్ సాంగ్స్ తో కూడా మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగున్నాయి. సినిమా అంతా రెండు లొకేషన్స్ లో పూర్తి చేసేసారు. ఓ కొత్త పాయింట్ ని తీసుకొని డైరెక్టర్ హారర్ థ్రిల్లర్ గా బాగానే రాసుకున్నారు. గ్రాఫిక్స్ తక్కువే వాడినా పర్ఫెక్ట్ గా చూపించారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘శంబాలా’ ఓ కొత్త పాయింట్ తో హారర్ థ్రిల్లర్ కు డివోషనల్ టచ్ ఇచ్చి చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.