Tollywood Actress who play goddess sita role
Tollywood Sita : సీతలేని రాముడిని ..రామాయణాన్ని ఊహించగలమా? భర్త మాటకు ఎదురుచెప్పని మహా ఇల్లాలు. ఎంతో సహనశీలి.. ధైర్యవంతురాలు.. ఆత్మాభిమానం గల స్త్రీమూర్తి. ఆమె జీవితం నేటి తరం మగువలకే కాదు భవిష్యత్ తరాల వారికి ఎంతో ఆదర్శం. ఇక రామయణ కథను ఆధారంగా చేసుకుని అనేక తెలుగు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో సీత పాత్రలో నటించి మెప్పించిన నటీమణులు కొందరు మాత్రమే. సీతాదేవి ఆహార్యాన్ని, హావభావాల్ని ఎంతో రమ్యంగా పలికించి, నటించి మెప్పించిన ఆ తెలుగుతెర నటీమణుల్ని ఈ శ్రీరామనవమికి గుర్తు చేసుకుందాం.
తెలుగువారు సీత అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు అంజలీదేవి (Anjali Devi). లవకుశ (lavakusa) సినిమాలో సీత పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చింది. ఈ పాత్రలో నటనకు గాను ఆమె రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే అంజలీదేవి పేరే గుర్తుకు వస్తుంది. పౌరాణిక పాత్రల్లో సీత తరువాత రుక్మిణి పాత్రలో కూడా ఆవిడ అలరించారు.
Sri Rama Navami : పానకం తాగితే ఎంతో మేలు! శ్రీరామనవమి నాడు ఎందుకు చేస్తారంటే?
సీత పాత్రలో ఆకట్టుకున్న మరో నటి చంద్రకళ (Chandra kala). చూడచక్కని రూపంతో, సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న చంద్రకళ ”సంపూర్ణరామాయణం” (sampoorna ramayanam) సినిమాలో సీత పాత్రలో నటించారు అనడం కంటే ఒదిగిపోయారు అని చెప్పాలి.
చూడగానే మన పక్కింటి అమ్మాయిలా అనిపించే రూపం పాతతరం నటి సంగీత (sangeetha) సొంతం. ఎన్నో సినిమాల్లో తన సహజమైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. అందుకేనేమో మహానటుడు ఎన్టీఆర్ సైతం ఆమెను పిలిచి మరీ ”శ్రీరామపట్టాభిషేకం” (sri rama pattabhishekam) సినిమాలో సీత పాత్ర ఇచ్చారు. ఎన్టీఆర్ (nandamuri taraka rama rao) తానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత సీతగా అలరించారు.
Tollywood Heros as Lord Rama : రాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు వీరే..
అందాలనటి జయప్రద (Jayaprada) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రల్లో ఆమె నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. బాపు (Director Bapu) సినిమా “సీతాకళ్యాణం” (Sita Kalyanam) లో సినిమాలో సీతగా జయప్రద మంచి మార్కులే కొట్టేసారు. అమాయకత్వం, అణకువతో కూడిన అభినయంతో ఆ పాత్రలో జయప్రద చక్కని నటన ప్రదర్శించారు.
టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు మొదలుకొని హీరోయిన్ గా కూడా ఆమె నటించారు. ప్రస్తుతం వెండితెరపై ఆమె కనిపించనప్పటికీ పేరు చెబితే చాలు అందరూ గుర్తు పడతారు. తనే నటి అర్చన (Archana). శ్రీరామదాసు (Sri Ramadasu) సినిమాలో సీతగా అర్చన అలరించారు. పాత్ర నిడివి చిన్నదే అయినా అర్చన ఆ పాత్రకు న్యాయం చేశారు.
బాపు సినిమాల్లో హీరోయన్ల పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఎంపిక చేసుకునే నటీమణులు ఆషామాషీ టాలెంట్ ఉంటే సరిపోదు. అందుకే ఒకసారి ఆయన సినిమాలో నటించిన హీరోయన్లకు బాపు బొమ్మగా ముద్రపడిపోతుంది. ఆయన డైరెక్ట్ చేసిన ”శ్రీరామరాజ్యం” (Sri Rama Rajyam) సినిమాలో సీతగా నయనతారను (Nayanatara) ఎంపిక చేయడం అప్పట్లో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఆ పాత్రకు ఆమె న్యాయం చేయలేదనే విమర్శలు వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా సీత పాత్రలో నటించి నయనతార ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్, నంది అవార్డునుకూడా అందుకున్నారు.
Sri Rama Navami : తెలుగు సినిమాలు.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..
లయ (Laya) ఆమె పెళ్లి చేసుకుని తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ సహజనటిగా మంచి పేరుంది. నటనకు ఆస్కారం ఉన్న అనేక పాత్రల్లో నటించి మెప్పించిన నటి లయ. ఆమె ”దేవుళ్లు” (Devullu) సినిమాలో “‘అందరి బంధువయా” అంటూ సాగే పాటలో సీతగా కనిపిస్తారు. శ్రీకాంత్ రాముడిగా సీతగా లయ కనిపించేది కొద్దిసేపైనా ఆ పాట ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది.
ఇక లేటెస్ట్ గా రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ ”ఆదిపురుష్” (Adi Purush) రామాయణ కథ ఆధారంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు ? అనేది పెద్ద చర్చ జరిగింది. ఫైనల్ గా ఆ పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) ఎంపిక కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ఈ పాత్రకు సరిపోదు అనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తాయి. ఏది ఏమైనా సీతగా కృతి సనన్ ను కూడా తెరపై చూడబోతున్నాం.
సీత పాత్రను పోషించడం.. అందరి మన్ననలు పొందడం అంటే మామూలు విషయం కాదు. సీత మృదుస్వభావి, మిత భాషి. ఆమె నడక..నడత అన్నీ సుకుమారమే. ఆమె రూపాన్ని చూడగానే ఎంతో పవిత్రమైన భావం కలుగుతుంది. అలాంటి గొప్ప స్త్రీమూర్తి పాత్రలో నటించి మెప్పించారంటే వీరందరినీ తక్కువ అంచనా వేయలేం. అందుకే ఇప్పటికీ తెలుగు సినిమా సీతలు అనగానే వీరి రూపాలే కళ్లముందు కదలాడుతుంటాయి. తెలుగు ప్రేక్షకుల మదిలో సదా వీరంతా నిలిచి ఉంటారు.