Sri Rama Navami : పానకం తాగితే ఎంతో మేలు! శ్రీరామనవమి నాడు ఎందుకు చేస్తారంటే?
శ్రీరామనవమినాడు (Sri Rama Navami) పండ్లు, పలహారాలతో పాటు రామచంద్రునికి పానకం నైవేద్యం పెడతారు. పానకం నైవేద్యం పెట్టడం వెనుక ఆధ్యాత్మిక అంశమే కాదు.. ఆరోగ్యకమైన విషయం కూడా దాగుంది. పానకం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Sri Rama Navami Panakam importance and Health benefits
Sri Rama Navami : చైత్ర శుద్ధ నవమినాడు దశరథ మహారాజు, కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించాడు. అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. ఆ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా ప్రజలంతా శ్రీరామనవమి (Sri Rama Navami) పండుగ జరుపుకుంటారు. భక్తులంతా ఇళ్లలో సైతం సీతారాముల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో కళ్యాణం చేస్తారు. శ్రీరామచంద్రుడు శ్రీమహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ భూమిపై చెడుని సంహరించేందుకు ఆయన రామావతారంలో జన్మించాడని భావిస్తారు. శ్రీరామనవమినాడు భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తారు. దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని (Telangana) భద్రాచలంలో (Bhadrachalam) శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
అయితే ఈరోజున శ్రీరామచంద్రునికి రంగు రంగుల పూవులతో పూజలు చేసి రకరకాల పళ్లు, ఫలహారాలతో నైవేద్యం పెట్టే భక్తులు ప్రత్యేకంగా పానకం, వడపప్పు కూడా నైవేద్యం పెడతారు. ప్రతి పండుగలో కూడా దేవుడికి నైవేద్యం పెట్టే పదార్ధాల వెనుక ఆధ్యాత్మికతతో పాటు మన పూర్వీకులు జోడించిన ఏదో ఒక ఆరోగ్యకరమైన అంశం కూడా ఉంటుంది. శ్రీరామనవమినాడు పానకం నైవేద్యం పెట్టడం వెనుక కూడా ఎంతో ఆరోగ్యకరమైన అంశం దాగుంది. అదేంటంటే..
శ్రీరామనవమి వేసవికాలం వస్తుంది. వేసవిలో ఎక్కువగా చమట పడుతుంది. దాంతో మన శరీరంలో ఉండే ఖనిజాలైన సోడియం (sodium), పొటాషియం (potassium), మెగ్నీషియం (magnesium), కాల్షియం (calcium) చమట ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. పానకంలో ఈ నాలుగు ఖనిజాలు ఉంటాయి. పానకం తీసుకోవడం ద్వారా కోల్పోయిన ఖనిజాలను తిరిగి పొందవచ్చన్నమాట. ఇక బెల్లంలో ఇనుము ఉంటుంది. ఇది ఎండ వేడిమిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. బెల్లంలో ఉండే ఖనిజాలు అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం ఇస్తాయి.
Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసా?
ఇంకా పానకం వల్ల అనేక లాభాలున్నాయి. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు, బాడీపై ర్యాషెస్, నిద్ర పట్టకపోవడం, అజీర్తి ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి పానకం ఔషధంలా పనిచేస్తుందట. నిజానికి బెల్లం వాడకం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. అన్ని కాలాలలో కంటే వేసవికాలంలో బెల్లం (Jaggery), తినాలని అంటారు. నీటిలో బెల్లాన్ని కలుపుకుని తాగినా మంచిదే అని చెబుతారు. చాలాచోట్ల ఈ సీజన్ లో జరిగే పెళ్లిళ్లలో కూడా బెల్లం పానకం ఇస్తుంటారు. అంటే వేసవి తాపాన్ని తగ్గించి ఉపశమనం కలిగిస్తుందనేది దీని వెనక ఉద్దేశ్యం. ఈ బెల్లం పానకంలో మిరియాలు (Black pepper), యాలకులు కూడా వేస్తుంటారు. సాధారణ జలుబు, దగ్గుకి సైతం మనం మిరియాలు వాడుతుంటాం. అయితే పానకంలో కూడా మిరియాలు వాడటం వల్ల శరీరంలో ఉండే చెడు అంతా బయటకు పోతుంది. వేసవికాలంలో చాలామందిని పొడి దగ్గు వేధిస్తూ ఉంటుంది. దీనికి మిరియాలు మంచి మందులా పనిచేస్తాయి.
ఇక శ్రీరామనవమి నాడు పానకంతో పాటు వడపప్పు (moong Dal) కూడా నైవేద్యం పెడతారు. పెసరపప్పులో కూడా చలువ చేసే గుణం పుష్కలంగా ఉంటుంది. చాలా త్వరగా జీర్ణమయ్యేవాటిలో పెసరపప్పు ఒకటి. బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు సైతం పెసరపప్పుని ఎక్కువగా వినియోగిస్తున్నారు. సూప్ లాగ తయారు చేసుకుని తాగుతారు. మొత్తానికి శ్రీరామనవమి నాడు పానకం, వడపప్పు నైవేద్యం పెట్టడం వెనుక భక్తితో పాటు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.