టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కే. మహేంద్ర కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నిర్మాత, ఏ.ఏ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (75) కన్నుమూశారు.

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కే. మహేంద్ర కన్నుమూత

Mahendra passed away

Updated On : June 12, 2025 / 9:12 AM IST

AA Arts Producer Mahendra: టాలీవుడ్ సీనియర్ నిర్మాత, ఏ.ఏ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి 12గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మహేంద్ర పార్ధివ దేహానికి ఇవాళ గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సినీ పెద్దలు, అభిమానులు సంతాపం వ్యక్తంచేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

కావూరి మహేంద్ర 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలుకు దోసపాడులో జన్మించారు. దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది నిర్మాతగా మారారు. కె. ప్రత్యగాత్మ, కె. హేమాంబరధరరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ప్రొడక్షన్ కంట్రోలర్ గానూ పలు చిత్రాలకు పనిచేసిన మహేంద్ర.. 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తరువాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురలేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్యం’ తదితర చిత్రాలు కె. మహేంద్ర నిర్మించారు.

శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ చిత్రం నిర్మించారు. శ్రీహరితోనే ‘దేవా’ సినిమాను కె. మహేంద్ర నిర్మించారు. మహేంద్రకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమార్తెను మాదాల రవి వివాహం చేసుకున్నారు. కొద్దికాలం క్రితమే మహేంద్ర తనయుడు జీతు మరణించాడు. అయితే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర.. గుంటూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ గుంటూరులో జరగనున్నాయి.