Tollywood Unions Announce Donations to CM Relief Fund for Flood Effected People
Tollywood : ఇటీవల భారీ వర్షాలు వచ్చి ఏర్పడిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ముందుకొచ్చి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని పలు యూనియన్లు కూడా తాజాగా విరాళాలు ప్రకటించారు.
ఈ వరద విపత్తుల కోసం ఫిలిం ఛాంబర్ తరపున తాజాగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో రాఘవేంద్రరావు, దిల్ రాజు, సురేష్ బాబు, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read : Aha OTT : ‘ఆహా’లో ఒకేసారి రెండు సినిమాలు స్ట్రీమింగ్..
ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. విజయవాడ, ఖమ్మంలో వరదల వల్ల చాలా మంది బాధపడ్డారు. ఇలాంటి విపత్తులు వచ్చిన ప్రతిసారి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈసారి ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం అని తెలిపారు.
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఏ ఆపద వచ్చినా సినీ పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మా కుటంబం నుంచి కోటి రూపాయలు అందిస్తున్నాం అని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రజల ఆదరణే. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అని తెలిపారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షలు ఇస్తున్నాము. ఫిలిం ఛాంబర్ నుంచి కూడా సహాయం అందిస్తున్నాం. ఇండస్ట్రీలో అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ ద్వారా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం అని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి సినీ కార్మికుల ఒక రోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.