2020లో టాప్ 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒక్కటి మాత్రమే!

2020లో టాప్ 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒక్కటి మాత్రమే!

Updated On : December 17, 2020 / 11:30 AM IST

హమ్మయ్యా.. ఎట్టకేలకు 2020 ఏడాది చివరకు వచ్చేశాం.. ఏ ఏడాది కూడా ప్రజలు ఈ ఏడాదిలా భయం గుప్పెట్లో లేరు.. ఇంకో వందేళ్లయినా.. ఇంకెన్నేళ్లయినా.. ఈ ఏడాదిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.. కలలో కూడా మళ్లీ ఇటువంటి ఒక సంవత్సరం రాకూడదు అని భావించేవాళ్లు మాత్రం సినిమా వాళ్లే.. ఏడాది ఆరంభం నుంచే సినిమా వాళ్లకు ఇదొక పీడకలగా తయారైంది.

చైనా నుంచి వచ్చి ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా కారణంగా.. ప్ర‌తీ వ్య‌వ‌స్థ‌ కూడా ఇబ్బంది పడినా.. సినిమా ఇండస్ట్రీకి ఆ ఇబ్బందులు కాస్త ముందుగానే ప్రారంభం అయ్యాయి. సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు జరగలేదు. రిలీజుల్లేవ్.. థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా తెరుచుకుంటూ ఉండగా.. ఇప్పటికిప్పుడు అయితే విడుదలయ్యేందుకు పెద్ద సినిమాలు ఏవీ రెడీగా లేవు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా వంటి ఓటీటీల్లో ఇప్పటికే ఓ రకమైన సినిమాలు కూడా విడుదలైపోయాయి.

అసలు 2020లో థియేటర్‌లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది అనే సినిమా ఒక్కటి కూడా లేదు.. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా ఓటీటీల్లో రిలీజ్ అయ్యి.. థియేట‌ర్లు లేని రోజుల్లో, ఇల్లే థీయేటర్‌లా మారి సందడి చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఇక నెట్టింట్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, బోలెడు వ్యూస్ తెచ్చుకున్న సినిమాలు లిస్ట్ చూస్తే.. టాప్ టెన్‌లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా మాత్రమే చోటు దక్కించుకుంది.

ఈ ఏడాది హిట్ సుశాంత్‌దే:
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చించుకున్న పేరు.. చిన్న వయస్సులోనే పెద్ద నిర్ణయం తీసుకుని ఈ లోకాన్ని విడిచిపోయిన రీల్ ధోని సుశాంత్ సింగ్ రాజ్‌పూత్.. హీరోగా నటించిన చివరి సినిమా ‘దిల్‌ బెచరా’. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్‌కు నోచుకోలేదు.. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో సినిమా విడుదల కాగా.. భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2020లో ఎక్కువ మంది చూసిన సినిమాల లిస్టులో తొలి స్థానం ఈ సినిమాదే..

రియల్ లైఫ్‌ స్టోరీతో.. మిరాకిల్ హిట్.. ఆకాశమే నీ హద్దురా:
రియల్ లైఫ్ కథలను తెర మీద ఆశీర్వదించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు.. అలా రియల్ లైఫ్ కథతో.. ఎయిర్ డెక్కెన్ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సూరారై పొట్రు’ తెలుగులో ఇదే సినిమా ఆకాశమే నీ హద్దురా పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. టాప్ 10 లిస్ట్‌లో సెకెండ్ ప్లేస్ దక్కించుకుంది.

మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో:
ఇక టాప్-5లో తర్వాతి మూడు స్థానాల్లో అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూడో’ (నెట్‌ఫ్లిక్స్‌) మూడో స్థానంలో నిలవగా.. అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ (కాంచన రీమేక్) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలై నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత జాన్వీ కపూర్ ‘గుంజాన్ సక్సెనా.. ద కార్గిల్ గర్ల్’ (నెట్‌ఫ్లిక్స్‌) ఐదో స్థానంలో నిలిచింది.

ఆరు, ఏడు స్థానాల్లో బాలీవుడ్ సినిమాలే:
తర్వాత ఆరవ స్థానంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన విద్యుత్ జమాల్, శివలేక ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఖుదా హఫీజ్’ నిలిచింది. ఏడవ స్థానంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గులాబో సితాబో’ సినిమా ఉంది.

తమిళం నుంచి రెండు సినిమాలు:
బాలాజీ, శరవనణ్ సంయుక్తంగా రూపొందించగా.. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుట్టి అమ్మన్’ ఎనిమిదో స్థానంలో నిలవగా.. జ్యోతిక ప్రధాన పాత్రలో జేజే ఫ్రెడ్రిక్ తెరకెక్కించిన ‘పొన్ మంగల్ వందాల్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై పదవ స్థానంలో నిలిచింది.

తెలుగు నుంచి ఒకే ఒక్క సినిమా:
మిగిలిన ఇండస్ట్రీల కంటే తెలుగు ఇండస్ట్రీ ఈ ఏడాది ఒక రూపాయి ఎక్కువగానే నష్టపోయింది అని చెప్పుకోవచ్చు. కనీసం ఓటీటీల్లో కూడా ఈ ఏడాది తెలుగు సినిమాల ప్రభావం లేకుండా పోయింది. విడుదలైన సినిమాలు కొన్నే అయినా.. అందులో కూడా ఎక్కువ మంది చూసిన సినిమాల్లేవు.. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘V’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా.. ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మాత్రమే ఉత్తమ చిత్రాల లిస్ట్‌లో తెలుగు నుంచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

కరోనా కారణంగా పెద్ద పెద్ద స్టార్లు ఓటీటీ వైపు అడుగులు వేయ‌డంతో వాటి కోసమే సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు కూడా సిద్ధం అవుతున్నారు. థియేట‌ర్లు తెర‌చుకొని, వంద శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా.. ఓటీటీలో సినిమాలు చూడ‌డం మేలు అని ప్రేక్ష‌కులు భావిస్తారనే భయం కూడా నిర్మాతల్లో ఉంది. ఈ క్రమంలో అనేక థియేటర్లు గోడౌన్లుగా మారగా.. మల్టిప్లెక్స్ థియేటర్లు మాత్రమే మార్కెట్లో ప్రభావం చూపించే పరిస్థితి రావచ్చు అంటున్నారు. చూడాలి మరి.. పరిస్థితులు ఎలా మారుతాయో..