Upendra UI Movie Review and Rating Here
Upendra UI Movie Review : దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను అందించిన ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత మళ్ళీ నటుడిగా, దర్శకుడిగా యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉపేంద్ర మెయిన్ లీడ్ లో తన సొంత దర్శకత్వంలోనే ఈ యూఐ సినిమా తెరకెక్కింది. రేష్మ నానయ్య, మురళి శర్మ, రవి శంకర్.. ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీకాంత్, మనోహరన్ నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కించారు. యూఐ సినిమా నేడు డిసెంబర్ 20న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. సాధారణంగా ఉపేంద్ర డైరెక్ట్ చేసే సినిమాల్లో కథని ఆశించకూడదు. ఈ సినిమాలో కూడా అంతే కథంటూ ఏమి ఉండదు. రియల్ గా ఉపేంద్ర ఓ సినిమా తీసినట్టు ఆ సినిమా చూసి కొంతమంది సమాజాన్ని పట్టించుకోకుండా రియాలిటీగా బతుకుదామని, కొంతమంది సినిమాని బ్యాన్ చేయాలని గొడవలు చేస్తూ ఉంటారు. ఓ సీనియర్ రివ్యూ రైటర్ నాలుగు సార్లు సినిమాని చూసినా రివ్యూ రాయలేకపోతాడు. దీంతో ఉపేంద్రని వెతుక్కుంటూ వెళ్తే ఉపేంద్ర రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ ని మనకు సినిమాగా చూపించారు.
సత్య(ఉపేంద్ర) అనే వ్యక్తి మంచితనంతో అందర్నీ మార్చాలని జాతి మత కుల బేధాలు లేని సమాజం నిర్మించాలని అనుకుంటాడు. మరో వైపు కల్కి(ఉపేంద్ర) తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఓ ఘటనలో సత్యని బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి కల్కి సమాజాన్ని ఎలా మార్చాడు? సత్య తప్పించుకొని బయటకు వచ్చాడా? అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఉపేంద్ర రియల్ గా తీసిన సినిమా ఏంటి? మురళి శర్మ రివ్యూ రాశాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Bachhala Malli : ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ ఏడిపించేశాడుగా..
సినిమా విశ్లేషణ.. ఒకప్పుడు దర్శకుడిగా A, shh, సూపర్, ఉపేంద్ర, ఉప్పి 2, రక్తకన్నీరు లాంటి సినిమాలు తీసి అప్పట్లో ఆడియన్స్ కి పిచ్చెక్కించేసాడు ఉపేంద్ర. దీంతో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే నటుడిగా సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా ఆల్మోస్ట్ 9 ఏళ్ళ తర్వాత ఈ యూఐ సినిమాతో వచ్చాడు. ఉపేంద్ర సినిమాల్లో చాలా వరకు సమాజంలో జరిగే రియాలిటీ సంఘటనలను చూపిస్తూ సొసైటీ మీద సెటైర్స్ వేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అంతే. సోషల్ మీడియాలోనే సమయం గడిపే ఇప్పటి జనరేషన్ Z నుంచి మొదలుపెట్టి ఆడియన్స్ ని, జనాల్ని, రాజకీయ నాయకులను, మతం, జాతులను, దేశ, అంతర్జాతీయ సమస్యలను ట్రోల్ చేసేసాడు. ఏ ఒక్కటి వదలకుండా అన్నిటికి కౌంటర్లు వేసాడు. సమాజంలో జరిగే రియాలిటీ చూపించాడు. సినిమా మొదలయ్యే ముందే తెలివైన వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోండి, మూర్ఖులు సినిమా చూడండి అంటూ సినిమాల్లో లాజిక్స్ వెతికేవాళ్లకు కౌంటర్ వేసాడు. అయితే ఒక కథ పరంగా ఉండకపోవడం, స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కి వెళ్లడంతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఉపేంద్ర సినిమాలు డిఫరెంట్ అని అందరూ చెప్పుకున్నట్టే సినిమాలోని మొదటి పది నిమిషాలకే ఇదేం క్రియేటివిటిరా బాబు అనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ నుంచి టైటిల్ వరకు అంతా చాలా కొత్తగా చూపించాడు ఉపేంద్ర. సినిమా ఇప్పటి ఆడియన్స్ కి ఎక్కకపోవచ్చు ఏమో కానీ ఉపేంద్ర ఫ్యాన్స్ కి, ఉపేంద్ర సినిమాలు నచ్చేవాళ్లకు, సెటైరికల్ సినిమాలు నచ్చేవాళ్లకు మాత్రం కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఇన్నాళ్లు ఉపేంద్ర ని డిఫరెంట్ గా చూసిన వాళ్లంతా అయితే ఈ సినిమా చూసి ఉప్పి ఈజ్ బ్యాక్ అంటారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సెటైరికల్ సినిమాల్లో అయితే అదరగొట్టేస్తాడు. యూఐ సినిమాలో కూడా రెండు పాత్రలతో పాటు రియల్ ఉపేంద్రగా కూడా తన నటనతో మెప్పించి అదరగొట్టాడు. రేష్మ నానయ్య సీక్రెట్ గా సత్యని లవ్ చేసే పాత్రలో మెప్పిస్తుంది. రవి శంకర్ కూడా ఓ నాయకుడి పాత్రలో మెప్పించాడు. మురళి శర్మ కాసేపు కనిపిస్తారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కొత్తగా చూపించడమే కాక కొత్త సినిమాటిక్ షాట్స్ కూడా బాగానే వాడారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ కి కొత్తగా ఇచ్చినా కొన్ని చోట్ల చాలా హెవీగా అనిపిస్తుంది. పాటలన్ని ట్రోల్ సాంగ్స్ లాగే వినడానికి బాగున్నాయి. ఉపేంద్రతో పాటు అందరి కాస్ట్యూమ్స్ కొత్తగా చూపించారు. లొకేషన్స్ కూడా కథకు తగ్గట్టు సెట్స్ పర్ఫెక్ట్ గా వేశారు. ఇలాంటి సెటైరికల్ స్క్రిప్ట్స్ రాయడంలో ఉపేంద్ర ఆరితేరినవాడు కాబట్టి యూఐ స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు కష్టపడి కొత్తగా రాసుకున్నాడు. డైరెక్షన్ పరంగా కూడా ఉపేంద్ర మరోసారి తన స్టైల్ తో మెప్పించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘యూఐ’ సినిమా సమాజంపై, సమాజంలో జరిగే సంఘటనలపై ఉపేంద్ర తన స్టైల్ లో తీసిన సెటైరికల్ మూవీ. మాములు ఆడియన్స్ కి కొంచెం కష్టంగా ఉన్నా ఉప్పి సర్ ఫ్యాన్స్ కి, కొత్త రకం సినిమాలు నచ్చే వాళ్లకు మాత్రం యూఐ నచ్చేస్తుంది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.