Bachhala Malli : ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ ఏడిపించేశాడుగా..
బచ్చల మల్లి సినిమాలో కథ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఈ సినిమా అంతా మల్లి అనే క్యారెక్టర్ మీదే నడుస్తుంది.

Allari Naresh Amritha Aiyer Bachhala Malli Movie Review and Rating Here
Bachhala Malli Movie Review : అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రోహిణి, రావు రమేష్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, ఇనయా సుల్తానా, జై రామ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. బచ్చల మల్లి సినిమా నేడు డిసెంబర్ 20న థియేటర్స్ లో రిలీజయింది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా వేశారు.
కథ విషయానికొస్తే.. బచ్చల మల్లి(అల్లరి నరేష్)కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. మల్లి టెన్త్ అయిపోయి కాలేజీ చదివే సమయంలో వాళ్ళ నాన్న(జై రామ్) వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం బయటపడటంతో అనుకోని పరిస్థితుల్లో అతని భార్యని(రోహిణి), మల్లిని వదిలేసి రెండో భార్య కోసం వెళ్ళిపోతాడు. దీంతో మల్లి తన నాన్న మీద పగ పెంచుకొని మూర్ఖంగా పెరుగుతాడు. తినడం, తాగడం, తిరగడం, కుదిరితే పని చేయడం ఇంతే మల్లి పని. ఎవరైనా నాన్న విషయం ఎత్తితే ఆ మూర్ఖత్వం ఇంకా పెరిగిపోతుంది.
ఇలాంటి మల్లి జీవితంలోకి కావేరి(అమృత అయ్యర్) రావడంతో అన్ని మానేసి మంచిగా మారిపోయి గోనెసంచుల వ్యాపారం నడిపిస్తాడు. అలాగే కావేరిని పెళ్లిచేసుకోవాలి అని అనుకుంటాడు. మంచిగా మారిపోయిన మల్లి మళ్ళీ ఎందుకు మూర్ఖంగా మారాడు? తాగి పడిపోయి ఉన్న మల్లిని పొడిచి చంపడానికి ప్రయత్నించింది ఎవరు? మల్లి కావేరి ప్రేమకథ ఏమైంది? తండ్రి తప్పుని క్షమించాడా? మల్లి మాములు మనిషిగా మారాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Pushpa 2 collections : బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ రూల్.. 14 రోజుల్లో 1508 కోట్లు..
సినిమా విశ్లేషణ.. బచ్చల మల్లి సినిమాలో కథ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఈ సినిమా అంతా మల్లి అనే క్యారెక్టర్ మీదే నడుస్తుంది. 1985 నుంచి 2005 మధ్య అతని కథపై నడుస్తుంది. టీనేజ్ లో వాళ్ళ నాన్న చేసిన పనికి అతను మూర్ఖంగా మారడంతో అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే కథాంశంతో నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా మల్లి తండ్రి ఎపిసోడ్, మల్లి మూర్ఖంగా ఎదగడం, కావేరి పరిచయం, మల్లి – అతని నాన్న సన్నివేశాలతో కాస్త బోరింగ్ గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కావేరితో ప్రేమతో పాటు కొన్ని ఎమోషనల్ అంశాలతో చక్కగా నడిపించారు.
సినిమాలో తండ్రి మీద పగ అనే ఎమోషన్ తోనే చివరి వరకు కథ నడిపించినా దాని ఎస్టాబ్లిషమెంట్ ఇంకొంచెం బలంగా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు ఏదో మిస్ అయినట్టు చాలా సాదాగా సింపుల్ గా నడుస్తుంది. మల్లి – కావేరి ప్రేమ కథ మాత్రం బాగా రాసుకున్నారు. ఇక చివరి అరగంట అయితే ఫుల్ ఎమోషనల్ గా రాసుకొని ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తారు. ఇంటర్వెల్ కి ట్విస్ట్ ఇచ్చాము అని అనుకున్నా అది అందరూ ఊహించేస్తారు. చనిపోయిన తర్వాత చివరి చూపు అనే అంశం మాత్రం రెండు చావులకు లింక్ చేస్తూ సీన్స్ బాగా తెరకెక్కించారు. ఇటీవల మందు తాగడం, సిగరెట్ అనేవి ఎలివేషన్స్ కింద చాలా సినిమాల్లో వాడేస్తున్నారు. ఈ నెగిటివిటీని హీరోయిజం చేస్తున్నారు. ఈ సినిమాలో మూర్ఖత్వం అనే పాయింట్ కి అవి అవసర్లేకపోయినా నరేష్ మంచిగా మారే సీన్స్ లో తప్ప సినిమా అంతా నరేష్ పాత్ర వాటితోనే నడిపించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లరి నరేష్ ఈ పాత్రలో ప్రాణం పెట్టి చేసాడు అని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం గడ్డం, జుట్టు బాగా పెంచేసి డీ గ్లామరైజ్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు. చివరి అరగంట అయితే అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తాడు. అమృత అయ్యర్ క్యూట్ గా కనిపిస్తూనే మంచి ఎమోషన్ పండించింది.
చాలా రోజుల తర్వాత హరితేజకు ఒక మంచి పాత్ర పడింది. చిన్నాన్న మల్లి అంటే ఇష్టం ఉండే పాత్రలో తన నటనతో అదరగొట్టేసింది. నరేష్ తల్లి పాత్రలో రోహిణి, నాన్న పాత్రలో జై రామ్ బాగా మెప్పించారు. కీలక పాత్రలో అంకిత్ కొయ్య బాగా నటించాడు. రావు రమేష్ పోలీస్ పాత్రతో పాటు, హీరోయిన్ తండ్రి పాత్రలో మెప్పిస్తారు. వైవా హర్ష, ప్రవీణ్ అక్కడక్కడా నవ్వించారు. ప్రసాద్ బెహరా, అచ్యుత్ కుమార్, ఇనయా సుల్తానా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో చక్కగా నటించారు.
సాంకేతిక అంశాలు.. పీరియాడిక్ సినిమా కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ అప్పటికి తగ్గట్టు చక్కగా చూపించారు. లొకేషన్స్ చాలా వరకు రియల్ లొకేషన్స్ వాడారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా మైనస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో తప్ప మిగతా అన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెవీగా అనిపిస్తుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథ పరంగా సింపుల్ పాయింట్ అయినా ఒక మూర్ఖత్వం ఉన్న క్యారెక్టర్ మీద కథాంశాన్ని బాగా రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాతలు ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘బచ్చల మల్లి’ సినిమా తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో మూర్ఖంగా మారిన ఓ వ్యక్తి, అతని జీవితంలో ఎదుర్కున్న సంఘటనల కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.