Sri Chidambaram Garu Review : ‘శ్రీ చిదంబరం గారు’ మూవీ రివ్యూ.. మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా..
ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వచ్చినప్పుడే ఇదేదో మంచి సినిమా, మలయాళం సినిమా ఫీల్ ఇస్తుంది అని అంతా భావించారు. (Sri Chidambaram Garu Review)
Sri Chidambaram Garu Review
Sri Chidambaram Garu Review : వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా తెరకెక్కిన సినిమా శ్రీ చిదంబరం గారు. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మాణంలో వినయ్ రత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చిదంబరం గారు సినిమా నేడు ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Sri Chidambaram Garu Review)
కథ విషయానికొస్తే..
రాజమండ్రి దగ్గర్లోని ఓ పల్లెటూరిలో ఉండే సోల్మన్ (వంశీ తుమ్మల)కి మెల్ల కన్ను. చిన్నప్పట్నుంచి అందరూ ఆ మెల్లకన్నుని హేళన చేస్తూ చిదంబరం అని పిలుస్తూ ఉంటారు. దాంతో అతను స్కూల్ కూడా మానేస్తాడు. తన తండ్రి చనిపోవడంతో మేస్త్రీ పనికి వెళ్తాడు. తన మెల్ల కన్నుని, భయాన్ని కవర్ చేసుకోడానికి నల్ల కళ్ళజోడు పెట్టుకొని మేనేజ్ చేస్తుంటాడు. తన మెల్లకన్నుతో అభద్రతాభావం, ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటాడు చిదంబరం.
అదే ఊళ్ళో ఉండే లీల (సంధ్య వశిష్ట)ని ఇష్టపడతాడు చిదంబరం. తన ఇంట్లో పనికి వెళ్ళినప్పుడు ఇద్దరూ క్లోజ్ అవుతారు. లీల చిదంబరంను ఇష్టపడుతున్నట్టు తెలిసినా తను మాత్రం మెల్లకన్ను వల్ల లీలకు తన ఇష్టాన్ని చెప్పడు. ఓ సంఘటనతో ధైర్యం చేసి లీలకు తన ప్రేమ విషయం చెప్తాడు. కానీ లీల అతనిలో ఉన్న భయాన్ని ప్రశ్నించడంతో చిదంబరం దాన్ని నెగిటివ్ గా అర్ధం చేసుకొని అక్కడ జరిగిన సంఘటనతో బాధపడుతూ లీలకు దూరం అవుతాడు. మరి లీల – చిదంబరం ఒక్కటయ్యారా? చిదంబరం తన సమస్య నుంచి బయటకి వచ్చాడా? తన మెల్లకన్ను సెట్ అయిందా? ఆ సంఘటన తర్వాత చిదంబరం జీవితం ఎలా మారింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వచ్చినప్పుడే ఇదేదో మంచి సినిమా, మలయాళం సినిమా ఫీల్ ఇస్తుంది అని అంతా భావించారు. దానికి తగ్గట్టే సినిమా కూడా ఉంది. మెల్లకన్నుతో బాల్యంలో సోలమన్ పడే బాధలతో కథ మొదలుపెట్టి అతను ఆ శారీరిక సమస్యని ఎలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, తనలో తానే ఎలా కుమిలిపోతాడు, అతని చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని ఎలా హేళన చేస్తారు అని నడుస్తుంది.
హీరోయిన్ తో పరిచయం వారిద్దరి మధ్య సన్నివేశాలు క్యూట్ గా ప్రేమకథలా గోదావరి బ్యాక్ డ్రాప్ లో బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ తో ఒక ఎమోషన్ వర్కౌట్ అయి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం సోలమన్ తన లోపాన్ని ఎలా మార్చుకోవాలి అనే కథాంశంతోనే నడుస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీశారు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోగా సెకండ్ హాఫ్ మాత్రం అటుఇటుగా సాగుతుంది.
గోదావరి బ్యాక్ డ్రాప్ లో కథని బాగా నడిపించారు. మతం పేరిట జరిగే మోసాలను ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలతో ఎలా బాధపడతాడు తనని తాను తక్కువగా చూసుకోవడం అనే అంశాలు హీరో పాత్ర ద్వారా బలంగానే చెప్పారు. హీరో తాపీ వర్క్ సీన్స్ మరీ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ తో ఇంకొన్ని మంచి సన్నివేశాలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చాలా మంది ఇది మలయాళం సినిమాలా ఉంది అని అంటున్నారు, అనిపిస్తుంది కానీ అచ్చ తెలుగు సినిమానే ఇంత అందంగా తీశారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
మెల్లకన్ను పాత్రలో వంశీ తుమ్మల అదరగొట్టాడు అనిచెప్పొచ్చు. సినిమా అంతా అలా మెయింటైన్ చేస్తూ పర్ఫార్మెన్స్ తో మెప్పించిన విషయంలో వంశీని అభినందించొచ్చు. హీరోయిన్ గా సంధ్య వశిష్ఠ గోదావరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. శివకుమార్, గోపి అక్కడక్కడా నవ్విస్తారు. కల్పలత, తులసి తల్లి పాత్రల్లో చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Laggam Time Review : ‘లగ్గం టైం’ మూవీ రివ్యూ.. పెళ్లి కొడుకు కిడ్నాప్ అయితే..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. గోదావరి సమీపంలోని గ్రామంలో షూటింగ్ చేసి అద్భుతమైన విజువల్స్ ని చూపించారు. ప్రకృతితో ఉన్న ఆ విజువల్స్ మనసుకు హాయినిస్తాయి. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. సమాజంలో ఆల్మోస్ట్ అందరికి ఏదో ఒక విషయంలో ఉండే ఆత్మన్యూనతని పోగొట్టుకోవాలని మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
మొత్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ ప్రతి మనిషికి తమలో ఉన్న భయాన్ని అభద్రతాభావాన్ని పోగొట్టాలి అని మంచి మెసేజ్ ఇచ్చిన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
