రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్యలు రీల్ లైఫ్‌లో అవే పాత్రలలో నటిస్తున్న సినిమా ‘వెంకి మామ’. ఆర్మీ మేజర్‌గా నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ రైస్ మిల్స్ ఓనర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. రవితేజతో ‘పవర్’, పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ సినిమాలు తీసిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ నెలాఖరుకు వస్తుందని అందరూ భావించారు.
అయితే ఈ సినిమా ఇప్పుడు ప్రీ-పోన్ అయింది. సినిమాను డిసెంబర్ రెండవ వారంలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు నిర్మాతలు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తుండగా.. సినిమాని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా సినిమాను ధియేటర్లలోకి తీసుకుని వస్తున్నారు.
రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోలు ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. అయితే విడుదలకు కేవలం 10 రోజులే సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.