నటుడు వేణుమాధవ్ కు తీవ్ర అనారోగ్యం

నటుడు వేణుమాధవ్ కు తీవ్ర అనారోగ్యం

Updated On : September 24, 2019 / 1:30 PM IST

సినీ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్ 24వ తేదీన ఆయన సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. కాలేయం, కిడ్నీ సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు.

ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలపై స్వయంగా స్పందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. సమస్యల కారణంగానే చాలారోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మేర ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాలేయ సంబంధింత వ్యాధికి చికిత్స తీసుకుంటున్న వేణుమాధవ్‌కు ఇప్పుడు కిడ్నీల సమస్య పెరిగి పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. వేణుమాధవ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవిత రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ హుటాహుటినా ఆస్పత్రికి చేరుకొని వేణుమాధవ్ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.