మూడు రోజుల వ్యవధిలో రెండు మరణాలు.. శోకసంద్రంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 01:28 PM IST
మూడు రోజుల వ్యవధిలో రెండు మరణాలు.. శోకసంద్రంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం..

Updated On : April 29, 2020 / 1:28 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఇర్ఫాన్‌కు ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి. తెలుగులో ఆయన గుణశేఖర్ దర్శకత్వంలో ‘సైనికుడు’ చిత్రంలో నటించారు.

ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం జైపూర్‌లో చనిపోయారు. లాక్‌డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన ఇర్ఫాన్ వీడియో కాల్ ద్వారా ఆమెకు నివాళులర్పించారు. ఏప్రిల్ 25న తల్లి, 29న కుమారుడు చనిపోవడంతో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇర్ఫాన్ మృతికి పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.