Kushi Movie : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ(Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ మెప్పిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. అయితే విజయ్, సమంత అభిమానుల్లో తప్ప బయట మాత్రం అంత హైప్ కనిపించట్లేదు ఖుషి సినిమాకు. ఇక ట్రైలర్ రిలీజయ్యాక చాలా సినిమాల్లో చూపించిన ప్రేమ, పెళ్లి స్టోరీలా అనిపిస్తుందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఖుషి సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఖుషి సినిమా కథ ఆల్మోస్ట్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా సఖి కథే అని అంటున్నారు.
సఖి(Sakhi) సినిమాలో కూడా ఇద్దరూ ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటకి వచ్చి బతుకుతూ ఉంటే కాపురంలో విబేధాలు గొడవలు వస్తే వాటిని తట్టుకొని చివరకు మళ్ళీ ఎలా కలిశారు అనేదే కథ. ఖుషి సినిమా ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఇద్దరూ ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకొని విడిగా బతుకుతుంటే కాపురంలో కలహాలు వస్తే చివరకు ఏమైంది అని ట్రైలర్ లోనే చూపించారు.
దీంతో ఇది ఆల్మోస్ట్ సఖి సినిమా కథే అని అంతా అంటున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం(Manirathnam) నా ఫేవరేట్ అని అయన ఇన్‌స్పిరేషన్ తోనే ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాడు. ఇక ఖుషి సినిమాలో ఓ పాటలో మణిరత్నం సినిమా టైటిల్స్ వచ్చేలా ఒక పాట కూడా రాయించారు. దీంతో డైరెక్టర్ శివ నిర్వాణ మణిరత్నం సినిమా సఖినే తీసుకొని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చారేమో అని కామెంట్స్ వస్తున్నాయి. ఒక నెటిజన్ ఒక అడుగు ముందుకేసి సఖి సినిమా ఖుషి ట్రైలర్ ని కలుపుతూ సేమ్ షాట్స్ ని కట్ చేసి వీడియో కూడా తయారుచేశాడు. ఆ వీడియో చూశాక ఖుషి స్టోరీ కచ్చితంగా సఖి సినిమా స్టోరీనే అనిపిస్తుంది.