Viral Video: ఛావా సినిమా చూసి అక్కడకు పరుగులు తీస్తున్న జనాలు.. బంగారం దొరుకుతోందని..

మొగల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు కూడా దొరికాయని కొందరు చెబుతుండడం గమనార్హం.

Viral Video: ఛావా సినిమా చూసి అక్కడకు పరుగులు తీస్తున్న జనాలు.. బంగారం దొరుకుతోందని..

Updated On : March 8, 2025 / 1:52 PM IST

విక్కీ కౌశల్‌ నటించిన ఛావా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో ఈ సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఛత్రపతి శివాజీ మరణానంతరం మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు చేసిన కుట్రల వంటివి ఈ సినిమాలో చూపారు.

ఈ సినిమాలో కోశాగారం, మొగల్‌ పాలకులు బంగారం దాచిన చోటు వంటివి ఉన్నాయి. దీంతో ఈ సినిమా చూసిన మధ్యప్రదేశ్‌ ప్రజలు మొగల్‌ పాలకులు అప్పట్లో దాచిన బంగారం ఇంకా అక్కడే ఉందని అనుకుని అక్కడికి వెళ్లి పసిడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: వెబ్‌సైట్లో ‘టెన్త్’ హాల్‌టికెట్లు.. విద్యార్థులకు ఏమన్నా సమస్యలుంటే ఈ నంబరుకు ఫోన్‌ చేయండి.. వెంటనే..

మొగలులు దోచుకున్న నిధిని మధ్యప్రదేశ్‌లోని అసిర్‌గఢ్ కోట సమీపంలో దాచుకున్నారని ప్రజలు అక్కడ బంగారం కోసం తవ్వుతున్నారు. బుర్హాన్పూర్‌లో ఉన్న మొగల్ కాలం నాటి బంగారాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆశతో జనాలు పరుగులు తీశారు. నిజంగానే బంగారం దొరుకుతుందని వదంతులు వ్యాప్తి చెందుతుండడంతో స్థానికులు చాలా మంది అక్కడకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రాత్రి సమయంలోనూ టార్చ్ లైట్లు, జల్లెడలు, మెటల్ డిటెక్టర్లతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ కనపడ్డారు. బుర్హాన్‌పూర్‌ను బంగారు గనిగా ఛావా సినిమాలో పేర్కొన్నారని, అందుకే ఇక్కడ ప్రజలు పసిడి కోసం జల్లెడ పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేశారు.

ఓ దర్గా సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జేసీబీతో మట్టిని తవ్వి దాన్ని పొలంలో పడేశారు. ఆ తర్వాత అక్కడ కార్మికులు అక్కడ పురాతన కాలం నాటి లోహ నాణేలను కనుగొన్నట్లు వదంతులు వస్తున్నాయి. మొగల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు కూడా దొరికాయని కొందరు చెబుతుండడం గమనార్హం. స్థానికులు నిజంగానే నాణేలు దొరుకుతున్నారని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.