మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మూత్ర విజర్జన చేస్తున్నారనే కారణంతో ఇద్దరు చిన్నారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 25)న ఉదయం 6.30 గంటల చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మృతుల్ని రోష్నీ 12), అవినాష్(10)లు గుర్తించారు.
ఇది శివపురి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేవేఖాడి గ్రామంలోని సిర్సోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై థాకాడ్ మాట్లాడుతూ..భావేకేడి గ్రామంలో పంచాయితీ ఆఫీసు ముందు మల మూత్ర విసర్జన చేసినందుకు ఇద్దరు దళిత పిల్లలను ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారనీ..ఈ దాడిలో వారిద్దరు చనిపోయారని తెలిపారు. పిల్లలపై దాడికి పాల్పడిన నిందితులు హకీమ్ యాదవ్ అతని సోదరుడు రామేశ్వర్ యాదవ్ లను అరెస్ట్ చేశామని కేసు నమోదు చేసుకుని వారిని విచారిస్తున్నామని తెలిపారు. మృతులు దళితులు కాబట్టి నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టామని తెలిపారు.
చిన్నారుల తండ్రి వాల్మీకి మాత్రం తమ పిల్లలను కావాలనే హత్య చేశారనీ ఆరోపిస్తున్నాడు. ఇది పిల్లలు చేసిన పని కోసం జరిగిన హత్యలు కాదనీ బేవేఖాడి గ్రామంలో కుల వివక్ష ఉంది. తాము దళితులమనే ఈ వంకతోనే తమ పిల్లలను హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. దళితులమైనందుకు తాము గ్రామంలో ఉన్న హ్యాండ్ పంపులో నీటిని పట్టుకోవాలంటే..అగ్రకులస్థుల అనుమతితోనే పట్టుకోవాలనే ఆంక్షలు పెట్టారని వాపోయాడు. ఈక్రమంలో గత రెండు సంవత్సరాల క్రితం సదరు నిందితులతో గొడవ జరిగిందనీ..అది మనస్సులో పెట్టుకుని తమ పిల్లలు మత మూత్ర విసర్జన చేస్తున్నారనే సాకుతో వారిపై దాడి చేసి చంపేశారనీ ఆరోపిస్తున్నాడు.
తన సోదరి, సోదరుడి మృతిపై మనోజ్ మాట్లాడుతూ..తమ ఇంటిలో మరుగుదొడ్డి లేదని..దీంతో తాము బైటకే వెళుతుంటామని గ్రామంలో కుల వివక్షతో తమను నానా హింసలకు గురిచేస్తున్నారని అన్నాడు. ఈ ఘటనతో బేవేఖాడి గ్రామంలో కలకలం రేగింది. దీంతో పోలీసులు శాంతి భద్రతల రీత్యా భారీ మోహరించారు. కేసుపై విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.