దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయని తెలిపింది.
దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. మహారాష్ట్రలో 7కొత్త కేసులతో కలిసి ఇప్పటివరకు 203 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన చాలా మరణాలలో సహ-అనారోగ్యం(కరోనాతో పాటుగా ఇతర దీర్ఘకాల అనారోగ్యసమస్యలు) ప్రధాన పాత్ర పోషించిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ అన్నారు. డేటాను రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) నిర్వహిస్తున్న టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వందలాది మంది వలసదారులు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో….రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని కేంద్రం ఆదివారం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ వ్యవధిలో ప్రయాణించిన ప్రజలందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 14 రోజుల నిర్బంధంలో ఉంచాలని కూడా తెలిపింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులు,జిల్లాల మధ్య పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో కాలంలో ఎటువంటి కోత లేకుండా కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చూడాలని కేంద్రం తెలిపింది.