సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో తీవ్ర కలకలం, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

117 gelatin sticks seized in Kozhikode railway station: కేరళ కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం రేగింది. భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. చెన్నై-మంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్దాలను మహిళా ప్రయాణికురాలి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ చెన్నై వాసిగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైలులో పేలుడు పదార్థాలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. వెంటనే అప్రమత్తమై కోజికోడ్ స్టేషన్‌లో చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకుంది.

బావులను తవ్వేందుకు పేలుడు పదార్ధాలు:
బావులను తవ్వేందుకు ఈ జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తున్నట్లు విచారణలో ఆ మహిళ వెల్లడించింది. అయినప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేరళలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇలాంటి సమయంలో భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది.

ముకేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం:
గురువారం(ఫిబ్రవరి 25,2021) ముంబైలో కూడా భారీగా పేలుడు పదార్థాలు లభించిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ఉండే ముంబైలోని యాంటీలియా భవనం దగ్గర స్కార్పియో కారు కలకలం రేపింది. పచ్చ రంగు ఉన్న ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. అంబానీ ఇంటి దగ్గర కారు పార్క్ చేసి ఉండడంతో అనుమానంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆ కారును పరిశీలించింది. ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు.

రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కారును తరలించారు. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఈ ప్రాంతం ఒకటి. అందులోనూ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ఉన్న చోట. అలాంటి ప్లేస్ లో జిలెటిన్ స్టిక్స్‌ దొరకడం సంచలనంగా మారింది. ఇది మరువక ముందే కోజికోడ్ రైల్వే స్టేషన్ భారీగా స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం కలకలానికి దారితీసింది.

ట్రెండింగ్ వార్తలు