Indore couples: సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోతోంది. ఒక మనిషి ఎలాంటి వాడో తెలియడానికి వారి సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తే చాలు అనేలా పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు రద్దవుతున్నాయి.
నిశ్చితార్థం జరిగాక పెళ్లిని రద్దు చేసుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. మధ్యప్రదేశ్, ఇండోర్‌లో 40 రోజుల్లో 150 జంటలు పెళ్లిళ్లను రద్దు చేసుకున్నాయి. వాటిలో 60-70 శాతం వివాహాలు రద్దు కావడానికి సోషల్ మీడియాతోనే కారణమని తెలిసింది.
ప్రధాన కారణంగా అమ్మాయి, అబ్బాయి పెళ్లికి ముందే వేరే వారితో కొనసాగించిన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు ఉన్నట్టు తెలిసింది. ఓ హిందీ మీడియా కంపెనీ నిర్వహించిన సర్వేలో ఇది తేలింది. మిగిలిన వివాహాలు కుటుంబ సభ్యుల మరణాల వల్ల లేదంటే విభేదాల వంటి కారణాల వల్ల రద్దయ్యాయి.
ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చాల్ పెళ్లి వేడుక కూడా ప్రారంభానికి ముందే రద్దయిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో పెళ్లిళ్లు రద్దు కావడం సాధారణంగా మారుతోంది.
తాజాగా ఇండోర్, గుజరాత్‌కు చెందిన ఒక జంట మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ సమయంలో గొడవ చెలరేగింది. వధువు పాత పోస్టులపై వాదన తలెత్తడంతో పెళ్లి రద్దు చేసుకుంది. మరో ఘటనలో, దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్వహించిన పెళ్లిలో సంగీత్ తర్వాత వధువు కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె ఇంకొకరితో సన్నిహిత సంబంధంలో ఉన్నట్టు తేలింది.
గతంలో వరకట్నం పెళ్లి రద్దులకు ప్రధాన కారణంగా ఉండేది. ఇప్పుడు 60-70 శాతం ఘటనలు సోషల్ మీడియాతో సంబంధం కలిగి ఉంటున్నాయి. వధూవరుల పాత పోస్టులు, కామెంట్లు, లైకులు, ఎమోజీలు, ఫ్రెండ్ లిస్టులు కూడా కారణాలుగా మారుతున్నాయి.