Operation Sindoor Updates: ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై భారత విదేశాంగ, రక్షణశాఖలు సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలపై ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చారు. ఇవాళ్టి వైమానిక దాడులపై వివరణ ఇచ్చారు అధికారులు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడిందని, ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. నిన్నటి నుంచి కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెందార్, రాజౌరి సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడుతోందన్నారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోందని వ్యోమికా సింగ్ అన్నారు.
‘పాకిస్తాన్ గౌరవిస్తే భారతదేశం ఉద్రిక్తతలను నివారించడానికి కట్టుబడి ఉంది’- వ్యోమికా సింగ్
“జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి ప్రాంతాలలో పాకిస్తాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఆర్టిలరీలను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల తీవ్రతను పెంచింది. పాకిస్తాన్ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారత్ ప్రతి స్పందించాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం గౌరవిస్తే, ఉద్రిక్తతలను నివారించడానికి భారత సాయుధ దళాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి” అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రత్యేక MEA బ్రీఫింగ్‌లో తెలిపారు.
పాక్ లోని మిలటరీ స్థావరాలను మేము టార్గెట్ చేయలేదని, కేవలం టెర్రరిస్ట్ స్థావరాలపైనే దాడి చేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. టెర్రరిస్టులకు పాక్ అడ్డాగా మారిందని, సీమాంతర తీవ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు.